Exam Special: భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వివరంగా..
ABN , First Publish Date - 2023-04-12T18:12:23+05:30 IST
ప్రజల దగ్గర నుంచి ద్రవ్యాన్ని డిపాజిట్‌గా స్వీకరించి, ఒప్పందం ప్రకారం తిరిగి తీసుకోవడానికి అవకాశం కల్పించి...
ప్రజల దగ్గర నుంచి ద్రవ్యాన్ని డిపాజిట్‌గా స్వీకరించి, ఒప్పందం ప్రకారం తిరిగి తీసుకోవడానికి అవకాశం కల్పించి, ప్రజలకు, సంస్థలకు రుణాలు ఇచ్చే సంస్థలే బ్యాంకులు. డిపాజిట్లను స్వీకరించే విషయంలో మూడు అంశాలు తప్పనిసరి. 1) డిపాజిట్స్ ద్రవ్య రూపంలో స్వీకరించాలి 2) డిపాజిట్స్ తమ వాటాదారుల దగ్గర నుంచే కాకుండా ప్రజలందరికి నుంచీ స్వీకరించాలి. 3) డిపాజిట్స్‌ను చెక్కు లేదా ఇతర మార్గాల ద్వారా తిరిగి తీసుకొనే అవకాశం ఉండాలి. రుణాలు మంజూరు విషయంలో రుణాలు తమ సొంత వ్యాపారం కోసం కాకుండా ఇతరులకు రుణం ఇస్తూ ఉండాలి. ఈ రుణం ప్రత్యక్ష రుణం కావచ్చు లేదా బహిరంగ మార్కెట్‌లో సెక్యూరిటీల కొనుగోలు ద్వారా కూడా ఉండవచ్చు. ఈవిధంగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించి, ప్రజలకు రుణాలనిచ్చే సంస్థే బ్యాంకు.
డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు ఇవ్వడం ఈ రెండు విధులు ఒక సంస్థను బ్యాంకు అనడానికి తప్పనిసరి షరతులు. ఉదాహరణకు తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు ఉంటాయి. కానీ తపాలా పొదుపు ఖాతాలను బ్యాంకింగ్ అనలేము. ఎందుకంటే తపాలా పొదుపుల నుంచి తపాలా కార్యాలయాలు రుణాలు ఇవ్వవు. అదేవిధంగా కేవలం రుణాలు మాత్రమే ఇచ్చి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించని సంస్థలు కూడా బ్యాంకులు కావు. ఉదాహరణకు జీవితబీమా సంస్థ, పరపతి సంస్థలు మొదలైనవి.
దేశంలో వాణిజ్య బ్యాంకుల మూలాలు
దేశీయ బ్యాంకర్లు: ఆధునిక పద్ధతిలో బ్యాంకింగ్ వ్యవస్థ బ్రిటిష్ పాలన కాలంలో ఆరంభమైనప్పటికీ, ప్రాచీనకాలం నుంచి బ్యాంకులను పోలిన పరపతిని అందచేసే వ్యక్తులు, కుటుంబాలు దేశంలో ఉన్నాయి. ష్రాఫ్‌లు, సేట్‌లు, షాహుకార్లు, మహాజన్లు, చిట్టీ లేదా శెట్టీ పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు ఉండేవారు. వీరిలో ష్రాఫ్‌లు పెద్దఎత్తున వ్యాపార నిమిత్తం కూడా రుణం ఇస్తారు. వీరిలో మూడు రకాలు మొదటిది కేవలం వడ్డీ వ్యాపారం(బ్యాంకింగ్) చేసేవారు. రెండోరకం వడ్డీ వ్యాపారం ప్రధానం చేస్తూ ఇతర వ్యాపారం కూడా చేస్తారు. మూడోరకం వ్యాపారం ప్రధానంగా చేస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు.
వీరు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించరు. కొందరు వారి మిత్రులు, బంధువుల దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్లు స్వీకరిస్తారు. తమ సొంత నిధులతోనే ప్రధానంగా వడ్డీ వ్యాపారం చేస్తారు. అందుకే వీరిని ఆధునిక బ్యాంకింగ్ నిర్వచనం ప్రకారం బ్యాంకర్ అనలేము. వీరు బంగారం, నగలు, భూమి, ప్రామిసరీ నోట్లు, హుండీలను పూచీలుగా పెట్టుకొని వడ్డీకి రుణం ఇస్తారు. ఆధునిక వాణిజ్య బిల్లులకు పురాతన రూపమే హుండీలు.
