ChatGPT: చాట్ జీపీటీ సృష్టికర్త ఏఐలో కీలక పరిణామం.. కంపెనీ సీఈఓపై వేటు
ABN , First Publish Date - 2023-11-18T08:52:58+05:30 IST
చాట్‌జీపీటీ(ChatGPT) సృష్టికర్త ఓపెన్‌ఏఐ(OpenAI) కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై(Sam Altman) వేటుపడింది. శాల్ట్ ఆల్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఓపెన్‌ఏఐ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
వాషింగ్టన్: చాట్‌జీపీటీ(ChatGPT) సృష్టికర్త ఓపెన్‌ఏఐ(OpenAI) కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై(Sam Altman) వేటుపడింది. శాల్ట్ ఆల్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఓపెన్‌ఏఐ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. మైక్టోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్‌ఏఐ కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే ఈ తొలగింపునకు కారణంగా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆల్ట్‌మన్ తొలగింపు నిర్ణయం ప్రస్తుతం టెక్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. శాల్ట్ ఆల్‌మన్ స్థానంలో కంపెనీ తాత్కాలిక సీఈఓగా ప్రస్తుతం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న మిరా మురాటీ వ్యవహరిస్తారని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. కాగా ఆల్ట్‌మన్ తొలగింపు విషయమై ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డు శుక్రవారం సమావేశం చర్చించింది. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ‘‘బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఆల్ట్‌మన్ నిజాయితీగా వ్యవహరించడం లేదు. సరైన సమాచారాన్ని కంపెనీతో పంచుకోకపోగా, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడు. దీంతో కంపెనీకి నాయకత్వం వహించే ఆయన సామర్థ్యంపై బోర్డుకు ఏమాత్రం నమ్మకం లేదు.’’ అని ఓపెన్‌ఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
అలాగే ఓపెన్‌ఏఐ సంస్థ స్థాపన, వృద్ధికి సామ్ చేసిన కృషికి బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. అయితే కంపెనీ ముందుకు సాగేందుకు కొత్త నాయకత్వం అవసరమని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. కాగా 38 ఏళ్ల ఆల్ట్‌మన్ అపూర్వమైన సామర్థ్యాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీని విడుదల చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ చాట్‌జీపీటీతో టెక్ వర్గాల్లో ఆయన ఒక సంచలనంగా మారారు. కవితలు, ఆర్ట్‌వర్క్ వంటి మానవ స్థాయి కంటెంట్‌ను కేవలం సెకన్లలో బయటకు తీశారు. తనపై వేటు వేయడంపై ఎక్స్ వేదికగా ఆల్ట్‌మన్ కూడా స్పందించారు. ‘‘ఓపెన్‌ఏఐ సంస్థలో పనిచేయడాన్ని చాలా ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నేను మారడానికి, ప్రపంచం కొంచెం మారిందనడాన్ని నేను నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రతిభావంతులతో పని చేయడాన్ని ఇష్టపడ్డాను.’’ అని ట్వీట్ చేశారు. కాగా ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఓపెన్‌ఏఐ కంపెనీ బోర్డులో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుత్‌స్కేవర్, క్యూరా సీఈఓ ఆడమ్ డీ ఏంజెలో, టెక్నాలజీ వ్యవస్థాపకుడు తాషా మెక్‌కాలీ, జార్జ్‌టౌన్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ హెలెన్ టోనర్ ఉన్నారు.