YSRCP Bus Yatra : వైసీపీ ఉక్కిరిబిక్కిరి!
ABN , First Publish Date - 2023-10-29T07:40:30+05:30 IST
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సంగతేమో గానీ.. గత మూడ్రోజులుగా చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వైఫల్యం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. ఇది గెలుపు ధీమాను పెంచడం కంటే..
అటు బస్సు యాత్ర తుస్సు..
ఇటు సమస్యలపై నిలదీత
చేష్టలుడిగిన వైసీపీ నేతలు
రోడ్లన్నీ దిగ్బంధించి బహిరంగ సభలు
అయినా పట్టించుకోని జనం
సభలకు వందల్లోనే హాజరు
అమరావతి/బాపట్ల/తగరపువలస/ప్రొద్దుటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో విజయం సంగతేమో గానీ.. గత మూడ్రోజులుగా చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వైఫల్యం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. ఇది గెలుపు ధీమాను పెంచడం కంటే.. ఉన్న కొద్దిపాటి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బస్సుపై నిల్చొని మంత్రులు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు వస్తుంటే.. రోడ్లన్నీ గుంతలతో వెక్కిరిస్తున్నాయి. బస్సు వాటిపై వెళ్తుంటే ఆ కుదుపులకు రైలింగ్ పట్టుకున్నవారు హడలిపోతున్నారు. తమకే ఇలా ఉంటే.. సామాన్య ప్రజలకు ఇంకెంత భాథ ఉంటుందో.. వారిలో ఆగ్రహం ఎంత కట్టలు తెంచుకుంటుందోనన్న అనుభవం తెనాలి బస్సుయాత్రతో నేతలకు తెలిసొచ్చింది. ఒళ్లు నొప్పులు భరించలేక మరుసటి రోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో నిర్వహించిన బీసీ యాత్ర విఫలం కావడంతో.. ఈసారి వ్యూహాత్మకంగా జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేదు. జనంలో వీసమెత్తు స్పందన కూడా లేదు. బెదిరించి మరీ తరలించుకొచ్చిన డ్వాక్రా మహిళలు, పథకాల లబ్ధిదారులు.. నేతల ప్రసంగాలు మొదలెట్టగానే పరారవుతున్నారు. కొందరైతే సమస్యలపై నిలదీస్తున్నారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో ముంచుకొస్తున్న తరుణంలో బస్సు యాత్ర వైఫల్యం ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుందేమోనన్న ఆందోళన వైసీపీ అధినాయకత్వంలో కనిపిస్తోంది. అందుకే భారీగా జనసమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. దీంతో అంగన్‌వాడీలు, మహిళా సంఘాలతో పాటు.. జనాన్ని తరలించే ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు పదును పెట్టారు. నాలుగు రోడ్ల జంక్షన్లో, రద్దీ ప్రదేశాల్లో సభలు పెడుతున్నా.. మూడు నుంచి నాలుగు వందలకు మించి జనం రావడం లేదు.
మూడోరోజూ అదే సీన్
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకేసారి ఈ నెల 26న సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ జనం పెద్దగా రాలేదు. యాత్రకు జన సమీకరణ కోసం 150 ఆర్‌టీసీ బస్సులను వినియోగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్రకు స్పందన లేకపోవడం వైసీపీ నేతలకు షాకిచ్చింది. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వైవీఆర్ కల్యాణమండపంలో వివిధ కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కానీ ఆయా వర్గాల నుంచి పెద్దగా స్పందన లేదు. సాయంత్రం 4 గంటలకు కల్యాణ మండపం నుంచి రామేశ్వరం వన్‌టౌన్ సర్కిల్, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్‌కు బస్సుయాత్ర చేరుకుంది. ప్రైవేటు పాఠశాలలకు సెలవులిచ్చి మరీ స్కూలు బస్సులు పెట్టినా, ఐసీడీఎస్, మెప్మా, సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీ కార్యకర్తలను, పొదుపు మహిళలను పథకాలు రావని వలంటీర్లతో బెదిరించి కదిలించినా జనం నాయకుల ప్రసంగాలు వినలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. నేతలు మాట్లాడుతుండగానే కుర్చీలు ఖాళీ అయ్యాయి. వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరులో ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షల అమలుతో జనం అవస్థలు పడ్డారు.
బాపట్లలో ఫ్లాప్
వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం బాపట్ల నియోజకవరం పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరులో ప్రారంభమైంది. కానీ జనం నుంచి కనీస స్పందన కరువైంది. కర్లపాలెం మండలం మీదుగా యాత్ర బాపట్లకు చేరుకుంది. గడియార స్తంభం వద్ద బహిరంగ సభ.. జనం లేక వెలవెలబోయింది. డ్వాక్రా మహిళలతో పాటు పథకాల లబ్ధిదారులను బలవంతంగా తీసుకొచ్చినా.. మంత్రులు మాట్లాడుతుండగానే వారు వెనుదిరిగారు. సభ నేపథ్యంలో రోడ్లన్నీ మూసివేయడంతో వాహనదారులు, ప్రయాణికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. యాత్రలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగి రమేశ్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.