Education: ఇంటర్ విద్యార్థులకు సర్కారు ఝలక్! పుస్తకాలపై ఆదేశాలు ఇలా..!
ABN , First Publish Date - 2023-06-16T12:39:03+05:30 IST
ఈ ఏడాదైనా ప్రభుత్వం నిధులు కేటాయించి ఉచితంగా ఇస్తుందని ఆశించారు. కానీ ఉన్నత విద్యామండలికి చెందిన రూ.200 కోట్ల నిధులను నాడు- నేడు పథకానికి దారిమళ్లించిన ప్రభుత్వం
పుస్తకాలు మీరే కొనుక్కోండి!
ఇంటర్ విద్యార్థులకు సర్కారు ఝలక్
ఉచితంగా ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు (Inter students) ఉచిత పుస్తకాలు లేవని ఇంటర్ విద్యామండలి స్పష్టంచేసింది. ముద్రించిన పుస్తకాలను విద్యార్థులే కొనుక్కోవాలని సూచించింది. ఈ మేరకు విద్యార్థులకు తెలపాలని జిల్లాల ఒకేషనల్ విద్య అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులకు విద్యామండలి ఆదేశాలు జారీచేసింది. ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను పునఃముద్రించారని, మిగిలిన పుస్తకాలు ముద్రిస్తున్నారని, విడతల వారీగా వాటిని మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతారని వివరించింది. కానీ, పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో చదివే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నించిన ఇంటర్ విద్యాశాఖ ‘పుస్తక ప్రసాదం’ పథకం కింద ఇవ్వాలంటూ టీటీడీని (TTD) కోరింది. టీటీడీ స్పందించకపోవడంతో విద్యార్థులే పుస్తకాలు కొనుక్కున్నారు. ఈ ఏడాదైనా ప్రభుత్వం నిధులు కేటాయించి ఉచితంగా ఇస్తుందని ఆశించారు. కానీ ఉన్నత విద్యామండలికి చెందిన రూ.200 కోట్ల నిధులను నాడు- నేడు పథకానికి దారిమళ్లించిన ప్రభుత్వం మండలిని ఖాతాలను ఖాళీ చేసింది. దీంతో దాదాపు ఇరవై ఏళ్లు ఇంటర్ విద్యామండలిలో జమ అయిన పిల్లల ఫీజులన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. చివరికి పుస్తకాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇంటర్ బోర్డుకు నిధులు ఇవ్వకపోగా ఇలా పిల్లల ఫీజులను కూడా లాగేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.