Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం.. రూ.1.5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
ABN , First Publish Date - 2023-07-10T19:08:08+05:30 IST
గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ దిగ్గజం ‘ఫాక్స్‌కాన్’ (Faxconn) సంచలన ప్రకటన చేసింది. భారతీయ మల్టీ-ఇండస్ట్రీ కంపెనీ ‘వేదాంత’తో (Vedanta) కలిసి చేపట్టదలచిన సెమికండక్టర్ జాయింట్ వెంచర్ (Semiconductor joint venture) నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ దిగ్గజం ‘ఫాక్స్‌కాన్’ (Faxconn) సంచలన ప్రకటన చేసింది. భారతీయ మల్టీ-ఇండస్ట్రీ కంపెనీ ‘వేదాంత’తో (Vedanta) కలిసి చేపట్టదలచిన సెమికండక్టర్ జాయింట్ వెంచర్ (Semiconductor joint venture) నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. వేదాంత పూర్తి యాజమాన్యంలోని సంస్థ నుంచి ఫాక్స్‌కాన్ పేరు తొలగింపుపై పనిచేస్తున్నట్టు తెలిపింది. ఆ కంపెనీతో ఫాక్స్‌కాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్‌లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రకటించింది. ‘‘ మరిన్ని విభిన్న వృద్ధి అవకాశాలను శోధించే క్రమంలో వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకెళ్లకూడదని ఫాక్స్‌కాన్ గుర్తించింది’’ అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఫాక్స్‌కాన్ పేర్కొంది. ఈ భారీ సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌ను వాస్తవరూపంలోకి తీసుకొచ్చేందుకు ఏడాదిపైగా కృషి చేశామని తెలిపింది. ఇదొక చక్కటి అనుభవమని, ఇరు కంపెనీలకూ అక్కరకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా.. సెమీకండక్టర్ కంపెనీ ఏర్పాటు కోసం గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో భారత్‌కు చెందిన వేదాంత కంపెనీ గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో సెమీకండక్టర్లు ఉత్పత్తి చేయాలని ఇరు కంపెనీలు భావించాయి.