Lokesh Padayatra: ఏక బిగిన 9.5 కిలోమీటర్లు నడిచిన లోకేశ్
ABN , First Publish Date - 2023-03-11T21:26:32+05:30 IST
యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)లో టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh)ను అడుగడుగునా ప్రజలు ఆదరిస్తున్నారు.
తంబళ్లపల్లె: యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)లో టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh)ను అడుగడుగునా ప్రజలు ఆదరిస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు గ్రామంలో లోకేశ్‌కి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేశ్‌ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అంగళ్లు గ్రామంలోని యువత, మహిళలు, వృద్ధులు యువనేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, పింఛన్ కట్ చేశారంటూ పలువురు వృద్ధులు వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక బెంగళూరు (Bangalore)కు వలస వెళ్లామని అంగళ్లు యువత తెలిపారు. లోకేశ్ స్పందిస్తూ జగన్ పాలనలో అందరూ బాధితులేనన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రానికి పెద్దపెద్ద కంపెనీలు వస్తాయని యువతకు హామీ ఇచ్చారు. ముదివేడు రిజర్వాయర్‌లో 1020 ఎకరాలు ఎటువంటి నష్టపరిహారం లేకుండా తమ భూములను కోల్పోయామని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని రైతులు నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఏక బిగిన 9.5 కి.మీల నడక
పాదయాత్ర 41వ రోజు శనివారం ఉదయం 9.55 గంటలకు విడిది కేంద్రం నందిరెడ్డిపల్లె నుంచి నడక ప్రారంభించిన లోకేశ్ ఏకబిగిన 9.5 కిలోమీటర్లు నడిచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కంటేవారిపల్లెలోని విడిది కేంద్రం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల్లోపు పాదయాత్ర నిలిపివేయాలని పోలీసులు, అధికారులు ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మధ్యాహ్న భోజన విరామం కూడా ఇవ్వలేదు. సరాసరి విడిది కేంద్రానికి చే రుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం స్థానికేతరులు పోలింగ్‌కు 48 గంటల ముందే జిల్లా వదిలి పెట్టి వెళ్లాలంటూ తహసీల్దార్, ఎంపీడీవో, డీఎస్పీలు విడిది కేంద్రం వద్దకు వచ్చి నారా లోకేశ్ ప్రతినిధులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేశ్ ప్రతినిధులతో అధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. నారా లోకేశ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ జిల్లా వదిలి వెళ్లాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో నారా లోకేశ్ తనను ఇక్కడే ఉండనిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ-మెయిల్ ద్వారా ఆశ్రయించారు. భారత ఎన్నికల సంఘంతో సంప్రదించి బదులిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇంతలో ఎన్నికల సంఘాన్ని గౌరవిస్తున్నానంటూ.. విడిది కేంద్రానికి వచ్చిన తన భార్య నారా బ్రాహ్మిణితో కలిసి నారా లోకేశ్ హైదరాబాదుకు శనివారం సాయంత్రం పయనమయ్యారు.