Anam Ramanarayana Reddy: ఆనంకు వైసీపీ అధిష్టానం షాకింగ్ మెసేజ్‌

ABN , First Publish Date - 2023-01-19T21:30:42+05:30 IST

దాదాపు మూడు దశాబ్దాలపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఆనం కుటుంబానికి ఇప్పుడు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి.

Anam Ramanarayana Reddy: ఆనంకు వైసీపీ అధిష్టానం షాకింగ్ మెసేజ్‌

నెల్లూరు: దాదాపు మూడు దశాబ్దాలపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఆనం కుటుంబానికి ఇప్పుడు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఆ కుటుంబ పెద్ద, సీనియర్‌ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy)కి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో, ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రజల మధ్యలోనే వైసీపీ అధిష్ఠానం అవమానాలకు గురిచేస్తోంది. వెంకటగిరిలో కాలు కదపడానికి వీల్లేకుండా ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. రాష్ట్రమంతా వైసీపీ (YCP) సిటింగ్‌ ఎమ్మెల్యేలే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జులుగా కొనసాతుండగా అందుకు భిన్నంగా వెంకటగిరి (Venkatagiri)లో మాత్రం నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి (Nedurumalli Ramkumar Reddy)ని ఇన్‌చార్జిగా నియమించారు. ఆనంతో మాటమాత్రంగా కూడా సంప్రదించకుండా వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతటితో ఆగకుండా ఆనం మాటకు విలువ ఇవ్వాల్సిన పనిలేదు.. నేదురుమల్లి రాంకుమార్‌ మాట వినండి అన్ని జిల్లా ఉన్నతాధికారులను పార్టీ పెద్దలు ఆదేశించారు. ఆ వెనువెంటనే ఆనం వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ కుదించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన్ను దూరం చేశారు. గురువారం ఆనం రామనారాయణరెడ్డికి రాష్ట్ర పార్టీ హై కమాండ్‌ నుంచి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఇంత కాలం మీరు సహకరించినందుకు ధన్యవాదాలు అని ఆ మెసేజ్‌లో ఉన్నట్లు వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

వైసీపీ హై కమాండ్‌ ఇక్కడితో ఆగుంటే ఈ సందేశాన్ని పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. గడప గడపకు కార్యక్రమంలో ఆనం బాగా కష్టపడుతున్నారనే ఉద్దేశంతో హైకమాండ్‌ ధన్యవాదాలు తెలిపిందని భావించవచ్చు. కానీ ఈ సందేశానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఒక సందేశం అందింది. ఇకపై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని ఫాలోకండి.. అని ఆదేశించింది. ఒకే సమయంలో వెలువడిన ఈ రెండు సందేశాలను గమనిస్తే ప్రభుత్వ కార్యక్రమాలకు ఇక మీరు వెళ్లాల్సిన అవసరం లేదని ఆనంకు.. ఆయన వెళ్లినా ఆయన వెంట మీరు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులకు సందేశాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా అధికారాలు చేపట్టిన ఒక ప్రజాప్రతినిధికి, ప్రజా సేవకులైన ఉద్యోగుల నుంచి ఎలాంటి సహకారం అందకుండా చేసే అరుదైన సందర్భానికి రాజులేలిన వెంకటగిరి వేదికగా మారడం విశేషం.

Updated Date - 2023-01-19T21:40:27+05:30 IST