Tatkal tickets: తత్కాల్ టిక్కెట్ల విక్రయాల్లో రూ.4 కోట్ల మోసం
ABN , First Publish Date - 2023-02-14T09:08:15+05:30 IST
నకిలీ గుర్తింపుకార్డు ద్వారా రైల్వే తత్కాల్ టిక్కెట్ల(Railway Tatkal Tickets) విక్రయంలో రూ.4 కోట్లకు పైగా మోసం జరిగిందని, మూడేళ్లలో 595 కేసులు న
ప్యారీస్(చెన్నై), ఫిబ్రవరి 13: నకిలీ గుర్తింపుకార్డు ద్వారా రైల్వే తత్కాల్ టిక్కెట్ల(Railway Tatkal Tickets) విక్రయంలో రూ.4 కోట్లకు పైగా మోసం జరిగిందని, మూడేళ్లలో 595 కేసులు నమోదుచేసి సంబంధితులపై చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నకిలీ గుర్తింపుకార్డుల ద్వారా రైల్వేను మోసం చేస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు 2019 మే 20న ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)తో కలసి ఈ విభాగం అధికారులు తమిళనాడు, కేరళ, కర్ణాటక(Tamil Nadu, Kerala, Karnataka) తదితర పొరుగు రాష్ట్రాల మీదుగా నడుపుతున్న రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సైబర్ క్రైం(Cybercrime) పోలీసులు సామాజిక మాధ్యమాలు, టిక్కెట్ల రిజర్వేషన్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో గత జనవరి నెలలో టిక్కెట్లు విక్రయించిన నాలుగు ప్రైవేటు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం తిరుచ్చికి చెందిన ప్రైవేటు సంస్థ అధిపతిని అదుపులోకి తీసుకొని జరిపిన విచారణలో, రూ.56 లక్షలకు పైగా 1,25,569 టిక్కెట్లు చట్టవిరుద్ధంగా రిజర్వ్ చేసుకున్న విషయం వెలుగుచూసింది. ఇలాంటి అక్రమ ప్రైవేటు సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ-టిక్కెట్ రిజర్వేషన్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా నకిలీ ఐడీ ద్వారా రైల్వే తత్కాల్ టిక్కెట్ల విక్రయంలో రూ.4 కోట్లకు పైగా జరిగిన మోసంపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.