AMD: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3,300 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2023-07-29T00:45:29+05:30 IST

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,300 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికన్‌ సెమీకండక్టర్‌ (చిప్‌) కంపెనీ అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజె్‌స (ఏఎండీ) ప్రకటించింది.

AMD: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3,300 కోట్ల పెట్టుబడులు

బెంగళూరులో డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు

అమెరికన్‌ చిప్‌ కంపెనీ ఏఎండీ ప్రకటన

గాంధీనగర్‌: వచ్చే ఐదేళ్లలో భారత్‌(India)లో 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,300 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికన్‌ సెమీకండక్టర్‌ (చిప్‌) కంపెనీ అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్ (ఏఎండీ) ప్రకటించింది. అంతేకాదు, బెంగళూరులో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఏఎండీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మార్క్‌ పేపర్‌మాస్టర్‌ తెలిపారు. ప్రపంచంలో కంపెనీకిదే అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ కానుందన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ కేంద్రం ప్రారంభమవుతుందన్నారు. గుజరాత్‌(Gujarat)లోని గాంధీనగర్‌లో శుక్రవారం ప్రారంభమైన సెమీకండక్టర్‌ పరిశ్రమ వార్షిక సదస్సు ‘సెమీకాన్‌ ఇండియా(Semicon India) 2023’లో ప్రధాని మోదీ (PM Modi)సమక్షంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత సెమీకండక్టర్ల రంగంలో ఏఎండీ చాలా కాలంగా క్రియాశీలకంగా ఉంది. తన తొలి కేంద్రాన్ని 2001లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌, బెంగళూరు, గురుగ్రామ్‌, ముంబై సహా దేశంలోని 10 నగరాల్లో కార్యాలయాలను నిర్వహిస్తోంది. కేంద్ర ఎలక్ట్రా‌నిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏఎండీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎలక్ట్రా‌నిక్స్‌, చిప్‌ తయారీలో భారత్‌ను అంతర్జాతీయ హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే, కార్లు, ఫోన్లు, కంప్యూటర్లతో పాటు ప్రతి ఎలక్ట్రా‌నిక్ పరికరాల తయారీకి చిప్‌లు కీలకంగా మారాయి. ప్రస్తుతం ప్రపంచానికి అవసరమైన చిప్‌లో మెజారిటీ భాగం చైనా, తైవాన్‌ నుంచే సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు చిప్‌లు, డిస్‌ప్లే తయారీదారుల కోసం భారత ప్రభుత్వం 1000 కోట్ల డాలర్ల (రూ.82,000 కోట్ల పైమాటే) ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2026 నాటికి భారత చిప్‌ మార్కెట్‌ సైజు 6,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.25 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్‌ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది.


రెండున్నరేళ్లలో చిప్‌ ప్లాంట్‌ సిద్ధం: వేదాంత

గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న చిప్‌ తయారీ ప్లాంట్‌ నుంచి రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభం కానుందని వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గుజరాత్‌లో సెమీకండక్టర్లు, డిస్‌ప్లేల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు వేదాంత-ఫాక్స్‌కాన్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, ఈ భాగస్వామ్యం నుంచి ఫాక్స్‌కాన్‌ ఈమధ్యనే వైదొలిగింది. దాంతో వేదాంత మరో భాగస్వామిని అన్వేషించే పనిలో ఉంది. ప్రపంచ స్థాయి టెక్‌ కంపెనీతో కలిసి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని సెమీకాన్‌ సదస్సులో అగర్వాల్‌ తెలిపారు.

దేశంలో తొలి చిప్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రెడీ: మైక్రాన్‌

భారత్‌లో తొలి చిప్‌ తయారీ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అమెరికన్‌ సెమీకండక్టర్‌ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ తెలిపింది. తమ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా మరికొన్ని సంవత్సరాల్లో 5,000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనతో పాటు మరో 15,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని మైక్రాన్‌ టెక్నాలజీస్‌ సీఈఓ, భారతీయ సంతతి వ్యక్తి సంజయ్‌ మెహ్రోత్రా తెలిపారు. 4,000 కోట్ల డాలర్ల (రూ.3.20 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో భారత్‌లో చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది ద్వితీయార్ధంలో మైక్రాన్‌ ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిప్స్‌ అండ్‌ సైన్స్‌ చట్టం ద్వారా లభించే గ్రాంట్స్‌, క్రెడిట్స్‌ మద్దతుతో 2030 వరకు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రాన్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరులో డెవల్‌పమెంట్‌ సెంటర్లను నిర్వహిస్తోంది.

వేదాంతకు ఫాక్స్‌కాన్‌ చురక!

సెమీకాన్‌ సదస్సులో ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియు ప్రసంగిస్తూ, వేదాంతకు పరోక్షంగా చురకలంటించారు. భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ ఆవరణ వ్యవస్థ చాలా ధైర్యవంతుల కోసమని ఆయన అన్నారు. ప్రతి అనుభవం కంపెనీలను మున్ముందు మరింత బలోపేతం చేయనుందన్నారు. ఎలక్ట్రా‌నిక్స్‌ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరర్‌ అయిన ఫాక్స్‌కాన్‌.. సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటు కోసం వేదాంతతో కుదుర్చుకున్న భాగస్వామ్యం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇతర భాగస్వామితో కలిసి భారత్‌లో చిప్‌ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే వెల్లడించింది.

Updated Date - 2023-07-29T03:40:19+05:30 IST