Share News

Antibiotics: వామ్మో.. నకిలీ మందులు అమ్మేస్తున్నారు.. బ్రాండెడ్‌ పేర్లతో భారీగా...

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:17 PM

బ్రాండెడ్‌ సంస్థల పేరుతో నకిలీ యాంటి బయాటిక్స్‌(Antibiotics) ఔషధాలు విక్రయిస్తున్న ముగ్గురిని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు (డీసీఏ) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.26 లక్షల నకిలీ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు.

Antibiotics: వామ్మో.. నకిలీ మందులు అమ్మేస్తున్నారు.. బ్రాండెడ్‌ పేర్లతో భారీగా...

- ముగ్గురు విక్రేతల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): బ్రాండెడ్‌ సంస్థల పేరుతో నకిలీ యాంటి బయాటిక్స్‌(Antibiotics) ఔషధాలు విక్రయిస్తున్న ముగ్గురిని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు (డీసీఏ) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.26 లక్షల నకిలీ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌ నుంచి నకిలీ మందులు కొరియర్‌ ద్వారా సరఫరా అవుతున్నట్లు గుర్తించిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు, అక్కడి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌లోని ‘ట్రాకాన్‌ కొరియర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో సోదాలు నిర్వహించారు. ఉత్తరాఖండ్‌(Uttarakhand) నుంచి పువ్వాడ లక్ష్మణ్‌కు వచ్చిన 14.5 కిలోలు, 13.34 కిలోల పార్సిళ్లను గుర్తించారు. కొరియర్‌లో వాహనాల స్పేర్‌పార్ట్‌లు అని రాసి ఉండటంతో అనుమానించారు. పువ్వాడ లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నకిలీ మందుల వ్యవహారంపై కూపీ లాగారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నదీం నుంచి నకిలీ మందులు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మందులను దుకాణాలకు విక్రయించడంలో అతడికి సహకరిస్తున్న పోకల రమేష్‌, గారపల్లి పూర్ణచందర్‌ల ఇళ్లపై దాడులు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో దిల్‌సుఖ్‌నగర్‌ గంగా థియేటర్‌ సమీపంలో లక్ష్మణ్‌ నిర్వహిస్తున్న గోదాంలో తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 26లక్షల వరకు ఉంటుందని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అంజుం అబిదా తెలిపారు. నకిలీ ఔషధాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, వి.రవికుమార్‌, ఏఎన్‌ క్రాంతికుమార్‌, ఎల్‌. రాజు, జె. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:20 PM