Rekha Jhunjhunwala: ఇదేం దూకుడు..... ఒక్క రోజులో రూ.240 కోట్ల సంపాదనా!

ABN , First Publish Date - 2023-03-04T18:10:46+05:30 IST

స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో ఇన్వెస్ట్ చేసి తల్లకిందులైపోయినవాళ్లు మనకి లక్షల్లో కనిపిస్తుంటారు...

Rekha Jhunjhunwala: ఇదేం దూకుడు..... ఒక్క రోజులో రూ.240 కోట్ల సంపాదనా!

ముంబై: స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో ఇన్వెస్ట్ చేసి తల్లకిందులైపోయినవాళ్లు మనకి లక్షల్లో కనిపిస్తుంటారు... అదే స్టాక్ మార్కెట్‌ని నమ్ముకుని తలరాత మార్చుకున్నవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. ఎవరో నలుగురు తెలిసినవాళ్లు చెప్పారని.... సోషల్ మీడియాలో రికమండేషన్స్ వచ్చాయని... యూట్యూబ్ చానెల్‌లో ఎక్స్‌పర్ట్స్ కొందరు సజెస్ట్ చేశారని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ (Stock Market Investments) చేసేవారు చాలామందే ఉన్నారు. వీరిలో కాస్తో కూస్తో లాభాల (Stock Market Profits)తో సంతృప్తి చెందుతూ అదే రూటులో నెట్టుకొచ్చేవారు... కాస్తో కూస్తో లేదా భారీ నష్టాల పాలై ఇక షేర్ల (Investments in Stock Markets) జోలికి వెళ్లవద్దనుకుని తప్పుకునే ఇన్వెస్టర్లు దర్శనమిస్తుంటారు.

Untitled-4.jpg

ఇక భారీ లాభాలు మూటగట్టుకుని తరచుగా వార్తల్లో కనిపించిన రేఖ భర్త, ఒకప్పటి స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజన్‌వాలా (Rakesh Jhunjhunwala), ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) లాంటివారిని అనుసరిస్తూ... వారు ఏ షేర్లలో అయితే పెట్టుబడులు పెట్టారో వాటిలోనే తామూ ఇన్వెస్ట్ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకునే చిన్న ఇన్వెస్టర్లూ ఉంటారు. అయితే ఈ చిన్న ఇన్వెస్టర్లకి వచ్చే లాభాలు ఏమంత గొప్పగా ఉండవు. ఎందుకంటే, దిగ్గజాలైన ఆ షేర్ మార్కెట్ (Share Market) ఇన్వెస్టర్లు మార్కెట్ పోకడలు చూసి డౌన్ ట్రెండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ... అప్ ట్రెండ్‌లో అమ్ముతూ... కంపెనీల ఫండమెంటల్స్ స్టడీ చేస్తూ... ప్రభుత్వాల విధానాలని గమనిస్తూ... బడ్జెట్ సీజన్ (Budget), ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇలా ఎన్నెన్నో అంశాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ వందల రూపాయలతో మొదలుపెట్టి, వేలు, లక్షలు పెట్టుబడులు పెడుతూ అవి కోట్లు అయ్యేలా ఒక వ్యూహాన్ని అనుసరిస్తారు. చాలా ఓపిక, సహనం కావాలి. చిన్న ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టిన కంపెనీ షేరు కాస్త తగ్గితే కంగారుపడి తక్కువ ధరకి అమ్మేసుకోవడం... లేదా కాస్త ధర పెరగ్గానే మళ్లీ ఈ ప్రైస్ వస్తుందో లేదోననే అనుమానంతో స్వల్ప లాభానికే అమ్మేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఫలితంగా కనీసం బ్రోకరేజి ఫీజు కూడా కలిసిరాదు. కరోనా లాక్ డౌన్, ఉక్రెయిన్ యుద్ధం లాంటి కీలక సమయాల్లో మార్కెట్లు పడిపోయినప్పుడు లక్షలాదిమంది చిన్న ఇన్వెస్టర్లు భయాందోళనలతో అతి తక్కువ రేట్లకే షేర్లు అమ్మేసుకుని నష్టాల పాలయ్యారు.

అయితే ఒక సైంటిఫిక్ స్టడీతో మార్కెట్ తీరుతెన్నుల్ని, కంపెనీల బిజినెస్‌ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే అద్భుతాలు సాధించి కోట్లకు పడగలెత్తవచ్చని నిరూపించి కోట్లకు పడగలెత్తింది ఒక పవర్‌ఫుల్ విమెన్ ఇన్వెస్టర్. ఆమె పేరు రేఖా ఝంఝన్‌వాలా (Rekha Jhunjhunwala). కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యం, హిండెన్‌బర్గ్ నివేదిక (Hindenburg Research Adani)తో అదానీ గ్రూప్ (Adani Group) ఎదుర్కుంటున్న ఇబ్బందులు సహా అనేక ప్రతికూలతల మధ్య భారత స్టాక్స్ మార్కెట్స్ కూడా ఇటీవల ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఇన్వెస్టర్ రేఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మంచి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి క్రమక్రమంగా మంచి పోర్ట్‌ఫోలియో (stock market portfolio) నిర్మించుకున్నారు. ఇందులో భాగంగా టాటా గ్రూప్ (Tata group stocks), కంపెనీలైన టైటాన్ (Titan Company), టాటా మోటార్స్ (Tata Motors), ఇండియన్ హొటల్స్ కంపెనీ (Indian Hotels Company) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు.

Untitled-5.jpg

రేఖా ఝంఝన్‌వాలాకి టైటాన్‌లో 4,58,95,970 షేర్లుండగా ఇది ఆ కంపెనీ మొత్తం పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 5.17 శాతంగా ఉంది. శుక్రవారం ఈ షేరు రూ.41 పెరుగుదలతో రూ.2,400కి చేరుకుంది. అలాగే ఆమెకు టాటా మోటార్స్‌లో 5,22,56,000 షేర్లుండగా ఇది ఆ కంపెనీ మొత్తం పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 1.57 శాతంగా ఉంది. ఈ షేరు ధర శుక్రవారం రూ.7.40 పెరుగుదలతో రూ.427.85కి చేరింది. అదే క్రమంలో ఇండియన్ హొటల్స్ కంపెనీలో తనకు 3,00,16,965 షేర్లుండగా ఇది ఆ కంపెనీ మొత్తం పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 2.11 శాతంగా ఉంది. ఈ షేరు ధర శుక్రవారం రూ.3.85 పెరుగుదలతో రూ.318.95కి చేరింది. ఫలితంగా ఈ మూడు కంపెనీల్లోను రేఖ షేర్ల నికర విలువ వరుసగా రూ.188.50 కోట్లు, రూ.38.66 కోట్లు, రూ. 11.55 కోట్లు... మొత్తంగా రూ.240 కోట్లకు ఎగబాకింది.

రేఖ భర్త ఒకప్పటి స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంఝన్‌వాలాయే అయినప్పటికీ, అంతమాత్రాన ఈమెకి ఏదో నడమంత్రపు సిరిలా ఇదంతా వచ్చేసిందనుకుంటే పొరపాటే.... భర్త వ్యాపార వ్యూహాలు, ఎత్తుగడలను ఈమె అందిపుచ్చుకుని స్టాక్‌మార్కెట్‌లో లాభాలు గడిస్తున్నారు. ఈ విజయం కేవలం రేఖకు మాత్రమే పరిమితం కాదు.... స్టాక్ మార్కెట్ పోకడ, కంపెనీల బిజినెస్, సామాజిక పరిణామాలపై సరైన స్టడీ, స్ట్రేటజీని అవలంబిస్తే ప్రతి ఒక్కరూ కాకపోయినా దాదాపుగా చాలామంది సంతృప్తికరస్థాయిలో లాభాలు గడించవచ్చు.

Updated Date - 2023-03-04T18:42:39+05:30 IST