Saidapet Railway Station: రాజేశ్వరి హత్యకు వివాహేతర సంబంధాలే కారణమా...
ABN , First Publish Date - 2023-07-21T10:59:47+05:30 IST
స్థానిక సైదాపేట రైల్వేస్టేషన్(Saidapet Railway Station)లో పండ్ల వ్యాపారం చేసే మహిళను గుర్తు తెలియని నలుగురు దారుణంగా హత్య చేసి పరార
- రైల్వేస్టేషన్‌లో మహిళ దారుణ హత్య
పెరంబూర్(చెన్నై): స్థానిక సైదాపేట రైల్వేస్టేషన్(Saidapet Railway Station)లో పండ్ల వ్యాపారం చేసే మహిళను గుర్తు తెలియని నలుగురు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. బుధవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. మీనంబాక్కం ఎంజీఆర్‌నగర్‌లో భువనేశ్వరన్, రాజేశ్వరి (30) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. రాజేశ్వరి రోజూ రైల్వేస్టేషన్లలో పండ్లు, సమోసాలు అమ్మి, సాయంత్రానికి ఇంటికి చేరుతుంది. ఆ మేరకు బుధవారం సాయంత్రం తన వ్యాపారం ముగించుకుని సైదాపేట రైల్వేస్టేషన్‌లో రాజేశ్వరి రైలు కోసం ఎదురుచూస్తుండగా ఆ స్టేషన్‌కు వచ్చిన ఓ రైలు నుండి దిగిన నలుగురు వేటకొడవళ్లతో ఆమెపై దాడి జరిపి అదే రైలులోనే పరారయ్యారు. దుండగుల దాడిలో వంటి నిండా కత్తిపోట్లతో ఫ్లాట్‌ఫామ్‌పై రాజేశ్వరి కుప్పకూలిపడింది. ఈ సంఘటనను చూసి రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న మాంబళం రైల్వే పోలీసులు కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక గురువారం వేకువజామున ఆమె మృతిచెందింది. రాజేశ్వరికి పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని, ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. సైదాపేట రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో హంతకులను వెంటనే గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. అయితే రాజేశ్వరి సెల్‌ఫోన్‌లో నమోదైన వివరాల ప్రకారం హంతకులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.