1954లో ప్రైవేటు రంగానికి పరపతి సౌకర్యం కోసం ష్రాఫ్ కమిటీ ప్రకారం భారతదేశంలోని పరపతి సౌకర్యంలో 75 నుంచి 90 శాతం వరకు ఈ వడ్డీ వ్యాపారులు ఇచ్చిన రుణాలే ఉన్నాయి. 1931లో కేంద్రీయ బ్యాంకింగ్ విచారణ కమిటీ ఈ అసంఘటితరంగ వడ్డీ వ్యాపారాన్ని సంఘటితరంగ బ్యాంకింగ్ వ్యవస్థతో మిళితం చేయాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ భారతీయ రిజర్వుబ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు దానితో ఈ వడ్డీ వ్యాపార సంస్థలను అనుసంధానం చేయాలని సూచించింది.
1930 మధ్యకాలంలో భారతీయ రిజర్వుబ్యాంకు హుండీ వ్యాపారాన్ని ఆధునిక అకౌంట్ పద్ధతిలోకి మార్చాలని సూచించింది. హుండీలను ఆధునిక వాణిజ్య బిల్లులుగా మారిస్తే వాటిని రీ డిస్కౌంట్ చేసే సదుపాయం కల్పిస్తామని వడ్డీ వ్యాపారులకు హామీ ఇచ్చింది. 1954లో ష్రాఫ్ కమిటీ, 1972లో బాంబే ష్రాఫ్ అసోసియేషన్, బ్యాంకింగ్ కమిటీలు హుండీలను వాణిజ్య బ్యాంకుల ద్వారా రిజర్వుబ్యాంక్ రీ డిస్కౌంట్ చేయాలని సూచించాయి. బ్యాంకింగ్ కమిషన్ అభిప్రాయం ప్రకారం ఈ దేశీయ బ్యాంకర్లు(వడ్డీ వ్యాపారులు) తమ వ్యాపార పరిమాణం పెంచుతూ, వివిధ రంగాలకు తమ వ్యాపారాన్ని విస్తృతం చేయాలి. అయితే వారు తమ అకౌంట్ల విధానాన్ని ఆధునీకరించుకోవాలి. ఈరకంగా అవి బ్యాంకేతర ద్రవ్య సంస్థలు(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) పనిచేయాలి. ఆరకంగా సంఘటిత ద్రవ్య వ్యవస్థలో అవి భాగం కావాలి.
దేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ ఆరంభం: 1770లో కలకత్తాలో ఇంగ్లీష్ ఏజెన్సీ హిందుస్థాన్ బ్యాంక్ అనే మొట్టమొదటి వాణిజ్యబ్యాంకు స్థాపితమైంది. అయితే 1832లోనే దీనిని మూసివేశారు. 1806లో కలకత్తాలో నెలకొల్పిన మొట్టమొదటి ప్రెసిడెన్సి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌ను దేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు ఆరంభంగా భావిస్తారు. 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రా్‌సలు నెలకొన్నాయి. ఈస్ట్‌ఇండియా కంపెనీ కొంత వాటా మూలధనం సమకూర్చగా ప్రైవేటురంగ వాటా మూలధనంతోనే పై బ్యాంకులను స్థాపించారు. అయితే తదనంతరం వాటిని ప్రభుత్వ గుత్తాధిపత్య బ్యాంకులుగా మారారు. 1823 తరవాత వీటికి నోట్లను ముద్రించి విడుదల చేసే అధికారాన్ని కూడా ఇచ్చారు. ఈ మూడు బ్యాంకులను విలీనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేసి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు.
1. భారతీయులు నిర్వహించిన మొట్టమొదటిది ఔద్ కమర్షియల్ బ్యాంకును 1881లో స్థాపించారు. ఆ తరవాత రెండో ది పంజాబ్ నేషనల్ బ్యాంకును 1894లో నెలకొల్పారు. 1865లో అలాహబాద్ బ్యాంకు ఏర్పాటైంది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా 1906లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1913లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటయ్యాయి. 1935లో భారతీయ రిజర్వుబ్యాంకు స్థాపితమై 1949లో జాతీయం చేయడంతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం, విస్తృత ఆరోగ్యకర వాతావరణంలోకి అడుగుపెట్టింది.
భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం - కూర్పు: భారతదేశ సంఘటితరంగ బ్యాంకింగ్ వ్యవస్థను భారతీయ రిజర్వుబ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులుగా వర్గీకరించవచ్చు. లేదా సాధారణంగా షెడ్యూల్ బ్యాంకులు షెడ్యూల్‌లో లేని బ్యాంకులుగా వర్గీకరిస్తారు. 1934లో భారతీయ రిజర్వుబ్యాంకు చట్టంలోని రెండో షెడ్యూల్‌లో చేర్చిన కనీసం రూ.5 లక్షలు చెల్లించిన మూలధనం గల బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులు అంటారు. దేశీయ, విదేశీ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు అన్నీ షెడ్యూల్డ్ బ్యాంకులే. షెడ్యూల్డ్ బ్యాంకులను వాణిజ్య, సహకార బ్యాంకులుగా విభజిస్తారు. లాభ ఉద్దేశంతో నడిచేవి వాణిజ్య బ్యాంకులు కాగా సహకారం ప్రేరణగా నడిచేవి సహకార బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులను 1969 తరవాత ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటురంగ బ్యాంకులుగా వర్గీకరిస్తున్నారు. చిన్న, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపారస్తులకు రుణ సౌకర్యం, డిపాజిట్ సౌకర్యం కోసం 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడటం ప్రాంతీయ గ్రామీణ బ్యాం కుల లక్ష్యం. వాటి పని ప్రదేశం ప్రత్యేకమైనప్పటికీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకులే.
1950-51లో దేశంలో మొత్తం 430 వాణిజ్య బ్యాంకులు ఉండేవి. 1969లో 14 వాణిజ్య బ్యాంకులను, 1980లో 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అయితే రిజర్వుబ్యాంకు అనుసరించిన బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.
వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలు: వాణిజ్య బ్యాంకులు తమ ప్రాథమిక విధుల్లో భాగంగా వడ్డీలేని డిమాండ్ డిపాజిట్లు, వడ్డీ గల పొదుపు డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు స్వీకరించి క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ మొదలైన రుణాలను అందిస్తాయి. హుండీలను డిస్కౌంట్ చేసి రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి.
పరపతి సృష్టి: వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్ల ద్వారా పరపతి సృష్టి చేస్తాయి. డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తమ దగ్గర పెట్టుకొని మిగతా మొత్తాన్ని రుణంగా ఇస్తాయి. ఇలా ప్రతి బ్యాంకు చేయడం ద్వారా ప్రాథమిక డిపాజిట్ల విలువకు ఎన్నో రెట్ల ద్రవ్య సృష్టి జరుగుతుంది. దీనినే పరపతి సృష్టి అంటారు. ఈ పరపతి సృష్టి ఎంత పరిమాణం ఉండవచ్చు అనేది డిపాజిట్ గుణకంపై ఆధారపడుతుంది. డిపాజిట్ గుణకం నగదు నిల్వల నిష్పత్తిపై ఆధారపడుతుంది. ఉదాహరణకు నగదు నిల్వల నిష్పత్తి అంటే డిపాజిట్లలో కేంద్రబ్యాంకు దగ్గర ఉంచే నిష్పత్తి శాతం 20 అనుకుందాం. ప్రాథమిక డిపాజిట్లు రూ.1,000 అనుకుందాం. అప్పుడు డిపాజిట్ గుణకం విలువ= 1/ఇఖఖ. ఇఖఖ అంటే నగదు నిల్వల నిష్పత్తి(క్యాష్ రిజర్వ్ రేషియో) ఇప్పుడు 1 1 100
= ్ఠ = 5
20 1 20
100
అంటే డిపాజిట్ గుణకం విలువ 5. ప్రాథమిక డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్ గుణకంతో హెచ్చిస్తే వచ్చేది పరపతి సృష్టి. అంటే రూ.1,000్ఠ 5=రూ.5,000. అంటే ప్రాథమికంగా రూ.1,000 డిపాజిట్ చేస్తే ఆ మొత్తం అయిదురెట్ల పరపతిని సృష్టించగలుగుతుంది. ఈవిధంగా వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి చేస్తాయి. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల తరపున అనేకరకాల ఏజెన్సీ సేవలు అందిస్తాయి.
