Amma odi: ఉత్తుత్తి బటనే! అమ్మ‘ఒడి’ చేరని పథకం!
ABN , First Publish Date - 2023-07-01T11:19:33+05:30 IST
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే చెల్లింపులు జరిగిపోతున్నాయి. సర్కారు ఆర్‌బీఐ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ద్వారా నగదు జమ చేస్తోంది. బిల్లులు ముందే అప్‌లోడ్ చేస్తే అర్ధ పనిదినంలో లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్చు వేసేయొచ్చు. అయినా కొందరికే అమ్మఒడి పడింది. ఎందుకంటే... ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. కొత్త అప్పు తెస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి.
మొత్తం లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలు
చెల్లించాల్సిన నగ దు రూ.6,300 కోట్లు
ఇప్పటి వరకు రూ.2,000 కోట్లే జమ
సీఎం జగన్ బటన్ నొక్కిన ‘పార్వతీపురం మన్యం’లోనూ ఎదురుచూపులే
పూర్తిస్థాయి చెల్లింపులు ఎప్పుడో
ఖజానాలో చిల్లి గవ్వ లేని పరిస్థితి
సామాజిక పెన్షన్లు, జీతాలకు ఓడీ అప్పే గతి
4వ తేదీన మరో రూ.3000 కోట్ల అప్పు
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే చెల్లింపులు జరిగిపోతున్నాయి. సర్కారు ఆర్‌బీఐ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ద్వారా నగదు జమ చేస్తోంది. బిల్లులు ముందే అప్‌లోడ్ చేస్తే అర్ధ పనిదినంలో లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్చు వేసేయొచ్చు. అయినా కొందరికే అమ్మఒడి పడింది. ఎందుకంటే... ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. కొత్త అప్పు తెస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి.
(అమరావతిఆంధ్రజ్యోతి): ఇస్తామన్న అమ్మఒడి పథకం నగదులో కోతలు. లబ్ధిదారుల జాబితాలోనూ కోతలు. మిగిలినవారికైనా చెప్పిన సమయానికి ఇస్తున్నారా అంటే... అదీ లేదు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి పథకం నిధులు విడుదల చేస్తూ బటన్ నొక్కిన సంగతి తెలిసిందే. మొత్తం 45 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,300 కోట్లు జమ చేయాలి. అయితే శుక్రవారం సాయంత్రం వరకూ తల్లుల ఖాతాల్లో 2000 కోట్ల నగదు మాత్రమే జమ అయినట్టు తెలుస్తోంది. ఖజానాలో డబ్బు లేకపోవడంతో లబ్ధిదారులందరికీ నగదు పడలేదని సమాచారం. అంటే.. ఖజానాలో డబ్బులు లేకుండానే సీఎం జగన్ బటన్ నొక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సగటున రూ.1,58,000 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ, ఖజానా మాత్రం ఖాళీగానే ఉంటుంది.
జిల్లాకో కారణాలు
జూన్ 28వ తేదీన సీఎం జగన్ బటన్ నొక్కారు. ఆ రోజు బుధవారం బ్యాంకులకు సెలవు లేదు. ఈ చెల్లింపులన్నీ ఆర్‌బీఐ ఈకుబేర్ ప్ల్లాట్‌ఫా మ్ ద్వారా జరుగుతాయి. ఒక్క బిల్లుతో గరిష్ఠంగా 50,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయొచ్చు. బిల్లులు ఈకుబేర్‌లో అప్‌లోడ్ చేసిన అర్ధగంటలోనే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే 3 రోజులు అయినా చాలామంది లబ్ధిదారులకు నగదు పడలేదు. దీనికి అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో కారణం చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 80% మంది లబ్ధిదారులకు అమ్మఒడి డబ్బులు అందలేదు. కారణం ఏంటంటే... అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ప్రతి ఐదు నిమిషాలకొకసారి ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో డబ్బు జమ అవుతుందంట. ఇక కృష్ణా జిల్లా లో గురువారం బక్రీదు సెలవు కారణంగా డబ్బులు పడలేదని చెబుతున్నారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చాక కూడా ‘సెలవు’ పేరు చెబుతున్నారు. ఇక సీఎం జగన్ అమ్మఒడి బటన్ నొక్కిన పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హుల జాబితాలో 83,733 మంది తల్లులు ఉన్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే డబ్బు అందింది. సీఎం సొంత జిల్లా కడపతో పాటు అనంతపురం, కృష్ణా, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంకా అమ్మఒడి డబ్బులు పడలేదని సమాచారం. ఇక, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ అమ్మఒడి ఇస్తామన్నారు. ఆ తర్వాత ఇంట్లో ఒక్కరికి మాత్రమే అని మాట మార్చారు. పోనీ ఇంట్లో ఒక్కరికైనా ఇస్తామన్న ఆ రూ.15,000 నగదు ఇస్తున్నారా అంటే.. అందులోనూ కోతలే. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1000 కోత పెట్టారు. ఆ తర్వాత మరో 1000 తగ్గించారు. అంటే.. రూ.15,000కు బదులు రూ13,000 ఇస్తున్నారు. ఇక ఒక ఏడాది పూర్తిగా ఈ పథకమే ఎత్తేశారు. లబ్ధిదారుల జాబితాలో నూ కోతలు పెడుతున్నారు. ఈ ఏడాది 1,30,000 మంది అర్హులు కాదని ప్రకటించారు.
పెన్షన్లు, జీతాలకు ఓడీ అప్పే
ఒకటో తేదీన సామాజిక పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు, మాజీ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి. 30వ తేదీ సాయంత్రం నాటికి ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆర్‌బీఐ నుంచి రూ.2,800 కోట్లు వేజ్ అండ్ మీన్స్ అప్పు తీసుకుంది. సామాజిక పెన్షన్లు రూ.1800 కోట్లు ఇవ్వాలంటే ఓడీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. ఓడీ అప్పుతోనే 20 శాతం జీతాలు చెల్లించే అవకాశాలున్నాయి. జూలై 4న రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ వేలంలో పాల్గొని మరో రూ.3,000 కోట్లు అప్పు తీసుకొస్తుంది. శుక్రవారం ఈ మేరకు ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చింది. ఈ రుణంతో ఆర్‌బీఐ వద్ద తీసుకున్న ఓడీ అప్పు కట్టేస్తుంది. ఆ తర్వాత రెండ్రోజులు ఆగి మళ్లీ ఆర్‌బీఐ వద్ద ఓడీ అప్పు తీసుకుని జీతాలు, అమ్మఒడి పథకం డబ్బులు నెమ్మదిగా, వాయిదాల పద్ధతిలో ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.
కరిగిపోతున్న ‘పరిమితి’
కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,275 కోట్ల అప్పు చేసుకునేందుకే రాష్ట్రానికి అనుమతిచ్చింది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌బీఐ ద్వారా రూ.21,000 కోట్ల అప్పులు తెచ్చింది. మరో రూ.3,000 కోట్లు తేబోతోంది. దీంతో కేంద్రం ఇచ్చిన అనుమతిలో మరో రూ.6,275 కోట్ల పరిమితి మాత్రమే మిగులుతుంది.