iPhone 15: అదొస్తే.. ఈ ఐఫోన్లను యాపిల్ అటకెక్కించేస్తుందట!

ABN , First Publish Date - 2023-04-17T18:36:33+05:30 IST

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ మరికొన్ని నెలల్లో

 iPhone 15: అదొస్తే.. ఈ ఐఫోన్లను యాపిల్ అటకెక్కించేస్తుందట!

న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ మరికొన్ని నెలల్లో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లీక్స్ ప్రతీ వారం సోషల్ మీడియాను ముంచెత్తుతూనే ఉన్నాయి. గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 14 (iPhone 14) లానే ఇందులోనూ నాలుగు మోడల్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో వనీలా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లేదంటే అల్ట్రా మోడళ్లు ఉండే అవకాశం ఉంది.

ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా కొత్త ఫోన్ లాంచ్ తర్వాత కొన్ని పాత మోడళ్లను అటకెక్కించాలని యాపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 15 తర్వాత కనీసం నాలుగు మోడళ్లను ఆపేయాలన్నది యాపిల్ ఆలోచన అని సమాచారం.

యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్‌ఈ (2022)లను విక్రయిస్తోంది. అయితే, ఐఫోన్ 15 లాంచ్ తర్వాత ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీల ప్రొడక్షన్‌ను ఆపేయాలని యాపిల్ నిర్ణయించినట్టు ఓ నివేదిక పేర్కొంది. అదే జరిగితే ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ (2022), ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ నివేదిక వెల్లడించే విషయాలు దాదాపు నిజమయ్యే అవకాశం ఉంది. గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌ విడుదల తర్వాత కొత్త ఫోన్ల విక్రయాలు పెంచేందుకు పాత జనరేషన్ ఫోన్లను తొలగించింది. అలాగే, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీలను కూడా విక్రయాల నుంచి తప్పించింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఫోన్ల ధరను 100 డాలర్ల వరకు తగ్గించే అవకాశం ఉంది. ఇండియాలో దాదాపు 10 వేల వరకు తగ్గించే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-17T18:36:33+05:30 IST