మహాద్భుతం

ABN , First Publish Date - 2023-05-29T00:43:23+05:30 IST

వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ నింపిన తెలుగు పౌరుషం, ఆత్మాభిమానం, తెలుగోడి సత్తా మూడింటిని రంగరించి తెలుగు తేజం మహాద్భుతమైంది. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం, మహానాడు జరిగే రాజమహేంద్రంవైపు జన ప్రవాహం ఉప్పొంగింది.

మహాద్భుతం
ఏలూరు నుంచి కార్లలో మహానాడుకు బయలుదేరి వెళ్తున్న టీడీపీ శ్రేణులు

తెలుగు పండుగకు వెల్లువలా కదిలిన జనం

హైవేపై వాహనాల వరద

ఆర్టీసీ బస్సులు ఇవ్వకున్నా సొంత వాహనాల్లోనే పయనం

పల్లెల నుంచి భారీగా రైతులు, మహిళలు

నియోజకవర్గాల మధ్య భారీ పోటీ

40 వేల మందికి చింతమనేని విందు

దారి పొడవునా ఎన్టీఆర్‌ విగ్రహాలకు నీరాజనాలు

ఎక్కడికక్కడ వైసీపీ పరోక్ష ఆటంకాలు

అయినా కాస్కో.. చూస్కోమన్న తెలుగు తమ్ముళ్లు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ నింపిన తెలుగు పౌరుషం, ఆత్మాభిమానం, తెలుగోడి సత్తా మూడింటిని రంగరించి తెలుగు తేజం మహాద్భుతమైంది. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం, మహానాడు జరిగే రాజమహేంద్రంవైపు జన ప్రవాహం ఉప్పొంగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న జనం ఉమ్మడి పశ్చిమను ద్వారా గోదారి దాటింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు హైవే వెంబడి వాహనాల వరద సాగింది. తెలుగుదేశంకు విజయ సంకేతం అందించే విధంగా జనం వేలల్లో సాగారు. పసుపు జెండా చేతబట్టి వీర సైనికులుగా మారారు. నియోజకవర్గ కన్వీనర్లు ఇప్పటికే రాజమహేంద్ర వరంలో తిష్టవేసినా ఎక్కడికక్కడ సమన్వయంతో ఉమ్మడిగా నేతలు, కార్య కర్తలు, సాధారణ జనం సాగడం పార్టీకి కొత్త శక్తిని ఇచ్చింది. పార్టీ గెలుపే ఉమ్మడి జవాబుగా వీరంతా ఇచ్చిన సంకేతాలు అబ్బురపరిచే విధంగా ఉన్నా యి. మహానాడు అంటే మహాద్భుతంగా అభివర్ణించే తెలుగు తమ్ముళ్లు జన కెరటమై మహానాడుకు చేరారు.

ఎక్కడిచూసినా జనమే జనం

గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం మహానాడుకు ఆవిర్భావ ఏర్పాట్లే కార్యకర్తల్లో నూతన శక్తిని రగిల్చాయి. తెలుగోడికి ఉన్న అభిమానాన్ని భుజం తట్టి స్ఫూర్తి నింపాయి. పౌరుషాన్ని తట్టి లేపాయి. తాడోపేడో అన్నట్టుగా ఎక్కడికక్కడ సాధారణ జనం సైతం స్థానికంగా వచ్చే బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గకుండా వాహనాలకు పసుపు జెండా కట్టారు. వాటిలోనే మహానాడుకు తరలారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ఆదివారం నిర్వ హించిన మహానాడుకు పల్లెల నుంచి పెద్ద ఎత్తున యువత, రైతులు, మహిళలు అధిక సంఖ్యలో ముందుకు సాగారు. వేకువ జాము నుంచే నిర్దేశించిన వాహనాల్లో ఎవరంతట వారుగా ఊరూగా కూడబలుక్కుని మండల స్థాయిలో ఒకటై ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రానికి వచ్చి కొన్నిచోట్ల ఉమ్మడిగా, మరికొన్ని చోట్ల విడివిడిగా జన కెరటమై ముందుకు సాగారు. గోదావరి ఆవలి ఒడ్డున మహానాడు సాగుతుండగా ఉమ్మడి పశ్చిమాన దాదాపు అన్ని నియోజకవర్గాలు కదిలాయి. తెలుగుదేశం అధినాయకత్వం ఆశించిన దానికంటే అధిక సంఖ్యలోనే జనం ముందుకు సాగారు. ఆర్టీసీ బస్సు లు కేటాయించలేమని మొరాయించినా, జగన్‌ సర్కార్‌ మోకాలడ్డినా తెలుగు సత్తా ముందు ఇవేవీ ఆగలేదు. అంతకంటే మించి ఎప్పుడైతే ఆటంకాలు సృష్టించారో దానినే సవాల్‌గా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లోను ముఖ్య నేతలు, కార్యకర్తలు ముందుకే సాగారు.

