LPG price: ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సవరించిన గ్యాస్ కంపెనీలు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై..
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:53 PM
సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీలు శుక్రవారం ప్రకటించాయి. కమర్షియల్ వంట గ్యాస్ (LPG) ధరలను రూ.39.50 మేర తగ్గించినట్టు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీలు శుక్రవారం ప్రకటించాయి. కమర్షియల్ వంట గ్యాస్ (LPG) ధరలను రూ.39.50 మేర తగ్గించినట్టు వెల్లడించాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ధరలను సవరించినట్టు తెలిపాయి. అయితే గృహ వినియోగ వంటగ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులేదని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి.
కాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల తగ్గుదలతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు స్వల్ప ఉపశమనాన్ని పొందనున్నారు. తాజా తగ్గింపుతో దేశరాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1796.50 నుంచి రూ.1757లకు తగ్గింది. ముంబైలో రూ.1,710, కోల్‌కతాలో రూ.1868, చెన్నైలో రూ.1929కి స్వల్పంగా తగ్గాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
ఎల్‌పీజీ ధరలను నిర్ణయించడంలో ప్రమాణికంగా తీసుకునే సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ (CP) గతవారం కాస్త తగ్గింది. సప్లై ఓవర్ ఫ్లో రేటు తగ్గుదలకు కారణమైంది. కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి ధరలను సమీక్షిస్తుంటాయన్న విషయం తెలిసిందే.