Barrelakka: బిగ్ లీడర్స్‌కే వణుకు పుట్టిస్తున్న కొల్లాపూర్ బర్రెలక్క
ABN , First Publish Date - 2023-11-23T12:06:28+05:30 IST
బర్రెలక్క వంటివారిని చూసి తెలంగాణ అంతటా ప్రశ్నించే వాతావరణం, అసమ్మతి వ్యక్తీకరణ ఉందని అనుకోలేము....
ఆశ్చర్యాలూ అద్భుతాలూ ఆదర్శాలూ ఏవీ కూడా మనుషుల్లోనూ వాతావరణంలోనూ లేకుండా నీరసంగా సాగుతున్న తెలంగాణ ఎన్నికల రంగస్థలం మీద చిన్న కలకలపు కదలిక కనిపించసాగింది. అలికిడికి ఎక్కువ, అలజడికి తక్కువ అనిపిస్తూ, ఒక బక్కప్రాణపు ఆడపిల్ల పీలగొంతుక పెట్టుకుని ఆవేదనగా, ఆగ్రహంగా, అభ్యర్థనగా మాట్లాడుతూ, డబ్బుమదంతో మూకబలంతో కుళ్లి కంపు కొడుతున్న ఎన్నికల పోరుని భూమార్గం పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ అమ్మాయి గెలవగలదని కాదు, ఈ వ్యవస్థ గెలవనిస్తుందని కాదు. తనకున్నంత దమ్మూధైర్యమూ మరెవరికీ లేనందుకు, తనకున్నంత అమాయకత్వాన్ని అందరూ ఎప్పుడో పారేసుకున్నందుకు కదా, ఇంత ఆశ్చర్యం!
కర్నె శిరీష అందమైన పేరు. జీవితం ఆమెని బర్రెలక్కని చేసింది. ఇష్ట సమాజం ఆమెకు అదే పేరు ఖరారు చేసింది. ఈ మాలపిల్ల నాగర్ కర్నూలు జిల్లాలోని రెడ్డి, రావు దొరల నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో అన్‌రిజర్వ్‌డ్ యుద్ధం చేస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు అత్యంత బాధిత వర్గంగా మారిన నిరుద్యోగుల తరఫున గొంతుగా మారింది. రూపాయి రూపాయిగా ఎన్నికల నిధులను సమీకరించుకుంటున్నది, అండగా ఉంటానన్న ఆప్తులే అంగబలంగా పనిచేస్తున్నది. డబ్బును ఓడించమంటున్నది. నిరుద్యోగులతో చెలగాటమాడిన ప్రభుత్వానికి గుణపాఠం కింద తనకు ఓటువేయమంటున్నది. కొల్లాపూర్‌కు కీర్తి తెమ్మంటున్నది. ఎంతటి ఆశ ఆమెకు, మార్పు కావాలని! లేత స్వప్నాలు ఎంతటి అందమైనవి!
సామాజిక మాధ్యమాలలో హడావిడే తప్ప, నేల మీద బర్రెలక్కకు బలమేమి ఉంటుందని పెదవి విరవవచ్చు. డిగ్రీ చేసి, ఉద్యోగం మీద ఆశ చచ్చి బర్రెల పెంపకం చేపట్టానని అరనిమిషం విడియో చేస్తే అది ‘వైరల్’ అయ్యింది. మనసు కదిలిన అన్ని సందర్భాలలో చేతలు కూడా కలిస్తే, వాస్తవ సమస్యలూ వాటి మీద కార్యాచరణ కూడా ‘వైరల్’ అవుతాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న సానుభూతి రాజకీయమద్దతుగా మారాలని బర్రెలక్క కోరుతోంది. కొల్లాపూర్ ప్రజలు ఆమెను పట్టించుకుంటారా, ఆమె అభ్యర్థనను అంగీకరిస్తారా? పదేళ్ల పరిపాలన మీద ఓటు రూపంలో ఒక ప్రకటన చేస్తారా? అంతగా ఆశపడలేము!
