గడప గండం!
ABN , First Publish Date - 2023-04-02T23:14:55+05:30 IST
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో గండం ఉంటుంది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతీ రెండు నెలలకోమారు గడప గండం ఎదురవుతోంది. ఈ సమయం వచ్చేసరికి ఎవరికీ చెప్పుకోలేక, మరెవరితో సమీక్షించలేక లోలోన మదనపడతారు.
మూడు నెలలకోమారు
ఎమ్మెల్యేలకు మొట్టికాయలు
ఇంతకుముందు ఆ నలుగురికే మైనస్
ఇదే దారిలో ఇంకొందరు సిట్టింగ్‌లు
సీటుకి, గడపకు ముడిపెట్టి బంతాట
ఊరిస్తున్న ‘పదవి’ వస్తుందా.. రాదా ?
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో గండం ఉంటుంది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతీ రెండు నెలలకోమారు గడప గండం ఎదురవుతోంది. ఈ సమయం వచ్చేసరికి ఎవరికీ చెప్పుకోలేక, మరెవరితో సమీక్షించలేక లోలోన మదనపడతారు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా గడపగడపకు కార్యక్రమాన్ని నిర్దేశించి ఎమ్మెల్యేల ముందు ఉంచింది. చెప్పింది చేయండి..ఎక్కే గడప దిగేగడపగా ఉండాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ లక్ష్యాలు విధించింది. ఆ వెంటే నిఘా పెట్టి నీడలా వెన్నాడుతోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఎలాగంటూ విద్యార్థులు పడే టెన్షన్ మాదిరిగానే సీఎం జగన్ దీనిపై సమీక్షిస్తుంటే ఎమ్మెల్యేలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. నేడు ఆ తరహా సమీక్షే జరగబోతుంది. ఈసారి అక్షింతలు ఎవరికో..
సర్కారులో అడుగిడిన తర్వాత నాలుగేళ్ల కాలం ఇట్టే గడిచి పోయింది. కరోనా అనంతరం పార్టీ పటిష్టత కోసం ఎమ్మెల్యేలంతా గడపగడపకు మన ప్రభుత్వం పేరిట కలియతిరగాలని, ప్రజలతో మమేకం కావాలని సీఎం జగన్ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు నిర్దేశించారు. ఆ వెంటనే ఐప్యాక్ రంగంలోకి దిగింది. ఇంకోవైపు ప్రభుత్వ నిఘా వర్గాలు ఎలాగూ ఉంటాయి. వెరసి ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది, మరే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా సాగిస్తున్నది, ఇంకొన్ని చోట్ల తమ మాటను పెడచెవిన పెట్టేసి ఎవరు మొండిగా వ్యవహరిస్తున్నారనే దానిపై ప్రతీ మూడు నెలలకోమారు సీఎం స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన సమీక్షల్లో అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆళ్ళ నానికి మైనస్ మార్కులు పడ్డాయి. ఆ తదుపరి నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు గడప ఎక్కడంలో వెనుకబడ్డారంటూ సమీక్షలో సీఎం తేల్చేశారు. ఆఖరుకి హోం మంత్రి తానేటి వనిత సైతం తన సొంత నియోజకవర్గం కొవ్వూరులో ఈ కార్యక్రమా నికి తగిన సమయం కేటాయించ లేకపోతున్నా రంటూ సీఎం ‘రిమార్కు’ చేశారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కాస్తంత వెనుకబడ్డా రంటూ చురకలేశారు. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారా యణలు పార్టీ పేర్కొన్నట్టుగా కాకుండా తమకు బదులుగా తమ వారసులను గడపగడపకు పంపడాన్ని గత సమీక్షలో జగన్ స్వయంగా ప్రస్తావించారు. ఇలాంటి వ్యవహారం కుదరదని, ఇంటింటికీ మీరే వెళ్లాలని మరోమారు అప్పట్లో సూచించారు. అయినప్పటికీ పాత పద్ధతుల్లో పెద్ద మార్పు జరగలేదు. గోపాలపురం, నరసాపురం వంటి నియోజకవర్గాల్లో కాస్తంత మెరుగుదల ఉన్నా మిగతా నియోజక వర్గాల్లో వెనుకంజే కనిపిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇంతకీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అధికార వైసీపీ గ్రాఫ్ అనేక నియోజకవర్గాల్లో తగ్గుముఖం పడు తుందని, ఎమ్మెల్యేలు ప్రజాదరణ కోల్పోతున్నారని, దీనికంతటికీ కారణం వలంటీర్ వ్యవస్థేనని ఇంతకు ముందే ఎమ్మెల్యేలు పైకి చెప్పుకోలేక మదనపడుతూ వచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమా న్ని పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రభుత్వ కార్యక్ర మంగానే నిర్వహించారు. ప్రతీ సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నట్టు చెబుతూనే ఏమైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ఈ నిధులంటూ గతంలోనూ ఓ రాయి విసిరారు. దీనిలో భాగంగానే కొత్త జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్యే లతో ముఖాముఖి మాట్లాడి మీరు చెప్పిన సమస్య లన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినా ఇప్పటికీ అవన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాని నియో జక వర్గాల్లో పరిస్థితి పార్టీకి, ప్రభుత్వానికి అంత సానుకూలంగా లేదనే వాస్తవాన్ని పైకి చెప్పలేక పోయినా ఇంకోవైపు మాకు తిరుగే లేదన్నట్టుగా ఎమ్మెల్యేలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
