TSPSC Paper leak: ఆ ఒక్క మండలంలోనే అంతమంది ఎలా క్వాలిఫై అయ్యారు..!?
ABN , First Publish Date - 2023-04-05T11:08:51+05:30 IST
టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నుంచి 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ కేటీఆర్ పీఏ (KTR PA) స్వగ్రామమైన పోతారం కూడా ఈ మండలంలోనే ఉంది.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ.. మల్యాలలో సిట్ విచారణ
వంద మందికి 100కు పైగా మార్కులు!
అభ్యర్థులకు లీకేజీతో సంబంధాలపై ఆరా
మొదటి రోజు 30 మందికి పైగా విచారణ
ఏఈ పేపర్ లీకేజీలో సిట్ కస్టడీకి ముగ్గురు
40 మంది మెయిన్స్‌కి ఎంపికయ్యారంటున్న అధికారులు
మాల్యాల మండల అభ్యర్థులను ప్రశ్నిస్తున్న సిట్
మొదటి రోజు 30 మందికి పైగా విచారణ
ఏఈ ప్రశ్నపత్రం లీకేజీలో.. సిట్ కస్టడీకి ముగ్గురు
హైదరాబాద్ సిటీ/సైదాబాద్/మాల్యాల, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నుంచి 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ కేటీఆర్ పీఏ (KTR PA) స్వగ్రామమైన పోతారం కూడా ఈ మండలంలోనే ఉంది. పోతారానికి చెందిన వంద మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే. ఇతర విపక్ష పార్టీలు కూడా మాల్యాల మండలానికి చెందిన వేర్వేరు గ్రామాల అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని వెల్లడించాయి. దీంతో.. ఈ కేసులో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మల్యాలపై దృష్టి సారించింది. మండలం మొత్తంలో 300 మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ రాయగా.. 40 మంది మాత్రమే మెయిన్స్‌కు ఎంపికయ్యారని చెబుతున్న సిట్.. మంగళవారం నుంచి వారి విచారణను ప్రారంభించింది.
ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు దేవ సురేశ్, తిరుపతి నేతృత్వంలో ఐదు బృందాలుగా ఏర్పడ్డ సిట్.. వేర్వేరు గ్రామాల్లో అభ్యర్థులకు శల్యపరీక్షలు నిర్వహిస్తోంది. అంటే.. అత్యంత కఠినంగా వచ్చిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో వారు సాధించిన మార్కులెన్ని? వచ్చిన మార్కులకు అనుగుణంగా అభ్యర్థుల్లో విషయ పరిజ్ఞానం ఉందా? పదోతరగతి, ఇంటర్, డిగ్రీల్లో వారు సాధించిన మార్కులెన్ని? అభ్యర్థుల కుటుంబ నేపథ్యం, రాజకీయ పలుకుబడి ఏమిటి? వారు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు? సచివాలయ అధికారులతో సంబంధాలున్నాయనా? అనే అంశాలపై విచారణ జరుపుతోంది. మంగళవారం తొలిరోజు 30 మందికిపైగా అభ్యర్థులను విచారించినట్లు సిట్ బృందాలు చెబుతున్నాయి. వీరిలో అనుమానితుల పేర్లతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. సిట్ ఈ నెల 11లోగా మాల్యాల మండలంలో విచారణను పూర్తిచేసి, కోర్టుకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది.
సిట్ కస్టడీకి ముగ్గురు..
ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్, రాజేంద్రకుమార్, తిరుపతయ్యలను నాంపల్లి న్యాయస్థానం అనుమతితో సిట్ అధికారులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. రేణుక భర్త ఢాక్యానాయక్, తమ్ముడు రాజేశ్వర్ నాయక్ ద్వారా ఏఈ ప్రశ్నపత్రాన్ని తీసున్న ఈ ముగ్గురూ.. ఇంకా ఎవరెవరికి అమ్మారు? అనే కోణంలో సిట్ వీరిని విచారించనుంది.