Lokesh : బాహుబలిలో కుంతల రాజ్యం జగన్ పాలనలో గుంతల రాజ్యం
ABN , First Publish Date - 2023-07-27T02:38:48+05:30 IST
‘‘బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం. జగన్ అంకుల్ పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నాం. చిన్న చిన్న గుంతలు కాదు ఏకంగా లారీ పట్టేంత గుంతలు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ..
జగన్‌ది గుంతల రాజ్యంఒక్క గుంత కూడా పూడ్చలేదు
ఒక్క కొత్త రోడ్డూ వేయలేదు
పేదలకీ, దోపిడీదారులకీ మధ్య యుద్ధం
జగన్ చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే దేశానికి
సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీ
యువగళం పాదయాత్రలో లోకేశ్ విసుర్లు
ఒంగోలు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ‘‘బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం. జగన్ అంకుల్ పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నాం. చిన్న చిన్న గుంతలు కాదు ఏకంగా లారీ పట్టేంత గుంతలు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా 166వ రోజైన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్‌కు పేదల గూరించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ‘రాష్ట్రంలో పేదలకు అండగా నిలబడుతున్న టీడీపీకి, దోపిడీదారులున్న వైసీపీకి మధ్య యుద్ధం జరుగుతోంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంతి జగన్ పేదలకు, పెత్తందార్లకూ మధ్య యుద్ధం అంటున్నారు. ఆయన చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ’ అని స్పష్టం చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతా వస్ర్తాలు, పక్కాగృహాలు నిర్మించింది ఎన్టీ రామారావు అని గుర్తుచేశారు. మరి జగన్ ఏం చేశారో తెలుసా... ‘‘నాలుగు సంవత్సరాల మూడు నెలల పాలనలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ.3వేలు చేయలేకపోయారు. సెంటు స్థలాల పేరుతో రూ.7వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. ఎన్నికలకు ముందు అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఇప్పుడు అప్పు చేసైనా సరే కట్టుకోకపోతే పట్టాలు వెనక్కు లాక్కుంటాం అంటున్నారు. అమరావతిలో ఆరు నెలల్లో ఇళ్లు కడతానంటున్న ఆయన.. ఈ నాలుగేళ్ల మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఎందుకు ఇళ్లు నిర్మించలేదు’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2020 జూలై 15 నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని ప్రకటించిన జగన్... ఒక్క గుంతా కూడా పూడ్చలేదని, ఒక్క కొత్త రోడ్డూ వేయలేదని లోకేశ్ మండిపడ్డారు. ‘‘12 కి.మీ. దూరానికి కూడా జగన్ హెలికాప్టర్ ఎందుకు వాడుతున్నాడో తెలుసా.. గుంతల రోడ్లలో వెళితే ప్రాణాలు పోతాయనే భయంతోనే..’’ అన్నారు.
పదవి ఎందుకు పీకేశాడో అడుగు బాలినేని: ఒంగోలులో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థనే చేశారని, గత నాలుగేళ్లల్లో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని సీఎం ఎందుకు పీకేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగేళ్ల క్రితం ఒంగోలు ఎక్కడుందో అక్కడే ఆగిపోయిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కిస్తామన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దామచర్ల జనార్థన్‌తో పాటు రాష్ట్ర నాయకులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.