YS Viveka Case Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-04-25T15:13:08+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదనలు బుధవారం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇక ఇదే కేసులో..

YS Viveka Case Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఏం జరిగిందంటే..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై (Avinash Reddy Anticipatory Bail Petition) విచారణ రేపటికి (బుధవారానికి) వాయిదా పడింది. వాదనలు బుధవారం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇక ఇదే కేసులో.. ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ వాదించింది. బెయిల్ రద్దుకు బలమైన కారణాలేమీ లేవని ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాది వాదించారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. అవినాశ్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ విడుదల చేసింది. ABN ఆంధ్రజ్యోతి చేతిలో కూడా ఉన్న ఈ ఆర్డర్ కాపీలో సుప్రీం కోర్టు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. మొత్తం 11 పేజీలతో సీజేఐ ధర్మాసనం సుదీర్ఘమైన ఆర్డర్ ఇచ్చింది. అవినాశ్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరుపై, తెలంగాణ హైకోర్టు వైఖరిపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు దశలో హైకోర్టు జోక్యం అవాంఛనీయమని సుప్రీం అభిప్రాయపడింది. సీబీఐ దర్యాప్తును నీరుగార్చేలా హైకోర్టు ఉత్తర్వులున్నాయని, హైకోర్టు తీరు ఏమాత్రం బాగాలేదని సీజేఐ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయమని సీజేఐ ఆ ఆర్డర్ కాపీలో పేర్కొంది. సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలను తప్పుగా అన్వయించుకుని హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడటం గమనార్హం.

సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అరెస్టు నుంచి కాపాడేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు లిఖితపూర్వక ప్రశ్నావళితో అవినాశ్‌రెడ్డిని విచారించాలన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘హైకోర్టు ఉత్తర్వుల్లో పరిణతి లేదు. తొలుత ముందస్తు బెయిలు.. ఆ తర్వాత ప్రశ్నావళి ఇచ్చి నిందితుడిని ప్రశ్నించాలనడం! ఇకపై ఇలాగే చేయాలని నిందితులంతా అడిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కేసు దర్యాప్తునకు ఇలాంటి మార్గదర్శకాలు పాటించాలా? అలాగైతే సీబీఐని మూసేసుకోవడమే మంచిది’ అని పేర్కొంది.

దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐకిచ్చిన గడువును పొడిగించాలని సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. లూథ్రా విజ్ఞప్తి చేయగా.. అవినాశ్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వ్యతిరేకించారు. ఈ నెల 30లోగా దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ తరఫున గతంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు హామీ ఇచ్చారని, అందువల్లే కోర్టు ఆ గడువు విధించిందని గుర్తు చేశారు. పైగా గడువు పొడిగించాలని సునీతారెడ్డి ఎలా కోరతారని ప్రశ్నించారు. అయితే గడువు పొడిగించాలని సొలిసిటర్‌ జనరల్‌ కూడా అభ్యర్థించడంతో ధర్మాసనం అంగీకరించింది. జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2023-04-25T15:13:13+05:30 IST