జనానికి కావలసింది జరగడం లేదు కాబట్టి ప్రజాప్రతినిధిగా గెలిచి పనులు చేయాలని బర్రెలక్క అనుకుంటున్నది. ఆ అమ్మాయికి ఈ అధికార రాజకీయాలు తెలియవు. ఎన్నికల్లోకి దిగాలంటే ఎంత డబ్బు కావాలో, ఏమేమి హంగులుండాలో, అన్నిటికి మించి ఎంతటి నేపథ్యం ఉండాలో కూడా ఆమెకు పూర్తి అవగాహన లేదు. నాయకురాలి పాత్ర పోషిస్తున్నప్పుడు, తమ్ముడి మీద చిన్న చేయి పడిందని రాగాలు తీయగూడదని కూడా తనకు తెలియదు. తాను న్యాయపక్షం కాబట్టి, అన్నిటిని దాటుకుని వెళ్లగలననే అమాయకపు ధీమా ఏదో ఉన్నది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ అవకాశం ఉన్నదని ఆమె నమ్ముతోంది. మనలో ఎందరికి అటువంటి నమ్మకాలున్నాయి? రాజ్యాంగం మనకు రక్షణ ఇవ్వగలదని, ప్రజాస్వామ్యంలో మనకు సమానావకాశాలు ఉంటాయని ఎందరు నమ్ముతున్నారు? నమ్మలేకపోవడానికి నడుస్తున్న చరిత్ర, కలుగుతున్న అనుభవాలే కారణం కావచ్చు. అందరమూ అంతరాంతరాలలో అవిశ్వాసులుగా మారిపోయే పరిస్థితులే ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే చదువులలోకి, సాధికారతా ప్రయాణంలోకి నడుస్తున్న అట్టడుగు కులాలవారు, చదువులలో రాణించి జీవితంలో ఎదిగి వెలగాలని కోరుకునే ఆడపిల్లలు ఇంకా పూర్తి అపనమ్మకంలోకి జారిపోలేదు! ఈ వ్యవస్థలు వారికి ఎంతటి కృతజ్ఞతతో ఉండాలి? ఇన్ని ఆశాభంగాలున్నా, తమకు ఇంకా నైతికతను విశ్వసనీయతను కల్పిస్తున్నందుకు ఎంతగా ప్రత్యుపకారం చేయాలి? ఈ విశ్వాసాన్ని మరింత మందిలో కలిగించడానికి అనువుగా ఆధిపత్యాలను, అన్యాయాలను కనీసం అంగుళం మందమైనా సడలించాలి! కానీ, ఆ పని చేస్తాయా? లేక, బర్రెలక్కల వంటివారు నమ్మి చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటాన్ని భగ్నంచేసి, ఇక తెగింపు పద్ధతులే మార్గం అనుకునే దశకు నెట్టివేస్తాయా?
బర్రెలక్క వంటివారిని చూసి తెలంగాణ అంతటా ప్రశ్నించే వాతావరణం, అసమ్మతి వ్యక్తీకరణ ఉందని అనుకోలేము. చివరికి ఈ ఎన్నికల ఫలితం, అధికారపార్టీకి హ్యాట్రిక్ దక్కడమే కావచ్చు, కింగ్ మేకర్‌తోనో లేకుండానో త్రిశంకు సభ ఏర్పడనూవచ్చు, కాంగ్రెస్‌కే ఘనవిజయం దొరకవచ్చు. ఎవరు ఉన్నా, మరెవరు ఊడినా, ప్రజల సమస్యలు మాత్రం ఉనికిలోనే ఉంటాయి. ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ, ఒత్తిడిచేసి పనిచేయించుకుంటూ ఉండాలనే ప్రజాస్వామిక స్పృహ ప్రజలలో పెరిగితే పరిస్థితులలో కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వాలు దాన్ని సులువుగా అనుమతిస్తాయని కాదు. ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఎన్నికలలో నిలబడడం సరే, దాని ఫలితంతో నిమిత్తం లేకుండా బర్రెలక్క, ఆమె అభిమాన సహచరులు నిరంతర ప్రజాచరణలో కొనసాగడమే అందుకు మార్గం.
పదిసంవత్సరాల నుంచి మాటలే తప్ప ప్రభుత్వం నుంచి ఏ చేతలూ లేని గల్ఫ్ కార్మికుల సమస్యలకు గొంతివ్వడానికి అయిదుగురు స్వతంత్రులుగానో, చిన్నపార్టీల అభ్యర్థులుగానో పోటీచేస్తున్నారు. ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరొక చోట ఒక ఎన్నారై యువతి, ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోరులో కనిపిస్తున్నారు. ఓటు పోరాటాన్ని మార్పుకు సాధనంగా పరిగణించి పోటీలో ఉన్నారు.
అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటున్న పార్టీ, చేపట్టాలనుకుంటున్న పార్టీలు కానీ బర్రెలక్కలో ఉన్నంత సంకల్పాన్ని, నిజాయితీని కలిగి ఉన్నాయా? ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులలో ఒక్కరంటే ఒక్కరు మార్పును మనస్ఫూర్తితో కోరుకుంటూ పనిచేస్తున్నవారున్నారా? బర్రెలక్క ఒక్కరే కాదు, ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న అతి కొద్దిమంది అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలబడ్డారు, లేదా, అతి చిన్న పార్టీల తరఫున పోటీలో ఉన్నారు. పదిసంవత్సరాల నుంచి మాటలే తప్ప ప్రభుత్వం నుంచి ఏ చేతలూ లేని గల్ఫ్ కార్మికుల సమస్యలకు గొంతివ్వడానికి అయిదుగురు స్వతంత్రులుగానో, చిన్నపార్టీల అభ్యర్థులుగానో పోటీచేస్తున్నారు. ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరొక చోట ఒక ఎన్నారై యువతి, ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోరులో కనిపిస్తున్నారు. ఓటు పోరాటాన్ని మార్పుకు సాధనంగా పరిగణించి పోటీలో ఉన్నారు. మరి, ఎందుకు ప్రధానస్రవంతి పార్టీలు ఇంతగా డొల్లగా, కల్లబొల్లి సంస్థలుగా మారిపోయాయి?
నిరుద్యోగ సమస్య తీవ్రత అధికారపార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇద్దరికీ తెలుసు. బీఆర్ఎస్‌ను అతిగా కలవరపరుస్తున్న అంశాలలో అది కూడా ఒకటి. ప్రయత్నిస్తే, తనకు రాజకీయంగా లాభించే అంశమని కాంగ్రెస్‌కు తెలుసు. అధికారపార్టీకి పశ్చాత్తాపమూ లేదు, కనీసం బాధితులను దుర్భాషలాడకూడదన్న నిగ్రహమూ లేదు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చి, ఒక రాజకీయశక్తిగా సంఘటితం చేసి ప్రయోజనం పొందాలన్న వ్యూహమూ, యుక్తీ ప్రతిపక్షపార్టీకి లేవు. ఓటర్లకు సంక్షేమాలను వాగ్దానం చేయడం, ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పించడం తప్ప, ఉపాధి కల్పన వంటి కీలకమయిన అంశాలలో పరిష్కారం చూపగలిగిన విధాన స్పష్టత ఏ పక్షానికీ లేదు. ఇప్పటి దాకా ఎందుకు చేయలేదో సహేతుకంగా చెప్పడమో, క్షమాపణ కోరడమో జరిగాక కదా, డిసెంబర్ 3వ తారీకు నాడు సృష్టించే అద్భుతానికి విశ్వసనీయత వచ్చేది! నిజం చెప్పాలంటే, ప్రజలలో ఉండే అసంతృప్తి మీద అధికారపార్టీకి ఏ గౌరవమూ, పట్టింపూ లేదు. దాన్ని మభ్యపెట్టవచ్చు, మాయ చేయవచ్చు అనుకుంటుంది తప్ప, తొలగించాలని ప్రయత్నించదు. ప్రజల ప్రశ్నలను, అసమ్మతిని ఆమోదిస్తే అదొక అవమానం. తాము దయదలచి ఇవ్వాలే తప్ప, ప్రజలు అడిగారని ఇవ్వడం మొదలుపెడితే లోకువ అవుతామన్న బెట్టు. తమను అంతో ఇంతో అభద్రతకు గురిచేస్తున్న నిరుద్యోగుల అసంతృప్తి విషయంలో కూడా, తెలంగాణ అధికారపార్టీ తన పంతాన్ని వదులుకోవడం లేదు. నిరుద్యోగం కంటె ఈ తిరస్కారమే యువతను అధికంగా బాధిస్తున్నది. ప్రజల వాస్తవ సమస్యలను సీరియస్‌గా చర్చకు పెట్టి, మార్పుకు దోహదం చేసే విధంగా ఎన్నికల పోరాటాన్ని తీర్చిదిద్దడం లేదని ప్రతిపక్షాల మీద కూడా యువతకు కోపం ఉన్నది. ఆ కోపం సరైన రీతిలో, సరైన మోతాదులో వ్యక్తం కావడానికి అవకాశాలు లేనప్పుడు, ఉన్నపార్టీలలోనే ఏదో ఒకదానికి ఓటు వేసి తమ అసమ్మతిని తెలిపే ప్రయత్నం చేయవచ్చు. మరి కొందరు, అది కూడా చేయకుండా, మార్పు రాదని, ప్రస్తుత స్థితే శాశ్వతమని నిస్పృహకులోనై, మద్యంలోనో ఓటుకు పలికే రేటులోనో ఉపశమనం వెదుక్కోవచ్చు.
తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రయాణంలో ప్రజలు సంతోష పడ్డ సందర్భాలు లేవని కాదు. తప్పులు చేయడం మానవసహజం అని కొత్త వినయంతో చెప్పడం ఈ రోజు వింటున్నాము. ఇన్నేళ్లు పాలించిన ప్రభుత్వం అన్నో ఇన్నో ఒప్పులు చేయడం కూడా సహజమే. ప్రజలకు కావాలసింది ఔదార్యమో తిరస్కారమో కాదు. భాగస్వామ్యం. మంచీచెడూలో తప్పూఒప్పూలో ప్రజలతో కలిసి నడిస్తే, నింద నేత మీద మాత్రమే ఉండదు. ఒక మహాజలాశయమో, ఒక బృహత్ సంక్షేమ పథకమో తన బుర్రలోనుంచే పుట్టిందని నాయకుడు చెప్పుకోవడం ఏమంత మర్యాద? ప్రజలతో, పౌరసమాజంతో సంప్రదించి, అఖిలపక్షాలను కలుపుకొని కదా పాలన జరగవలసింది? లక్ష కోట్లు ఖర్చుచేసిన నీటి ప్రాజెక్టు వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గించలేకపోయింది, కుప్పలు కుప్పలుగా తరలివచ్చిన పెట్టుబడులు నిరుద్యోగానికి చికిత్స చేయలేకపోయ్యాయి. కేజీ నుంచి పీజీ విద్య, సార్వజనీన ఆరోగ్యం రెండూ ఎండమావులుగా మిగిలిపోయాయి. ఎన్నెన్ని పెన్షన్లు కూడా గ్రామీణ తెలంగాణకు ఉపశమనం ఇవ్వలేకపోయాయి. ప్రతి ఇంటా లబ్ధిదారులున్నారు నిజమే, కానీ, ప్రతి ఇంట్లోనూ ఒక నిరుద్యోగి కూడా ఉన్నాడు. బర్రెలక్క కొల్లాపూర్‌లో పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి గురించి కూడా అడుగుతోంది. తన లాంటి పేద, దళిత కుటుంబాల నుంచి కష్టపడి చదువుకున్న యువకులకు ఎదురవుతున్న జీవితం ఏమిటని ప్రశ్నిస్తోంది. తన జీవితాన్ని చిన్న వీడియో తీస్తే కేసులు పెట్టి వేధించడం ఏమి సుపరిపాలన అని నిలదీస్తోంది? సంక్షేమ పథకాలతో గ్రామీణ తెలంగాణలో సంతృప్తి పొంగిపొర్లుతోందని అనుకుంటే పొరపాటు. బర్రెలక్క వంటివారిని చూసి తెలంగాణ అంతటా ప్రశ్నించే వాతావరణం, అసమ్మతి వ్యక్తీకరణ ఉందని అనుకోలేము. చివరికి ఈ ఎన్నికల ఫలితం, అధికారపార్టీకి హ్యాట్రిక్ దక్కడమే కావచ్చు, కింగ్ మేకర్‌తోనో లేకుండానో త్రిశంకు సభ ఏర్పడనూవచ్చు, కాంగ్రెస్‌కే ఘనవిజయం దొరకవచ్చు. ఎవరు ఉన్నా, మరెవరు ఊడినా, ప్రజల సమస్యలు మాత్రం ఉనికిలోనే ఉంటాయి. ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ, ఒత్తిడిచేసి పనిచేయించుకుంటూ ఉండాలనే ప్రజాస్వామిక స్పృహ ప్రజలలో పెరిగితే పరిస్థితులలో కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వాలు దాన్ని సులువుగా అనుమతిస్తాయని కాదు. ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఎన్నికలలో నిలబడడం సరే, దాని ఫలితంతో నిమిత్తం లేకుండా బర్రెలక్క, ఆమె అభిమాన సహచరులు నిరంతర ప్రజాచరణలో కొనసాగడమే అందుకు మార్గం.
-కె.శ్రీనివాస్