భారతీయ రిజర్వుబ్యాంకు
భారతీయ రిజర్వుబ్యాంకు భారతదేశానికి కేంద్రబ్యాంకుగా వ్యవహరిస్తుంది. 1935లో ప్రైవేటురంగంలో దీనిని స్థాపించారు. 1949 జనవరి 1న జాతీయం చేశారు. భారతీయ రిజర్వుబ్యాంకు భారతదేశ కేంద్రబ్యాంకుగా కింది విధులు నిర్వహిస్తుంది.
1) ద్రవ్యాన్ని ముద్రించి చెలామణిలోకి తేవడం: రెండు రూపాయలు ఆపై విలువ కలిగిన అన్ని నోట్లను, నాణేలను కేంద్రబ్యాంకు ముద్రించి చెలామణిలోకి తెస్తుంది. ఇందుకు కొంతకాలంపాటు అనుపాత నిల్వవ పద్ధతిని అనుసరించింది. అంటే ఎంత విలువైన ద్రవ్యాన్ని ముద్రించాలంటే దానికి సమాన విలువ గల ద్రవ్యాన్ని తన దగ్గర పూచీగా ఉంచుకోవాలి. అయితే 1957 నుంచి అనుపాత నిల్వల పద్ధతికి స్వస్తి చెప్పి కనిష్ఠ నిల్వల పద్ధతిని అనుసరిస్తోంది. ఈ పద్ధతి ప్రకారం రూ.200 కోట్ల విలువైన బంగారం, విదేశీ మారకద్రవ్య రూపంలో తన దగ్గర నిల్వగా ఉంచుకోవాలి. అందులో రూ.115 కోట్ల విలువైన బంగారం లేదా బంగారు నాణేలు ఉండాలి. మిగతా రూ.85 కోట్ల విలువైన బంగారం, బంగారు నాణేలు లేదా విదేశీ మారక ద్రవ్యాన్ని తన దగ్గర పూచీగా ఉంచుకోవాలి. ఇంతమొత్తం పూచీగా ఉంచుకొని ఎంత పరిమాణంలోనైనా ద్రవ్యాన్ని రిజర్వుబ్యాంకు ముద్రించవచ్చు. అంటే ద్రవ్యం చెలామణిపైన గరిష్ఠ పరిమితి ఏమీలేదు.
2) ప్రభుత్వానికి బ్యాంకరు: ప్రభుత్వ బ్యాంకుగా పనిచేస్తూ ద్రవ్య విధానంలో, రుణాల సేకరణలో, విదేశీ చెల్లింపుల్లో ప్రభుత్వానికి సలహాదారుగా, ఏజెంటుగా పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున వచ్చే రాబడులు, ఖర్చులు రిజర్వుబ్యాంకు ద్వారా జరుగుతాయి.
3) బ్యాంకులకు బ్యాంకు: బ్యాంకులకు బ్యాంకుగా కేంద్రబ్యాంకు వ్యవహరిస్తుంది. వాటి నియమ నిబంధనలు రూపొందించడం, వాటిని అమలుపరచడం, నిబంధనలు పాటించని వాటిపై ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం, బ్యాంకులకు సహాయపడటం అవి కేంద్రబ్యాంకు దగ్గర ఉంచే నగదు నిల్వల నిష్పత్తిని, ఇతర నిష్పత్తులను నిర్ణయించడం, హుండీలను రీ డిస్కౌంట్ చేయడం, నిధులను బదిలీ చేయడం, బ్యాంకులకు లైసెన్సులివ్వడం మొదలైనవన్నీ కేంద్రబ్యాంకు చేస్తుంది.
4) బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్: కొన్ని ముఖ్యమైన కేంద్రాల్లో క్లియరింగ్ శాఖలను నెలకొల్పి వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను రిజర్వుబ్యాంకు సమన్వయం చేస్తుంది. ఉదాహరణకు వాణిజ్య బ్యాంకులు ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేసిన చెక్కులను క్లియరింగ్ శాఖ క్లియర్ చేస్తుంది. క్లియరింగ్ శాఖ లేని ప్రదేశాల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ పని చేస్తుంది.
5) అంతర్జాతీయ ద్రవ్య నిధుల పరిరక్షణ: అంతర్జాతీయంగా ఆమోదం పొందిన వివిధ దేశాల కరెన్సీని అంతర్జాతీయ ద్రవ్యం అంటారు. విదేశాల నుంచి వస్తుసేవలను దిగుమతి చేసుకోవడానికి ఒక దేశానికి అంతర్జాతీయ ద్రవ్యం అవసరమవుతుంది. విదేశీ మారకద్రవ్యం తగినంతగా దేశం దగ్గర ఉండేవిధంగా రిజర్వుబ్యాంకు చూస్తుంది. రూపాయితో విదేశీ ద్రవ్య మారకం విలువను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తగిన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే విదేశీ మారకద్రవ్యాన్ని అమ్మడం, కొనుగోలు చేయడం ద్వారా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది. ఎగుమతులు, దిగుమతులు, విదేశీ పెట్టుబడులు, విదేశాల్లో పెట్టుబడులు మొదలైనవన్నీ రిజర్వుబ్యాంకు పర్యవేక్షణలోనే జరుగుతాయి.
6) పరపతి నియంత్రణ: పరపతి నియంత్రణ ద్వారా ద్రవ్య సరఫరాను రిజర్వుబ్యాంకు నియంత్రిస్తుంది. అందుకు పరిణామాత్మక, గుణాత్మక సాధనాలను రిజర్వుబ్యాంకు వాడుతుంది. ఆర్థికవ్యవస్థ అవసరాల దృష్ట్యా ద్రవ్య సరఫరాను పెంచడం, తగ్గించడం చేస్తుంది. ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్య సరఫరాను తగ్గించి వస్తువుల డిమాండ్‌ను తగ్గించి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. ఆర్థికమాంద్యం ఏర్పడినప్పుడు ద్రవ్య సరఫరాను పెంచి వస్తు, సేవల డిమాండ్‌ను పెంచాలనుకుంటుంది. ద్రవ్య సరఫరాను తగ్గించాలనుకున్నప్పుడు బ్యాంకు రేటును, రెపోరేటును, చట్టబద్ధ ద్రవ్యరాశిని, రివర్స్ రెపోరేటును పెంచుతుంది. ఫలితంగా వడ్డీరేట్లు పెరిగి, రుణాత్మక నిధులు తగ్గి ద్రవ్య సరఫరా తగ్గుతుంది. అలాగే బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ పత్రాలను అమ్ముతుంది. ఫలితంగా కూడా వ్యక్తుల దగ్గర గల నగదు తగ్గి ద్రవ్య సరఫరా తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని రిజర్వుబ్యాంకు భావిస్తుంది. ద్రవ్య సరఫరాను పెంచాలనుకున్నప్పుడు పై దానికి భిన్నంగా చేస్తుంది.
ఇలా ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించే సాధనాలను పరిమాణాత్మక సాధనాలు అంటారు. ద్రవ్య పరిమాణాన్నే కాకుండా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల పరిస్థితి ఆధారంగా పరపతి నియంత్రణ చేసే సాధనాలను రుణాత్మక సాధనాలు అంటారు. ఇందులో ద్రవ్య సరఫరా పరిమాణం మారదు. కానీ ద్రవ్య సరఫరా కూర్పు మారుతుంది. వివిధ రంగాలకు పరపతి రేషనింగ్ చేయడం, పూచీల ఆధారంగా ఇచ్చే రుణాల మార్జిన్ల నిర్ణయం, నిబంధనల పాటింపునకు చేసే నైతికోద్భందం, నిబంధనలు అతిక్రమించిన పక్షంలో తీసుకునే ప్రత్యక్ష చర్య మొదలైనవన్నీ గుణాత్మక సాధనాలుగా పరిగణిస్తారు.
డా.ఎం.ఏ.మాలిక్,
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్‌పల్లి, హైదరాబాద్.