Groups special: సామాజిక అంతరాలను పూడ్చే దిశగా జాతీయ విద్యావిధానం-2020
ABN , First Publish Date - 2023-01-30T16:10:14+05:30 IST
తెలిసిన విషయమే అయినప్పటికీ పోటీ పరీక్షల్లో ప్రశ్నించే తీరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జాతీయ విద్యావిధానం
తెలిసిన విషయమే అయినప్పటికీ పోటీ పరీక్షల్లో ప్రశ్నించే తీరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జాతీయ విద్యావిధానం (National Education Policy)-2020 (ఎన్‌ఈపీ-2020)ని తీసుకుంటే అది జాతీయ అభివృద్ధి సాధనలో, సామాజిక అంతరాలను పూడ్చేందుకు ఎలా దోహదపడుతుందనే ప్రాతిపదికన విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయుల (teachers)కు తగు రీతిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిభ సామర్థ్యాలు గల పిల్లలను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.
సార్జంట్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సలహా సంఘం సాంకేతిక, వాణిజ్య తదితర విద్యా కోర్సుల ఏర్పాటు, ఉపాధ్యాయ శిక్షణ వంటి సిఫార్సులను చేసింది.
పాఠశాల విద్య పునర్మిర్మాణం
ఏ దేశంలోనైనా సంపూర్ణ మానవ సామర్థ్యానికి, జాతీయాభివృద్ధిని సాధించేందుకు మౌలికమైంది విద్య. దేశ సామర్థ్యాలను, వనరులను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సార్వత్రిక విద్య ఉత్తమమైన మార్గం.
మానవుని సర్వతోముఖాభివృద్ధికి విద్య మొదటి సోపానం. విద్య ద్వారా జీవితానికి సంబంధించిన ఉన్నత విలువలతో కూడిన మూర్తిమత్వం పెంపొందుతుంది. భారత రాజ్యాంగం అందరికీ విద్యను తరతమ భేదం లేకుండా అందించాలని పేర్కొంది. భారతదేశం (India)లో ప్రాచీనకాలం నుంచి ఈనాటి వరకు విద్యపరంగా ఎన్నో సంస్కరణలు చేపట్టారు.
ప్రాచీనకాలంలో ఆశ్రమాల్లో గురువులు వేదాలతోపాటు అనేక అంశాలను ఆధ్యాత్మిక దృష్టితో బోధించేవారు. విద్య విషయకేంద్రంగా కొంతమందికి మాత్రమే పరిమితమై ఉండేది. తరవాతి కాలంలో నలంద, తక్షశిల, అమరావతి (Amaravati) వంటి విద్యా కేంద్రాలు ఏర్పడ్డాయి. క్రమంగా కాలంతోపాటు విద్యాబోధన అనేది అభివృద్ధి మార్గంలో పయనించింది.
ఆంగ్లేయుల పాలనలో 1813లో ఏర్పాటు చేసిన విద్యాచట్టం భారతదేశంలో విద్యాభివృద్ధికి బీజం వేసింది. 1836లో లార్డ్ మెకాలే ఆంగ్లాన్ని బోధన భాషగా ప్రవేశపెట్టడం, మిషనరీ పాఠశాలల ఏ ర్పాటు వంటివి బ్రిటిష్ కంపెనీకి అవసరమైన ఉద్యోగులను తయారుచేయడానికి ఉపయోగపడ్డాయి.
భారతీయుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో విద్యాభివృద్ధి కోసం 1844లో ఏర్పాటు చేసిన ‘చార్లెస్ ఉడ్స్ కమిషన్’ సిఫార్సుల మేరకు మద్రాస్, కలకత్తా, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారు.
లార్డ్ రిప్పన్ కాలంలో భారతదేశంలోని విద్యావ్యవస్థను ఆధునీకరించడానికి 1882లో ఏర్పాటుచేసిన ‘హంటర్ కమిషన్’ సిఫార్సుల ప్రకారం దేశ అవసరాల మేరకు ప్రాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ, బాధ్యతలను బ్రిటిష్ ప్రభుత్వమే చూసింది.
భారతదేశ విద్యాభివృద్ధికి 1944లో సార్జంట్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సలహా సంఘం సాంకేతిక, వాణిజ్య తదితర విద్యా కోర్సుల ఏర్పాటు, ఉపాధ్యాయ శిక్షణ, గ్రంథాలయాల ఏర్పాటు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలను కలుగజేయడం వంటి సిఫార్సులను చేసింది.
భారత స్వాతంత్ర్యానంతరం మొదటి జాతీయ నూతన విద్యావిధానం 1968 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచితవిద్య, పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రం, ప్రాంతీయ, ఆర్థిక, సామాజిక, లింగ అసమానతలు లేకుండా అందరికీ విద్యావకాశాలు కల్పించాలనే లక్ష్యాలను నిర్దేశించారు.
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు తేవాలనే లక్ష్యంతో 1986లో జాతీయ నూతన విద్యావిధానాన్ని ఏర్పాటుచేశారు. దీని ప్రకారం జాతి, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరికీ గుణాత్మకమైన విద్యను అందచేయాలి. సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి దూరవిద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యాలను సంకల్పించారు.
అందరికీ సమ్మిళిత, సమాన, నాణ్యమైన విద్య అందేలా చూస్తూ జీవితకాల అభ్యాసన అవకాశాలను పెంపొందించాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని నాలుగో దానికి అనుగుణంగా సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను సమానంగా అందించే లక్ష్యంతో, ఒక అద్వితీయమైన విద్యావ్యవస్థ ఉండాలనే సంకల్పంతో జాతీయ విద్యావిధానం 2020ని రూపొందించారు.
ఆలోచనపరంగానే కాకుండా ఆత్మస్థయిర్యం, మేథో, కార్యాచరణపరంగా తాము భారతీయులమనే గర్వాన్ని, విశ్వాసాన్ని అభ్యాసకుల్లో పాదుకొల్పాలి. తద్వారా వారు నిజమైన ప్రపంచ పౌరులుగా వ్యవహరించేలా నైపుణ్యాలను, విలువలను పెంపొందించి సుస్థిరాభివృద్ధిపై శ్రద్ధాసక్తులను ప్రోత్సహించడం ఈ విద్యావిధాన ముఖ్యోద్దేశం.
నూతన విద్యావిధానం కింద విద్యావ్యవస్థలోకి ప్రవేశించిన బాలుడు/ బాలిక కొత్త విధానంలోని అన్ని ప్రక్రియల్లో ఉత్తీర్ణత సాధించి, కార్యాచరణ పరిపూర్తిగా నిర్వర్తించేందుకు కింది లక్ష్యాలను ఉంచింది.
విద్యా సార్వత్రీకరణ: 2030 నాటికి పాఠశాల విద్యను - ప్రీ స్కూల్ నుంచి మాధ్యమిక స్థాయి వరకు 100 శాతం స్థూల నమోదు నిష్పత్తిని సాధించాలి. 2035 నాటికి ఉన్నతవిద్యను సార్వత్రీకరించాలి. తద్వారా అందరికీ విద్యను అందుబాటులోకి ఉంచడమేగాక బడిమానేసిన పిల్లలందరినీ తిరిగి బడికి రప్పించే చర్యలు తీసుకోవాలని ఈ కొత్త విద్యావిధానం సూచిస్తోంది.
పాఠశాల విద్య పునర్మిర్మాణం: ప్రస్తుతం ఉన్న 10+2 బోధన శాస్త్ర నిర్మాణాన్ని 3-18 సంవత్సరాల వయసు విద్యార్థుల కోసం 5+3+3+4 పద్ధతిలో పునర్వ్యవస్థీకరిస్తారు. అలా ఒక కొత్త బోధన శాస్త్ర, పాఠ్య ప్రణాళికను ప్రవేశపెడతారు.
