Delhi Student Murder: ఢిల్లీలో దారుణం.. రాడ్డుతో కొట్టి, విద్యార్థిని హత్య.. పరారీలో నిందితుడు

ABN , First Publish Date - 2023-07-28T14:48:32+05:30 IST

ఢిల్లీ.. చెప్పుకోవడానికి మన దేశ రాజధాని అయినా, మహిళలకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. శారీరక దాడులు చేయడమో..

Delhi Student Murder: ఢిల్లీలో దారుణం.. రాడ్డుతో కొట్టి, విద్యార్థిని హత్య.. పరారీలో నిందితుడు

ఢిల్లీ.. చెప్పుకోవడానికి మన దేశ రాజధాని అయినా, మహిళలకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. శారీరక దాడులు చేయడమో, అత్యాచారాలకు పాల్పడటమో, చంపడమో వంటి అఘాయిత్యాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్షలు పడకపోవడం వల్లే.. అక్కడ నేరాలు పెచ్చుమీరిపోతున్నాయని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఇప్పుడు తాజాగా మరో దారుణ సంఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఒక కాలేజీ విద్యార్థిని పార్కులో హత్యకు గురైంది. ఆమెతో పాటు వచ్చిన స్నేహితుడే.. రాడ్డుతో కొట్టి ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతురాలు (25) కమలా నెహ్రూ కాలేజీలో ఓ స్టూడెంట్. ఈ అమ్మాయి శుక్రవారం తన స్నేహితుడితో కలిసి, మాల్వియా నగర్‌కి సమీపంలో ఉన్న ఒక పార్కుకి వెళ్లింది. వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. నిందితుడు ఒక రాడ్డు తీసుకొని ఆమెపై దాడి చేశాడు. తలపై బలంగా బాదాడు. దీంతో.. ఆ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయిందన్న విషయాన్ని నిర్ధారించుకొని.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పార్కులో సంచరిస్తున్న స్థానికులు.. విద్యార్థిని మృతదేహం చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద లభ్యమైన రాడ్డుని స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ‘‘మాల్వియా నగర్ సమీపంలోని ఒక పార్కులో 25 ఏళ్ల అమ్మాయి మృతేదేహం లభ్యమైనట్లు మాకు సమాచారం అందింది. ఆమె తన స్నేహితుడితో కలిసి పార్క్‌కి వచ్చింది. మృతురాలి తలపై గాయాలున్నాయి. బాడీ పక్కనే ఒక ఐరన్ రాడ్డు లభ్యమైంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు.

Updated Date - 2023-07-28T14:48:32+05:30 IST