Lokesh : పబ్జీ జగన్‌ 420.. వైసీపీ నేతలు 840లు

ABN , First Publish Date - 2023-08-09T04:08:47+05:30 IST

నరసరావుపేట, ఆగస్టు 8: పబ్జీ జగన్‌ ఇంట్లో దొంగలు పడ్డారని తేలిపోయిందని, ఏకంగా 225 ఫైళ్లపై డిజిటల్‌ సంతకాలు చేసుకొని రూ.వందల కోట్లు దోచేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

 Lokesh : పబ్జీ జగన్‌ 420.. వైసీపీ నేతలు 840లు

వారంతా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.. దొంగ ఇంట్లోనే దొంగలు ఎలా పడ్డారు..?

225 ఫైళ్లు క్లియర్‌ చేసుకొని వందల కోట్లు దోచేశారు

ఆ సమయంలో జగన్‌ పబ్జీ ఆడుతున్నాడు..

జగన్‌ ప్రజల రక్తం తాగుతాడు

యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ధ్వజం..

గురజాలలో పాదయాత్రకు బ్రహ్మరథం

గుంటూరు (పిడుగురాళ్ల) (ఆంధ్రజ్యోతి), నరసరావుపేట, ఆగస్టు 8: పబ్జీ జగన్‌ ఇంట్లో దొంగలు పడ్డారని తేలిపోయిందని, ఏకంగా 225 ఫైళ్లపై డిజిటల్‌ సంతకాలు చేసుకొని రూ.వందల కోట్లు దోచేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. అయితే ఇక్కడ తనకు మూడు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ‘‘మొదటిది.. ముఖ్యమంత్రి ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు..? రెండోది.. ఆ సమయంలో సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు..? ఇక మూడోది.. దొంగ ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు..?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. దొంగలు పడిన సమయంలో సీఎం జగన్‌ పబ్జీ గేమ్‌ ఆడుకొంటున్నారని ఆరోపించారు. సైకో జగన్‌ 420 కాబట్టి ఆయన చుట్టూ ఉండేది కూడా వాళ్లేననని, వైసీపీ నాయకులు 840లుగా మారి రాష్ట్రాన్ని దోచేస్తోన్నారని విమర్శించారు. లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 178వ రోజైన మంగళవారం గురజాల నియోజకవర్గంలోని జూలకల్లు నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడిగొప్పల అడ్డరోడ్డు, పందిటివారిపాలెం క్రాస్‌, జానపాడు మీదుగా పిడుగురాళ్లకు చేరింది. జానపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు.

జగన్‌ అంతటి పిరికోడిని చూడలేదు

‘‘జగన్‌ అంత పిరికోడిని ఈ ప్రపంచంలో చూడలేదు. యువగళం పాదయాత్ర ప్రారంభించగానే గజగజ వణికిపోయాడు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేస్తుంటే ప్యాంటు తడుపుకొంటున్నాడు. వైసీపీ కుక్కలు రాళ్ల దాడి చేస్తున్నాయి. వాళ్ల రాళ్ల దాడికి భయపడే బులుగు జెండా టీడీపీది కాదు. బాంబులకే భయపడని పసుపు జెండా అని గుర్తు పెట్టుకోవాలి’’ అని హెచ్చరించారు. జగన్‌ కుడిచేత్తో రూ.10 ఇస్తాడని, ఎడమ చేత్తో రూ.100 లాగేసుకుంటాడని లోకేశ్‌ మండిపడ్డారు. అది ఎలాగో చెప్పేముందు ఒక క్విజ్‌ పెడుతున్నానని అన్నారు. ‘‘రోజూ జగన్‌ పడుకొనే ముందు ఏం తాగుతాడు..? మొదటి ఆప్షన్‌ బూమ్‌బూమ్‌, రెండోది.. ఆంధ్ర గోల్డ్‌, మూడోది.. ప్రెసిడెంట్‌ మెడల్‌, నాలుగోది.. ప్రజల రక్తం...’’ అని లోకేశ్‌ అనగానే వేలాది మంది ప్రజలు నాలుగు వేళ్లని చూపించి ‘ప్రజల రక్తం’ అని చెప్పారు..

పల్నాడు గడ్డపై నిలబడ్డా.. ఏం చేస్తావ్‌..?

ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌ రెడ్డి ఏవో మూడు పనులు చేసి తనకు సెల్ఫీ చాలెంజ్‌ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘లోకేశ్‌ రాకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చావు. కానీ ఏమైంది పల్నాడు గడ్డపై వచ్చి నిలబడ్డా ఏం చేస్తావ్‌..?’ అని మహేశ్‌రెడ్డిని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌లో రూ.వెయ్యి కోట్లు వెనకేసుకొన్నాడని అన్నారు. అందుకే ఈ సందర్భంగా ఆయన పేరు క్యాష్‌ మహేశ్‌ అని మారుస్తున్నానని అన్నారు. ఈ క్యాష్‌ మహేశ్‌ జగన్‌ జేబులో మనిషన్నారు. అంతకుముందు పాదయాత్రలో.. ధరల పెరుగుదల, అరాచక పాలనతో అవస్థలు పడుతున్నామని గురజాల ప్రజలు లోకేశ్‌కు తెలియజేశారు. జూలకల్లు, జానపాడు రైతులు తమ కష్టాలు విన్నవించారు. లోకేశ్‌ స్పందిస్తూ.. టీడీపీ ప్రభుత్వం రాగానే అందరి సమస్యలూ తీరుస్తామన్నారు. సీఎం జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతాంగ సమస్యలపై లేదన్నారు. నాగార్జునసాగర్‌ కుడికాలువకు నిర్వహణ లేక గేట్లు శిథిలావస్థకు చేరాయని, దిక్కుమాలిన ప్రభుత్వంలో గేట్లకు గ్రీజు పెట్టే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. ఈ కాలువ వద్ద సెల్ఫీ దిగారు. వచ్చే ఎన్నికల్లో యరపతినేని శ్రీనివాసరావుని భారీ మెజార్టీతో గెలిపించాలని గురజాల ప్రజానీకానికి లోకేశ్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ, చదలవాడ అరవింద్‌బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, బోండా ఉమా, శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

గురజాల నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పిడుగురాళ్ల పట్టణం జనంతో పోటెత్తింది. యరపతినేని నేతృత్వంలో 101 కలశాలతో లోకేశ్‌ను మహిళలు ఘనంగా స్వాగతించారు. సంప్రదాయ డప్పులు, థింసా నృత్యాలు, కేరళ వాయిద్యాలు, ఒంటెలు, గుర్రాలతో యువనేతకు ఘనస్వాగతం లభించింది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు, యువతను అప్యాయంగా పలకరిస్తూ లోకేశ్‌ ముందుకు సాగారు.

Updated Date - 2023-08-09T04:08:47+05:30 IST