RBI MPC Meeting : ఆర్బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-04-06T11:19:09+05:30 IST
భారతీయ రిజర్వు బ్యాంక్ (Reserve Bank of India-RBI) రెపో రేటులో మార్పు లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంక్ (Reserve Bank of India-RBI) రెపో రేటులో మార్పు లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) గురువారం ప్రకటించారు. గత ఏడాది మే నెల నుంచి ఆరుసార్లు రెపో రేటును పెంచిన నేపథ్యంలో తాజాగా మానెటరీ పాలసి కమిటీ సమావేశంలో ఈ రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది 6.5 శాతంగా కొనసాగుతుందని చెప్పారు. పరిస్థితినిబట్టి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్బీఐ గత ఏడాది మే నెల నుంచి ఆరుసార్లు రెపో రేటును పెంచుతూ వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతం ఉండవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టిపెట్టినట్లు గవర్నర్ దాస్ తెలిపారు. చెప్పుకోదగ్గ స్థాయిలో ద్రవ్యోల్బణం తగ్గే వరకు దానిపై పోరాటం కొనసాగుతుందన్నారు.
రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. దీనిలో మార్పులవల్ల బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు ప్రభావితమవుతాయి. ఈఎంఐలలో హెచ్చుతగ్గులు వస్తాయి.
బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ మన దేశంలో ఆరోగ్యవంతంగానే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు ఒత్తిళ్ళను తట్టుకునే విధంగా ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
UK PM Rishi Sunak : ‘పద్మ’ పురస్కార ప్రదానోత్సవంలో అందరినీ ఆశ్చర్యపరచిన రిషి సునాక్ సతీమణి అక్షత