అందరిదీ ఒకటే బాధ
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని నియోజక వర్గాల్లోనూ వైసీపీ శ్రేణుల్లోను సరికొత్త ప్రశ్న ఉద్భవిస్తోంది. ఈ నాలుగేళ్లల్లో తాము అనుకు న్నట్టుగా ప్రజలను ఎక్కడ ఆకట్టుకోగలిగా మంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే బటన్ నొక్కుడు పథకాలతో వలంటీర్లు జనంకు చేరువయ్యారే తప్ప పార్టీ నేతలుగా తామంతా ఎన్నడో కనుమరు గైపోయామంటూ స్థానిక నేతలు పదేపదే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చి దీనిని సీఎం చెవిన వేయాలని కోరుతూ వచ్చారు. దీనికితోడు స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు లక్షలు తగలేసి పదవులు దక్కించుకున్నవారంతా కనీసం అధికారుల నుంచి తమకు గౌరవం లభించడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరందరినీ బతిమలాడి, బామాలి పార్టీ కార్యక్రమాల్లో మమేకం చేయడానికి ఎమ్మెల్యేలు కుస్తీలు పడాల్సి వస్తోంది. ‘ఒక రకంగా చెప్పాలంటే మీకంటే మేం గొప్పగా ఏమీ లేము. ప్రభుత్వం వద్ద డబ్బులేదు. ఏదైనా కొత్తగా సీఎంను ఒప్పించి నిధులు తెద్దామన్నా సాధ్యపడడం లేదు. అందుకనే సంక్షేమ కార్యక్రమాలకే అంతా పెడుతున్నారు. కాస్త ఓపిక పట్టండి. అంతా సర్దుకుంటుంది’ అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతి నిధులను బుజ్జగిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
ఈసారి వంతెవరిది
గడపగడపకు మన ప్రభుత్వం సమీక్ష సోమవారం జరగనుంది. ఈసారి ఏ ఎమ్మెల్యేలు మైనస్ మార్కులో పడతారు, మరెంతమంది ప్రోగ్రెస్‌లో ఉంటారు, ఇంకెవరికైనా మంత్రి పదవుల ఛాన్స్‌లు ఉంటాయా, ఆ మేరకు ఏమైనా ప్రస్తావన చేస్తారా.. అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే లంతా తెగ ఉత్కంఠలో పడ్డారు. ఈ కార్యక్రమం సమీక్షించి నప్పుడల్లా ఉమ్మడి పశ్చిమలో ఎవరో ఒకరు మైనస్‌లోనే పడు తున్నారు. ఈసారి కూడా ఒకరిద్దరు ఆ వరుసలో ఉన్నారని చెబుతున్నారు. సీఎం జగనే స్వయంగా ఎవరెవరు వెనుకబడ్డారనే విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తుండడం ఎమ్మెల్యేల్లో కాస్త కంగారే రేపుతోంది. దీనికితోడు ప్రత్యేకించి గడపగడపకు కార్యక్రమంలో ప్రోగ్రెస్ లేనివారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమనే సంకేతాలు ఇస్తుండడం ఎమ్మెల్యేల భయానికి మరో కారణంగా మారింది. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అదికూడా ముందస్తు ఎన్నికలకు ఆస్కారం ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్న వేళ ఒకవేళ ఏదైనా సీఎం పలానా వారికి సీటు ఇవ్వబోమంటూ ప్రస్తావిస్తే ఇక తమ పని అయి పోయినట్టుగానే సిట్టింగ్‌లు అనుమానంతో ఇప్పటికే బెంగలో పడినట్టు చెబుతున్నారు. గడిచిన మూడు నెలల్లో గడపగడపకు కార్యక్రమంలో కొందరు సిట్టింగ్‌లకు జనం నుంచి నిరసనలు రావడం ఇంకో కారణంగా భావిస్తున్నారు. అన్నింటికంటే మించి తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి మైనస్‌గా మారాయని, ఇక దాంతో అధిష్ఠానం కూడా నిర్మొహ మాటంగా కొన్ని విషయాలపై మొహం మీద మాట్లాడేటట్టుగా ఉందని ఇంకొందరి సమాచారం.
ఎమ్మెల్యేలకు కొత్త టార్గెట్
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కొద్ది రోజుల వ్యవధిలోనే ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ కోవలోనే ఉమ్మడి పశ్చిమలో ప్రస్తుతం మంత్రు లుగా తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ పేరు తెర ముందు కొచ్చింది. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల అనంతరం అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, లేదా అనే సందిగ్ధత ఇప్పుడు పార్టీలోనూ ఉంది. జగనన్న పేరిట ఈనెల 7 నుంచి 14 వరకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. గడప గడపకు సమీక్షలోనే దీనిపైనా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతు న్నారు. ప్రతీ గడపకు ఒక బుక్‌లెట్‌ను పంపిణీ చేయాలని, మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీ కుటుంబానికి జరిగిన మేలు ఇదంటూ సోత్కర్షతో కూడిన వివరాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ రెండింటిని ముడిపెట్టి ఎమ్మెల్యేలకు కొత్త టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంది.