నోకియాతో జియో భారీ ఒప్పందం.. విలువ రూ.14,016 కోట్లు.. ఎందుకంటే?..
ABN , First Publish Date - 2023-07-06T14:26:50+05:30 IST
భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో(Reliance Jio).. నోకియాతో(Nokia) భారీ ఒప్పందం చేసుకోనుందని సమాచారం. 5జీ నెట్‌వర్క్ పరికరాలను కోనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరగనుందని తెలుస్తోంది.
భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో(Reliance Jio).. నోకియాతో(Nokia) భారీ ఒప్పందం చేసుకోనుందని సమాచారం. 5జీ నెట్‌వర్క్ పరికరాలను కోనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరగనుందని తెలుస్తోంది. ఈ ఒప్పందం విలువ $1.7బిలియన్లు. అంటే మన కరెన్సీలో రూ.14,016 కోట్లు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ఎకానమిక్ టైమ్స్(Economic Times) రాసుకొచ్చింది. ఈ రోజే ఈ భారీ డీల్‌పై జియో, నోకియా మధ్య ఒప్పందం కుదరనుందని, దీనికి సంబంధించిన సంతకాలు కూడా చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. నోకియా ప్రధాన కార్యాలయం ఉన్న ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో ఈ ఒప్పందంపై సంతకాలు చేయొచ్చని ఎకానమిక్ టైమ్స్ నివేదికలో ఉంది.
గతేడాది ఆగస్టులో జరిగిన 5జీ స్ప్రెక్టమ్ వేలంలో (5G spectrum auction) రిలయన్స్ జియో $11 బిలియన్‌ల విలువ చేసే ఎయిర్‌వేవ్‌లను దక్కించుకుంది. దీని విలువ మన భారతదేశ కరెన్సీలో రూ.90,600 కోట్లు. ఈ వేలం అనంతరం జియో అనేక నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలను కూడా ప్రారంభించింది. అలాగే 5జీ స్మార్ట్ ఫోన్లను తయారు చేయడానికి ఆల్ఫాబెట్ గూగుల్‌తో కలిసి పనిచేస్తుంది. జియో 5జీ సంబంధిత కోనుగోళ్లకు మద్దతు ఇస్తున్న వాటిలో హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్ ఉన్నాయని ఎకానమిక్ టైమ్స్ తెలిపింది.
ఎకానమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. భారతదేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలను అందుబాటులో తీసుకురావడానికి జియోతో కలిసి పని చేయనున్నట్లు స్వీడిష్ టెలికమ్యూనికేషన్ కంపెనీ ‘ఎరిక్సన్’ గతేడాది అక్టోబర్‌లో ప్రకటించింది. అలాగే త్వరలో 4 జీ ఫీచర్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు ఈ వారం ప్రారంభంలో జియో ప్రకటించింది. అయితే ఇది భారత టెలికాం మార్కెట్‌కు అంతరాయం కల్గించే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. గత డిసెంబర్‌లో దేశంలో జియో 5జీ సేవలను ప్రారంభించింది. దీంతో 5జీ మొబైల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 5 జీ మొబైల్స్(5G Mobiles), 4 జీ మొబైల్స్‌ను (4G Mobiles) మించి విస్తరిస్తాయని ఎకానమిక్ టైమ్స్ అంచనా వేసింది. భారతదేశంలో 5G డేటా వేగం 4G కంటే 10 రెట్లు వేగంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఈ నెట్‌వర్క్ కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి.