సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మృతి

ABN , First Publish Date - 2023-02-18T07:50:43+05:30 IST

రాష్ట్ర రహదారుల అభివృద్ధి శాఖ సంచాలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కదిరవన్‌(Senior IAS officer Kadiravan) శుక్రవారం ఉదయం గుండెపోటుతో

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మృతి

- స్టాలిన్‌ సంతాపం

చెన్నై: రాష్ట్ర రహదారుల అభివృద్ధి శాఖ సంచాలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కదిరవన్‌(Senior IAS officer Kadiravan) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటు కారణంగా చెన్నైలో అశువులు బాశారు. గతంలో ఆయన విల్లుపురం ఆర్డీవోగా, ధర్మపురి, ఈరోడ్‌ జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. నామక్కల్‌ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన కదిరవన్‌ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 2002లో టీఎన్‌పీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ధర్మపురి సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. సేలం జిల్లా ఆవిన్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. 2013లో ఐఏఎస్‌ స్థాయిని పొంది వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలను కొనసాగించారు. ఆ తర్వాత మదురై కార్పొరేషన్‌ కమిషనర్‌గా, 2016లో కృష్ణగిరి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

సీఎం సంతాపం...

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కదిరవన్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర రహదారుల అభివృద్ధి శాఖ సంచాలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కదిరవన్‌ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారని, త్వరలో కోలుకుంటారని ఆశించానని తెలిపారు. కదిరవన్‌ మృతితో శోకతప్తులైన కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-18T07:50:45+05:30 IST