Tata Motors: వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ప్రారంభం.. ఏడాదికి 15 వేల వాహనాలు తుక్కు తుక్కే!
ABN , First Publish Date - 2023-02-28T18:51:09+05:30 IST
టాటా మోటార్స్(Tata Motors) తమ తొలి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) రీసైకిల్
జైపూర్: టాటా మోటార్స్(Tata Motors) తమ తొలి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) రీసైకిల్ విత్ రెస్పెక్ట్ (Re.Wi.Re)ను రాజస్థాన్‌లోని జైపూర్(Jaipur)లో ప్రారంభించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) దీనిని ప్రారంభించారు. ఇందులో ఏడాదికి 15 వేల వాహనాలను తుక్కుగా మార్చొచ్చు. టాటా మోటార్స్ భాగస్వామి గంగారామ్ వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.
అన్ని బ్రాండ్లకు చెందిన ప్రయాణికుల, వాణిజ్య వాహనాలు రెండింటినీ ఇక్కడ తుక్కుగా మారుస్తారు. ఫిట్‌గా లేని, కాలుష్య కారక వాహనాలను దశల వారీగా తొలగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు. వీటి స్థానంలో ఇంధన సమర్థవంతమైన వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా కర్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు.
ఈ సందర్భంగా టాటా మోటార్స్(Tata Motors)ను మంత్రి అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఫెసిలిటీని ఏర్పాటు చేశారని కొనియాడారు. దేశాన్ని దక్షిణాసియాలోనే వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది (Re.Wi.Re) పూర్తిగా డిజిటలైజ్ చేసిన ఫెసిలిటీ అని, ఆపరేషన్స్ అన్నీ పేపర్‌లెస్‌గానే జరుగుతాయని టాటా మోటార్స్ తెలిపింది. టైర్లు, బ్యాటరీలు, ఇంధనం, ఆయిల్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వంటి వాటిని పూర్తి భద్రత మధ్య ధ్వంసం చేయడానికి అవసరమైన డెడికేటెడ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీశ్ వా మాట్లాడుతూ.. జీవితకాలం ముగిసిన వాహనాలను స్క్రాప్ చేయడంలో ఈ స్క్రాపింగ్ ఫెసిలిటీ (Re.Wi.Re RVSF) సరికొత్త ప్రారంభానికి నాంది పలికిందని అన్నారు.