Gurukula Exam: గురుకుల ఎగ్జామ్‌కు వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN , First Publish Date - 2023-07-31T12:02:17+05:30 IST
గురుకుల పోస్టుల ప్రశ్నపత్రం ఓపెన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పరీక్ష ప్రారంభం కావడానికి 10 నిమిషాల ముందు మాత్రమే అభ్యర్థులకు అందిస్తారని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 15నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు.
రేపటి నుంచి గురుకుల పరీక్షలు
19 రోజులు.. రోజుకు 3 షిప్టుల్లో ఎగ్జామ్స్..
9,210 పోస్టులకు 2.63 లక్షల మంది దరఖాస్తు
ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కోత
ఆంధ్రజ్యోతితో గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): గురుకుల పోస్టుల ప్రశ్నపత్రం ఓపెన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పరీక్ష ప్రారంభం కావడానికి 10 నిమిషాల ముందు మాత్రమే అభ్యర్థులకు అందిస్తారని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 15నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రంలో ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కోత ఉంటుందని తెలిపారు. పరీక్షలు వాయిదా పడుతాయన్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులను కోరారు. వరదల కారణంగా ఖమ్మంలోని పెద్దతండా దగ్గర ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ సెంటర్లో ఆగస్టు 1, 3, 4 తేదీల్లో జరిగే పరీక్షలను అక్కడికి దగ్గర్లోనే ఉన్న స్వర్ణభారతి, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కాలేజీలకు మార్చామని ఆయన తెలిపారు.
ఈ సెంటర్లకు వెళ్లేందుకు ప్రియదర్శిని కాలేజీ నుంచి బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. అయితే ఈ రెండు సెంటర్లు కేవలం 1, 3, 4 తేదీల వరకు మాత్రమేనని మళ్లీ 5వ తేదీ నుంచి జరిగే పరీక్షలను యథావిధిగా ప్రియదర్శిని కాలేజీలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెంటర్ మార్పు విషయాన్ని అభ్యర్థులకు ఫోన్, మెయిల్ ద్వారా తెలియపర్చామని, హాల్‌టికెట్లు కూడా రీజనరేట్ చేశామని చెప్పారు. ఈ మేరకు ఆగస్టు 1-23వ తేదీవరకు నిర్వహించే గురుకుల పరీక్షల ఏర్పాట్లపై మల్లయ్య భట్టు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
బూట్లు కూడా వేసుకోవద్దు.. హాల్ టికెట్ దాచుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో 9,210 పోస్టులకు గాను 2,63,045 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో(సీబీటీ) నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 17 జిల్లాల్లో 106 చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు 19 రోజుల పాటు, రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 8:30-10:30 వరకు, మఽధ్యాహ్నం 12:30-2:30 వరకు, సాయంత్రం 4:30-6:30వరకు ఒక షిప్టు చొప్పున పరీక్షలుంటాయి. ఒక్కో పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. ‘‘ప్రతీ పరీక్షకు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు. ప్రతీ షిఫ్టులో నిర్దిష్ట సమయానికి ప్రశ్నపత్రం ఓపెన్ అవుతుంది. 120 నిమిషాల వ్యవధి పూర్తవగానే సెషన్ పూర్తవుతుంది. అభ్యర్థులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పరీక్ష సమయంలో కంప్యూటర్ మొరాయిస్తే పరీక్ష ఆగిపోయిన సమయం నుంచే మళ్లీ మొదలవుతుంది.
అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును కూడా వెంట తీసుకురావాలి. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా లేకపోతే మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకంతో అండర్‌టేకింగ్ ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇన్విజిలేటర్‌కు అందించాలి. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల హాజరును నమోదు చేస్తారు. హాల్ టికెట్‌ను స్కాన్ చేస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ర్టానిక్ పరికరాలు, వాచ్‌లు, కాగితాలు, ఇతర వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థులు బూట్లు కూడా వేసుకోవద్దు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటకు పంపరు’’ అని మల్లయ్య తెలిపారు. పరీక్షలు పూర్తయిన తరువాత కూడా అభ్యర్ధులు హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ వరకు భద్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో హాల్‌టికెట్‌ను కూడా పరిశీలిస్తారని అభ్యర్థులు ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరీక్షకు హాజరవ్వాలని కోరారు.
3 పరీక్షలకు 3 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలా?
గురుకుల సెంటర్లపై టీపీసీసీ ధ్వజం
‘‘యూపీఎస్సీ పరీక్షా విధానంలో కూడా అభ్యర్థి కోరిన జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో గురుకుల పోస్టుల భర్తీకి సంబంఽధించి మూడు పరీక్షల కోసం అభ్యర్థులు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగాలా’’ అని టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ ప్రశ్నించారు. స్థానిక పరీక్షా కేంద్రాలను ఆప్షన్‌గా పెట్టుకుంటే.. ఒక్కో పరీక్షకు ఒక్కో జిల్లాలో కేంద్రాన్ని ఎలా కేటాయిస్తారని నిలదీశారు. ఇదే విషయమై పీవైఎల్ నాయకులు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. గురుకుల అభ్యర్థులకు ఒకే జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయించా లన్నారు. సెంటర్ల కేటాయింపును చూస్తుంటే నిరుద్యోగుల జీవితా లతో ఆటలాడుకుంటున్నట్లుందని పీవైఎల్ నేత ప్రదీప్ అన్నారు.