జై ఎన్టీఆర్‌, జై తెలుగుదేశం

ప్రతీ నియోజక వర్గంలోను కార్యకర్తలు వేకువజాము నుంచి మహానాడుకు బయలుదేరివెళ్లే ముందు వరకు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు రహదారులన్నీ జై ఎన్టీఆర్‌, జై తెలుగుదేశం నినాదాలతో ఉదయం నుంచే మార్మోగాయి. తెలుగుదేశంలో ఈ ఉత్సాహాన్ని చూసి వైసీపీ నేతలే షాక్‌ తిన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో చడీచప్పుడు కాకుండా వందలాది వాహనాల్లో కార్యకర్తలను వెంటేసుకుని ముఖ్య నేతలంతా ముందుకు సాగారు. ఆచంట నియోజకవర్గంలో కార్యకర్తలు సందడి చేశారు. ఎక్కడి కక్కడ కూడబలుక్కుని పెద్ద సంఖ్యలో వాహనాల్లో ర్యాలీగా రాజమహేంద్రవరం వైపు సాగారు. ఉంగుటూరు టోల్‌గేటు వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ఎవరం తట వారుగా తణుకు నియోజకవర్గంలో అందరినీ సమన్వయపరిచి మహానాడు దారిపట్టారు.

వస్తున్నాం కాసుకోండి..

మహానాడు పండుగకు ముందే తెలుగుదేశంలో హుషారు నెలకొంది. నిన్నమొన్నటి వరకు సర్కార్‌ అక్రమ కేసులకు, సంక్షేమ పథకాలు తీసేస్తామని బెదిరింపులకు కాస్తంత వెనుకడుగు వేసేవారు. ఇప్పుడు దానికి స్వస్తి చెప్పి ఇక కాస్కో.. చూస్కో అంటూ వైసీపీకి సవాల్‌ విసిరేలా ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, పోలవరం వంటి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం శ్రేణులు వేల సంఖ్యలోనే ముందుకు సాగారు. ఒకవైపు అధికార వైసీపీ మహానాడుకు వెళ్తే.. ఆ తర్వాత చూసుకోండంటూ పరోక్షంగా బెదిరించారు. డ్వాక్రా గ్రూపులను ఊరు దాటితే అన్నట్టుగా వార్నింగ్‌లు ఇచ్చారు. వీటిని ఖాతర్‌ చేయకుండా మహిళలు పెద్ద సంఖ్యలోనే మహానాడుకు తరలివెళ్లారు. దాదాపు రెండు లక్షల మంది వరకు ఉమ్మడి పశ్చిమ నుంచే జనం ముందుకు సాగడం విశేషం. నియోజకవర్గ కన్వీనర్లు ఈసారి పకడ్బందీగా వ్యవహరిం చారు. ఆర్టీసీ బస్సులు సమకూర్చలేకపోయినా గ్రామస్థాయి నుంచి నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారందరితో సంప్రదింపులు చేసి వాహనాలను కార్యకర్తలు సమకూర్చారు. ఒక రకంగా తొలుత వందల్లోనే ఉన్న ఈ వాహనాల సంఖ్య ఆదివారం నాటికి వేలల్లోకి చేరాయని అంచనా. రాజమహేంద్రవరం మహానాడు వేదికపైనా ఉమ్మడి పశ్చిమ నేతలు అక్కడక్కడ మెరిశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ పార్టీ నిధికి వీలుగా చంద్రబాబు నాయుడుకు రెండు లక్షల చెక్కును అందించారు. పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడినంటూ ప్రకటించారు. మరోవైపు యువనేత నారా లోకేశ్‌తోను పార్టీ నియోజకవర్గ కన్వీనర్లంతా ఎక్కడికక్కడ కలిశారు. పార్టీ శాసన సభ ఉపనేత నిమ్మల రామానాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, పార్టీ కన్వీనర్లు బొరగం శ్రీనివాస్‌, చింతమనేని ప్రభాకర్‌, బడేటి చంటి, వలవల బాబ్జీ, ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, మంతెన రామరాజు, మద్దిపాటి వెంకట్రాజు, మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, ముళ్ళపూడి బాపిరాజు, అధికార ప్రతినిధి శ్యామ్‌ చంద్ర శేషు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, పార్టీ పరిశీలకుడు కోళ్ళ నాగేశ్వరరావు వంటి వారంతా మహానాడుకు హాజరయ్యారు.

Updated Date - 2023-05-29T00:43:23+05:30 IST