Byju's: రూ.9 వేల కోట్లు చెల్లించండి: బైజూస్‌కి షాకింగ్ ఈడీ నోటీసులు!
ABN , First Publish Date - 2023-11-21T16:29:23+05:30 IST
విదేశీ ఫండింగ్ చట్టాలను అతిక్రమించిన కారణంగా రూ.9 వేల కోట్లు చెల్లించాలంటూ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్‌కు (Byju's) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో బైజూస్‌లోకి రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) వచ్చాయని ఈడీ పేర్కొంది.
న్యూఢిల్లీ: విదేశీ ఫండింగ్ చట్టాలను అతిక్రమించిన కారణంగా రూ.9 వేల కోట్లు చెల్లించాలంటూ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్‌కు (Byju's) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో బైజూస్‌లోకి రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) వచ్చాయని, ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరిట రూ.9,754 కోట్ల భారీ మొత్తాన్ని విదేశీ చట్టబద్ధ సంస్థలకు బైజూస్ చెల్లించిందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈడీ నోటీసులపై బైజూస్ స్పందించింది. ఈడీ అధికారులు తమను సంప్రదించలేదని, తమకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఫెమా (FEMA) నిబంధనలు బైజూస్ ఉల్లంఘించిందంటూ మీడియాలో వస్తున్న రిపోర్టులను నిస్సందేహంగా ఖండిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.
కాగా బైజూస్ మాతృసంస్థ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటెడ్’ని బైజూ రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్ 2011లో స్థాపించారు. ఆరంభంలో పోటీ పరీక్షల కోసం ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్‌ను అందించారు. 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాక కంపెనీ అనూహ్యమైన రీతిలో వృద్ధి చెందింది. రెండేళ్ల తర్వాత పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రోగ్రెస్ తెలుసుకునేందుకు వీలుగా మాథ్స్ యాప్‌ను రూపొందించింది. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రావడంతో 2018 నాటికిఏకంగా 1.5 కోట్ల కుటుంబాలకు బైజూస్ చేరువైంది. కొవిడ్ మహమ్మారి కాలం బైజూస్‌కి బాగా కలిసొచ్చింది. స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో ఇంటి నుంచే నేర్చుకునేందుకు బైజూస్ బాగా ఉపయోగపడడం ఇందుకు కారణమైంది.
అయితే 2021 తర్వాత పరిస్థితి తల్లకిందులైంది. కొవిడ్ కనుమరుగవ్వడంతో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీల బాటపట్టారు. దీంతో బైజూస్‌కి ఆదరణ కరువైంది. నిధుల సమీకరణ క్లిష్టంగా మారిపోయింది. దీంతో బైజూస్ లావాదేవీలపై చట్టబద్ధ ఏజెన్సీలు దృష్టిసారించాయి.