Share News

HYD: అకౌంట్‌లో 46పైసలు.. ఇంట్లో రూ. 47.80 లక్షలు

ABN , First Publish Date - 2023-11-11T08:52:31+05:30 IST

తక్కువ ఫీజుకే మెడికల్‌ సీటు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి లక్షలు కాజేసిన నగరానికి చెందిన నిందితుడిని

HYD: అకౌంట్‌లో 46పైసలు.. ఇంట్లో రూ. 47.80 లక్షలు

- నీట్‌ అడ్మిషన్ల పేరిట విద్యార్థులకు టోకరా

- మోసాలకు తెరలేపిన ఎంబీఏ పట్టభద్రుడు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): తక్కువ ఫీజుకే మెడికల్‌ సీటు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి లక్షలు కాజేసిన నగరానికి చెందిన నిందితుడిని బెంగళూరు పోలీసులు(Bangalore Police) కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 18మంది విద్యార్థులను మోసం చేసి భారీగా దండుకున్న అతని ఖాతాలో మాత్రం కేవలం 46పైసలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. కానీ, బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఇంట్లో పరిశీలిస్తే రూ. 47.80 లక్షల నగదు చిక్కింది. వివరాలిలా ఉన్నాయి

హైదరాబాద్‌కు చెందిన శరత్‌గౌడ్‌ (45) ఎంబీఏ వరకు చదువుకున్నాడు. 12 ఏళ్లుగా బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నాడు. నీట్‌ అభ్యర్థులకు మెడికల్‌ సీట్‌ ఆశ చూపి డబ్బులు దండుకోవచ్చనే ఆలోచనతో మోసాలకు తెర లేపాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని న్యూ బీఈఎల్‌ రోడ్డులో ‘నెక్సస్‌ ఎడ్‌’ పేరుతో ఓ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఓ ఏజెంటుకు డబ్బులిచ్చి ‘నీట్‌’కు హాజరైన 20వేల విద్యార్థుల వివరాలు సంపాదించాడు. నలుగురు మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని ఫోన్‌ల ద్వారా వారిని కాంటాక్ట్‌ చేస్తూ.. రూ. 12 లక్షలకే కేరళలో మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. దీనిని నమ్మిన ఓ విద్యార్థికి కేరళలోని పీకేదాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సలో మెడికల్‌ సీటు ఇప్పించేందుకు రూ.12 లక్షలు డిమాండ్‌ చేయగా.. రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్సుగా రూ.4లక్షలు చెల్లించుకున్నారు. అడ్మిషన్‌ నిమిత్తం ఆ విద్యార్థి కేరళలోని కళాశాలను సంప్రదించినపుడు అసలు విషయం బయట పడింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు బెంగళూరులోని సంజయ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

DDDD.jpg

16గంటల పాటు మాటువేసి...

అక్కడ కార్యాలయం మూసి హైదరాబాద్‌కు పారిపోయాడని గుర్తించిన పోలీసులు నగరానికి చేరుకున్నారు. ఓ టీం అతని బ్యాంకుకు వెళ్లగా అతని బ్యాంకు ఖాతాలో కేవలం 46 పైసలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మరో బృందం అతని ఇంటికి వెళ్లి 16గంటలపాటు మాటు వేసింది. ఎట్టకేలకు అతన్ని గుర్తించి పట్టుకుని బెంగళూరుకు తరలించారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ. 47.80లక్షల నగదు దొరికింది. అతన్ని విచారించగా 18మంది విద్యార్థులను మోసం చేసినట్లు గౌడ్‌ ఒప్పుకున్నాడని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి.దయానంద తెలిపారు. ఇంట్లో భార్యను విచారించగా అతను బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని మాత్రమే తెలుసని చెప్పడం గమనార్హం.

Updated Date - 2023-11-11T08:52:32+05:30 IST