Crime news: మద్యం సేవించి 30 ఏళ్లనాటి ఘోరాన్ని బయటపెట్టాడు.. విన్నవారందరూ షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-06-18T13:27:15+05:30 IST

అవినాష్ పవార్ అనే వ్యక్తి మద్యం మత్తులో 30 ఏళ్ల క్రితం తాను చేసిన జంట హత్యలు, దోపిడీ గురించి బయటపెట్టి ముంబై క్రైమ్ బ్రాంచీ పోలీసులకు దొరికిపోయాడు.

Crime news: మద్యం సేవించి 30 ఏళ్లనాటి ఘోరాన్ని బయటపెట్టాడు.. విన్నవారందరూ షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

ముంబై: మూడు దశాబ్దాల క్రితం చేసిన జంట హత్యలు. 30 ఏళ్లుగా తప్పించుకోని తిరుగుతున్నాను. ఇప్పుడు బయటపెట్టినంత మాత్రాన తనను ఏం చేయలేరులే అనే ధైర్యం. ఆ ధైర్యానికి మద్యం కూడా తోడైంది. ఇంకేముంది మద్యం ఇచ్చిన ధైర్యంతో 30 ఏళ్ల క్రితం తాను చేసిన దారుణ హత్యలను బయటపెట్టి పోలీసులకు దొరికిపోయాడు ఓ వ్యక్తి. దీంతో పోలీసులకు దొరకకుండా 3 దశాబ్దాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న హంతకుడు మద్యం మత్తులో నోరు జారి జైలుపాలయ్యాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది ఈ ఘటన.

అవినాష్ పవార్ అనే వ్యక్తి మద్యం మత్తులో అతి ఆత్మవిశ్వాసానికి పోయాడు. ఆ అతి ఆత్మవిశ్వాసంతో 30 ఏళ్ల క్రితం తాను చేసిన జంట హత్యలు, దోపిడీ గురించి బయటపెట్టి ముంబై క్రైమ్ బ్రాంచీ పోలీసులకు దొరికిపోయాడు. దీంతో 30 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకోని తిరుగుతున్న అవినాష్ పవార్‌ను మద్యం పట్టించినట్టైంది.

అసలు ఏం జరిగిందంటే.. 1993 అక్టోబర్‌లో అవినాష్ పవార్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ముంబైలో గల లోనావాలాలోని ఓ ఇంటిని దోచుకునేందుకు వెళ్లారు. ఇంటిని దోచుకోవడమే కాకుండా ఆ ఇంటిలోని భార్యభర్తలను చంపేశారు. భర్త వయసు 55 ఏళ్లు కాగా.. భార్య వయసు 50 ఏళ్లు. ఈ దారుణానికి ఒడిగట్టినప్పుడు పవార్ వయసు 19 సంవత్సరాలు మాత్రమే. ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అప్పుడే అరెస్ట్ చేశారు. కానీ 19 ఏళ్ల అవినాష్ పవార్ మాత్రం పోలీసులకు చిక్కకుండా కన్నతల్లిని కూడా వదిలేసి ఢిల్లీ పారిపోయాడు.

కొంతకాలం తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు వచ్చాడు. అక్కడే డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఔరంగాబాద్‌కు వచ్చాక తన పేరును మార్చుకున్నాడు. అశోక్ పవార్‌కు బదులుగా అమిత్ పవార్ అని పెట్టుకున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా అదే పేరుతో తీసుకున్నాడు. ఆ తర్వాత ఔరంగాబాద్ నుంచి పింప్రి-చించ్‌వాడు, అహ్మద్‌నగర్‌కు వెళ్లిపోయాడు. చివరగా ముంబైలోని విక్రోలీలో స్థిరపడ్డాడు.

కొత్త పేరుతోనే పవార్ ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు. అలాగే వివాహం కూడా చేసుకున్నాడు. తన భార్య రాజకీయ నాయకురాలిగా విజయవంతం కావడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. కాగా దాదాపు 30 ఏళ్లలో పవార్‌ను పోలీసులు గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అతని వయసు 49 సంవత్సరాలు. ఈ 30 ఏళ్లలో పవార్ లోనావాలాలో నివసిస్తున్న అతని తల్లిని కానీ, కట్టుకున్న భార్యను కానీ కలవడానికి ఎప్పుడూ వెళ్లలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇక పోలీసులు తనను పట్టుకోలేరనే అతి ఆత్మవిశ్వాసంతో కొన్ని రోజుల క్రితం మద్యం సేవించినప్పుడు 30 ఏళ్ల క్రితం తాను చేసిన జంట హత్యలు, దోపిడీ గురించి వేరే వ్యక్తితో చెప్పాడు. అయితే ఈ విషయం విన్న ఆ వ్యక్తి ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌కు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు పవార్‌ను శుక్రవారం విక్రోలీలో అరెస్ట్ చేశారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్ తిలక్ రోషన్ మాట్లాడుతూ.. ‘‘30 ఏళ్ల క్రితం లోనావాలాలో జరిగిన జంట హత్యల కేసులో అవినాష్ పవార్ నిందితుడు. బాధితులు పవార్‌కు తెలిసిన వృద్ధ దంపతులు. వారి ఇంటికి దగ్గర్లోనే పవార్‌ ఒక షాపు నడుపుతుండేవాడు. మరో ఇద్దరితో కలిసి ఆ వృద్ధ దంపతుల ఇంటిని దోచుకోవాలని పవార్ వ్యూహం పన్నాడు. అయితే ఇంటిని దోచుకునే సమయంలో దంపతులిద్దరినీ వారు హత్య చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అప్పుడే అరెస్ట్ చేశాం. కానీ పవార్ తప్పించుకోని పారిపోయాడు. పేరు మార్చుకున్నాడు. చివరకు పవార్‌ను కూడా విక్రోలీలో అరెస్ట్ చేశాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-06-18T13:27:15+05:30 IST