High Court Medical fees: పీజీ మెడికల్‌ అభ్యర్థులకు ఉపశమనం

ABN , First Publish Date - 2023-08-22T11:08:09+05:30 IST

పీజీ మెడికల్‌ కోర్సులకు సంబంధించి జీవో నంబరు 107లో పేర్కొన్న ఫీజుల్లో ప్రస్త్తుతానికి ఏ-క్యాటగిరీ సీట్లకు 60 శాతం, బీ-క్యాటగిరీ సీట్లకు 70 శాతం ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు రిట్‌ పిటిషన్‌లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది.

High Court Medical fees: పీజీ మెడికల్‌ అభ్యర్థులకు ఉపశమనం

పీజీ మెడికల్‌ ఫీజులు భరించలేం

హైకోర్టులో పీజీ మెడికల్‌ అభ్యర్థుల పిటిషన్‌

మధ్యంతర ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్‌ కోర్సులకు సంబంధించి జీవో నంబరు 107లో పేర్కొన్న ఫీజుల్లో ప్రస్త్తుతానికి ఏ-క్యాటగిరీ సీట్లకు 60 శాతం, బీ-క్యాటగిరీ సీట్లకు 70 శాతం ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు రిట్‌ పిటిషన్‌లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. బ్లాక్‌ పీరియడ్‌ 2023-26కుగాను పీజీ మెడికల్‌ సీట్లకు నిర్ణయించిన ఫీజులను భరించలేమని, ఫీజులను భారీగా పెంచారని పేర్కొంటూ 222 మంది పీజీ మెడికల్‌ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీహెచ్‌ సుమలత ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సామ సందీప్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను నిర్ణయిస్తూ జూలై 28న జీవో 107 జారీ చేసిందని తెలిపారు. 2020లో జారీచేసిన జీవోను సైతం హైకోర్టులో సవాల్‌ చేశారని..అందులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. ‘కన్సార్టియం ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌’ కేసులో ఫీజులను నిర్ణయించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. అకడమిక్‌ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే ఫీ స్ట్రక్చర్‌ నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉంటుందని,. అలాంటి నోటిఫికేషన్‌ జారీచేయకపోగా జూలైలో జీవో జారీ చేశారని, కన్వీనర్‌ కోటాలో 179 శాతం, మేనేజ్‌మెంట్‌ కోటాలో 296 శాతం ఫీజు పెంచారని పేర్కొన్నారు. ప్రభుత్వం, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, టీఏఎ్‌ఫఆర్‌సీ, ప్రైవేటు కాలేజీల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. ప్రస్తుత జీవో టీఏఎ్‌ఫఆర్‌సీ సిఫార్సులకనుగుణంగా నిబంధనల ప్రకారం జారీచేసినట్లు తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మెడికల్‌ సర్వీసె్‌సకు సంబంధించిన కోర్సుల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని భావించే విద్యార్థులు కోర్టుకు రావడంలో తప్పు లేదని, సమీక్షించే అధికారం ఆర్టికల్‌ 226 ప్రకారం ఈ కోర్టుకు ఉందని తెలిపింది. తాజా జీవో 107లో గతంలో స్టే విధించిన జీవో 20ని ప్రస్తావిస్తూ జారీచేశారని..ఈ నేపథ్యంలో విద్యార్థులకు, మెడికల్‌ కాలేజీలకు ఇబ్బంది లేకుండా మధ్యంతర ఉత్తర్వులు అవసరమని పేర్కొంది.

Updated Date - 2023-08-22T11:08:09+05:30 IST