Tenth Class: టెన్త్ క్లాస్ నుంచీ కనుమరుగైన కీలక సబ్జెక్ట్‌లు!
ABN , First Publish Date - 2023-06-02T11:40:39+05:30 IST
డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల్లో నుంచి తొలగించి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) మళ్లీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి
పదో తరగతిలో ఆవర్తన పట్టిక తొలగింపు
సోషల్ నుంచి ప్రజాస్వామ్యం సహా మూడు పాఠాలు కూడా
ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, జూన్ 1 : డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల్లో నుంచి తొలగించి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) మళ్లీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి ఆవర్తన పట్టిక(పిరియాడికల్ టేబుల్)కు సంబంధించిన పాఠాలు, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు(పేజీ మొత్తం) తదితర పాఠాలను తొలగించినట్టు గురువారం ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులపై సిలబస్ ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సైన్స్ నుంచి పిరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, సస్టైనబుల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ పాఠాలను తొలగించారు. ఇక సోషల్ టెక్ట్స్ బుక్ నుంచి డెమొక్రటిక్ పాలిటిక్స్-1, పొలిటకల్ పార్టీస్ అండ్ చాలెంజెస్ టు డెమొక్రసీతోపాటు వివిధ పోరాటాలు, ఉద్యమాలకు సంబంధించిన పాఠాలను కూడా తొలగించారు.
అయితే, 11, 12 తరగతుల్లో ఈ సబ్జెక్టులను ఎంపిక చేసుకునే విద్యార్థులు పదో తరగతిలో ఈ పాఠాలను చదువుకునే అవకాశం మాత్రం బోర్డు కల్పించింది. కాగా, ఆవర్తన పట్టిక పాఠం తొలగింపుపై ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రసాయన శాస్త్ర విద్యాభ్యాసానికి పునాది వంటి ఆవర్తన పట్టికను సిలబస్ నుంచి తొలగించడం వల్ల విద్యార్థులు ముఖ్యమైన రసాయన సూత్రాలను అర్థం చేసుకునేందుకు అవస్థలు పడతారన్నారు. అంతేకాక, రసాయన శాస్త్రంపై విద్యార్థుల ఆసక్తి తగ్గే ముప్పు కూడా ఉందని అభిప్రాయపడ్డారు.