Assam Woman Sold: అస్సాంలో దారుణం.. రూ.40 వేలకు మహిళ విక్రయం.. ఆపై గదిలో బంధించి..
ABN , First Publish Date - 2023-09-05T19:32:13+05:30 IST
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రాక్షసుల చేతిలో వాళ్లు నలిగిపోతూనే ఉన్నారు. శిక్షలు సరిగ్గా అమల్వవకపోవడం వల్లే.. కామాంధులు....
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రాక్షసుల చేతిలో వాళ్లు నలిగిపోతూనే ఉన్నారు. శిక్షలు సరిగ్గా అమల్వవకపోవడం వల్లే.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఏదో తమకు హక్కు ఉందన్నట్టు.. మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అస్సాంలోనూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక మహిళను రూ.40 వేలకు విక్రయించారు. ఆపై ఆమెను రెండు రోజుల పాటు బంధీగా ఉంచి, చిత్రహింసలకు గురి చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
అస్సాంలోని హోబైపూర్‌లో నివాసం ఉంటున్న 35 ఏళ్ల మహిళ.. అలోక్‌బరిలోని ఓ కంపెనీలో మెడిసిన్ ప్యాకింగ్ చేస్తున్నానని తెలిపింది. ఎప్పట్లాగే ఆగస్టు 8వ తేదీ కూడా తాను రైలులో అలోక్‌బరీకి బయలుదేరానని.. ఆరోజు ఒక వ్యక్తి తనకు రైలులో పరిచయం అయ్యాడని చెప్పింది. తాను కంపెనీ వద్ద వదిలేస్తానని ఆ వ్యక్తి తనకు చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని, కళ్లు తెరిచి చూసేసరికి తాను ఢిల్లీలో ఉన్నానని, అక్కడికి ఎలా వచ్చానో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. తనని కంపెనీ వద్ద డ్రాప్ చేస్తానని చెప్పిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని తాను గమనించానని తెలిపింది. కొన్ని రోజులు తనని ఢిల్లీలోనే ఉంచారని, ఆ తర్వాత ఝుంఝునుకి చెందిన ఒక వ్యక్తి తనను రూ.40 వేలకు విక్రయించాడని ఆ మహిళ వివరించింది.
ఢిల్లీ నుంచి తనని సూరజ్‌గఢ్‌కి తీసుకొచ్చారని, అక్కడ ఓ ఇంట్లో తనను రెండు రోజుల పాటు బంధీగా ఉంచారని ఆ మహిళ తెలిపింది. సోమవారం రాత్రి తనపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఎలాగోలా ఆ నరకం నుంచి తప్పించుకొని బయటపడ్డానని పేర్కొంది. తనకు జరిగిన ఈ అన్యాయం గురించి ఆ మహిళ మీడియాకు వివరించింది. ఈ మహిళ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందిన తర్వాత తాను ఫిర్యాదు చేస్తానని ఆ మహిళ చెప్పిందని, ఆమె ఫిర్యాదు చేసిన వెంటనే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.