Mid Day Meal Program: విద్యార్థులకు చేప కూరతో భోజనం! మెనూలో చేర్చనున్న..!

ABN , First Publish Date - 2023-06-20T12:33:13+05:30 IST

కొర్రమీను.. తెలంగాణలో ఎంతో క్రేజ్‌ ఉన్న చేప. దానికి పులుసు పట్టించి, మాగపెట్టి తింటే.. ఆ రుచే వేరు. పరక చేపలకు గాలెం వేసే కాలంలో చిన్నారులకు చేపల వేట నిత్యజీవనంలో భాగంగా ఉండేది. కానీ

Mid Day Meal Program: విద్యార్థులకు చేప కూరతో భోజనం! మెనూలో చేర్చనున్న..!

  • కేసీఆర్‌ పాఠశాల నుంచే శ్రీకారం

  • చేపలు తింటే కలిగే లాభాలపై నేటి నుంచి సదస్సులు

దుబ్బాక, జూన్‌ 19: కొర్రమీను.. తెలంగాణలో ఎంతో క్రేజ్‌ ఉన్న చేప. దానికి పులుసు పట్టించి, మాగపెట్టి తింటే.. ఆ రుచే వేరు. పరక చేపలకు గాలెం వేసే కాలంలో చిన్నారులకు చేపల వేట నిత్యజీవనంలో భాగంగా ఉండేది. కానీ, ప్రస్తుతం పిల్లలకు చేపలు తినాలంటేనే ముల్లు గుచ్చుకుంటుందనే భయం. దీంతో వారికి చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు సదస్సుల నిర్వహణకు మత్స్యశాఖ శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ ఈత కొట్టి, చిన్నతనంలో చేపలకు గాలం వేసిన చోటు.. విద్యాబుద్ధులు నేర్చిన దుబ్బాక ‘కేసీఆర్‌ బడి’ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మత్స్యశాఖ మంగళవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ పిట్టల రవీందర్‌ దుబ్బాక నుంచే ఈ సదస్సును ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో చేపల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలును విద్యార్థులకు వివరించనున్నారు. చేపల్లోని పక్క బొక్కలు, ముల్లును ఎలా తొలగించి తినాలనేదానిపై కూడా వారికి తెలియజేయనున్నారు.

మధ్యాహ్న భోజన మెనూలోనూ పెట్టే యోచన

రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యా హ్న భోజనంలో ఒక్కరోజు చేపల కూరను అందించాలనే ప్రతిపాదనకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడంతో వాటిని వినియోగించడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదించే ముందు, విద్యార్థులకు చేపలపై అవగాహన కల్పించేందుకు మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - 2023-06-20T12:33:13+05:30 IST