Lovers: పాపం ఈ లవర్స్.. కనిపించకుండాపోతే కలిసి వెళ్లిపోయి ఉంటారనుకున్నారు.. కానీ..

ABN , First Publish Date - 2023-06-19T16:40:49+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని, ఆ యువతినీయువకుడినీ చంపి.. వారి మృతదేహాలను బండరాళ్లకు కట్టేసి.. తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో పడేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Lovers: పాపం ఈ లవర్స్.. కనిపించకుండాపోతే కలిసి వెళ్లిపోయి ఉంటారనుకున్నారు.. కానీ..

భోపాల్: మనుషుల్లో కొందరిలో రానురానూ రాక్షసత్వం పెరిగిపోతోంది. జాలి, దయ, కరుణ లాంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. పేగు తెంచుకుపుట్టిన కన్న బిడ్డలను కూడా తమ పరువుపంతాల కోసం, పట్టింపుల కోసం పొట్టనపెట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మొరేనా జిల్లాలో (Morena District) సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని, ఆ యువతినీయువకుడినీ చంపి.. వారి మృతదేహాలను బండరాళ్లకు కట్టేసి.. తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో (Crocodile Infested River) పడేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మొరేనా జిల్లాలోని రతన్‌బసై గ్రామానికి చెందిన శివానీ థోమర్‌ (Shivani Thomar) అనే 18 ఏళ్ల యువతి, సమీప గ్రామమైన బలుపూర గ్రామానికి చెందిన రాధేశ్యామ్‌ థోమర్ (RadheSyam Thomar) అనే 21 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు ఇటీవల తెలిసింది. రెండు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాయి. మరీ ముఖ్యంగా శివాని కుటుంబం రాధేశ్యామ్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఆ తర్వాత కూడా శివాని, రాధేశ్యామ్ సన్నిహితంగా మెలగడంతో శివాని కుటుంబం కర్కశమైన ఆలోచన చేసింది.

ఇద్దరినీ కిరాతకంగా చంపేసి.. వారి మృతదేహాలను తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో పడేశారు. రాధేశ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం శివాని, రాధేశ్యామ్ కనిపించకుండాపోయారు. ఇద్దరూ పెద్దలకు తెలియకుండా వెళ్లిపోయి ఉండొచ్చని అంతా భావించారు. కానీ.. శివాని తల్లిదండ్రుల మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా తొలుత ఈ ఇద్దరూ కలిసి వెళ్లిపోయి ఉండొచ్చని భావించారు.

అయితే.. రెండు ఊళ్లలో ఏ ఒక్కరి కంటపడకుండా, ఎవరి సాయం లేకుండా వెళ్లే ఛాన్స్ లేదని భావించి శివాని తల్లిదండ్రులను విచారించడంతో విషయం తెలిసింది. జూన్ 3న శివానిని, రాధేశ్యామ్‌ను కిడ్నాప్ చేసి కాల్చి చంపేసి.. ఆ మృతదేహాలను తీసుకెళ్లి మొసళ్లు ఎక్కువగా ఉండే చంబల్ నదిలో పడేసి చేతులు దులుపుకున్నట్లు శివాని తల్లిదండ్రులు నిజం కక్కేశారు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు ఈ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. Chambal Gharial Sanctuary లో మొత్తం 2500పైగా మొసళ్లు ఉండటం గమనార్హం.

Updated Date - 2023-06-19T16:41:35+05:30 IST