ప్రారంభ బాల్య సంరక్షణ విద్య(ఈసీసీఈ) - ఇది పునాది వయసు(3-18 సంవత్సరాల వయసు). ఈ దశలో పిల్లల్లో మెదడు ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందేందుకు తగిన సంరక్షణ, ఉద్తీపనలు అందింస్తారు. ఆ దశలో విద్యాలక్ష్యం పిల్లల శారీరక, మానసిక వికాసం, సమగ్ర ఎదుగుదల, సామాజిక భావోద్వేగపరమైన, నైతికపరమైన అభివృద్ధి, సాంస్కృతిక కళాత్మక ఎదుగుదల, కమ్యూనికేషన్స్‌లో ప్రారంభ భాష, అక్షరాస్యత మొదలైన వాటిని సాధ్యమైనంత సాధించడం.
ఈ దశ వరకు గల పిల్లల కోసం అభివృద్ధి పరచిన మార్గదర్శక సూత్రాలు తల్లిదండ్రులకు, ప్రారంభ బాల్య సంరక్షణకు, విద్యా సంస్థలకు ఒక మార్గదర్శిలా ఉపయోగపడతాయి. సిద్దపాటు దశ(8-11) సంవత్సరాలు. ఇది మూడో తరగతి నుంచి అయిదో తరగతి వరకు గల దశ.
ఈ దశలో నిర్మాణం బోధన శాస్త్రం, పాఠ్య ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. ఆ దశలో వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని అన్వేషించి ప్రోత్సహిస్తారు. ప్రతి సబ్జెక్టు అనుభవ పూర్వక పద్ధతిలో నేర్చుకోవడాన్ని నిర్దేశిస్తుంది.
మధ్యదశ(మిడిల్ స్టేజ్)-ఇది ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు(11-14 సంత్సరాలు) గల దశ. ఈ దశ బహు శాస్త్ర విషయాల అధ్యయనంతో కూడా ఉంటుంది. విషయ భావనను అభ్యాసిస్తారు. ఇది కౌమార దశ ప్రారంభదశ.
మాధ్యమిక దశ(14-18 సంవత్సరాల వయసు) - ఈ దశలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. ఈ దశ విషయ ప్రాధాన్య బోధన శాస్త్రం, పాఠ్య ప్రణాళికా విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ దశ జీవనోపాధి, ఉన్నతవిద్యకు సిద్దపాటుకు సంబంధించింది.
ఈ దశలు పిల్లల సమగ్ర ఎదుగుదల ప్రాతిపదికతో నేర్చుకొనే ప్రక్రియను సానుకూలం చేసేలా రూపొందించారు. పాఠ్యశాల విద్య పాఠ్య ప్రణాళిక, బోధన నిర్మాణం వివిధ దశల్లో వారి అభివృద్ధిపరమైన అవసరాలకు ప్రతిస్పందనగాను, అధ్యాపకుల అభిరుచులకు తగినట్లుగా చేయడానికి పునర్నిర్మిస్తారు. దీనిలో కింది అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.
అనుభవ పూర్వక అభ్యాసం, విమర్శనాత్మక ఆలోచన పెంపొందించే విధంగా బోధన విధానాన్ని రూపొందిస్తారు. స్థానిక విషయాలు, అభిరుచులతో కూడిన పాఠ్యపుస్తకాల తయారీ, విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడేవిధంగా మూల్యాంకనం చేస్తారు. ఉపాధ్యాయులకు తగురీతిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిభ సామర్థ్యాలు గల పిల్లలను ప్రో త్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.
విద్యను సమ్మిళితం చేయడం: సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి నోచుకోని వర్గాలపై, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రాంతాలపరంగా వ్యత్యాసాలను గమనంలోకి తీసుకొని వారికి అన్ని స్థాయుల్లో విద్య అందుబాటు, భాగస్వామ్యం, అభ్యసన ఫలితాల విషయంలో సామాజిక శ్రేణి అంతరాలను పూడ్చేవిధంగా తగిన వ్యూహాలను అమలుచేయాలని ఈ విధానం సూచిస్తోంది. తొలి బాల్య సంరక్షణ దశ నుంచి ఉన్నత విద్య వరకు అభ్యాసన ఫలితాలతో సమానత్వం సాధించడం ఈ నూతన విద్యావిధానం 2020 ముఖ్య లక్ష్యం.
-ఎం.బాలలత
సివిల్స్ మెంటార్