Jagananna Vidya Kanuka: కానుకైతే ఇచ్చారు గానీ.. ఇవేం ఇబ్బందులు!
ABN , First Publish Date - 2023-06-19T12:34:39+05:30 IST
ప్రభుత్వం ఆర్భాటంగా ఇస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ నాణ్యతలో ఉన్న డొల్లతనం పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకుండానే బయటపడుతోంది. ఈ జగనన్న కానుకతో విద్యార్థులు ఒక రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మరో రకమైన తలనొప్పులు
షూ సైజులు సరిపోక ఇబ్బందులు
ఇచ్చింది మూడు జతల యూనిఫాం క్లాత్
రెండు జతలకే వస్తుందంటున్న టైలర్
కాస్త పుస్తకాలు ఎక్కువైతే చినిగిపోతున్న బ్యాగ్
స్కూల్ షూ సరిపోదు.. కొంతమందికి పొడవైపోతుండగా, మరికొంతమందికి ఇరుకైపోతోంది. ఇంకొంతమందికి పాదం కంటే వెడల్పుగా ఉంటోంది.
పుస్తకాలు రెండు, మూడు ఎక్కువ పెడితే చాలు బ్యాగ్ పైభాగం చిరిగిపోయి పనికిరాకుండా పోతోంది.
ఇక మూడు జతల కోసం ఇస్తున్న యూనిఫాం క్లాత్ రెండు జతలకు సరిపోవడమే గగనమైపోతోంది.
..జగనన్న విద్యా కానుకలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులివి.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ): ప్రభుత్వం ఆర్భాటంగా ఇస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ నాణ్యతలో ఉన్న డొల్లతనం పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకుండానే బయటపడుతోంది. ఈ జగనన్న కానుకతో విద్యార్థులు ఒక రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మరో రకమైన తలనొప్పులు వస్తున్నాయి. నోరు విప్పితే ఎలాంటి ముప్పు వస్తుందోనని ప్రధానోపాధ్యాయులు నిశ్శబ్దంగా వారి పని వారు చేసుకుంటున్నారు. రెండు జిల్లాల్లో 300 హైస్కూల్స్, 2 వేల ప్రైమరీ, మరో 2 వేల ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
కొలతలు తప్పాయ్..
జగనన్న విద్యాకానుక (Jagananna Vidya Kanuka)లో విద్యార్థులకు షూ ఇవ్వాలని ప్రభుత్వం (YCP Government) నిర్ణయించింది. 2023-24 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల కాళ్లకు షూలు ఉండాలని భావించింది. ఇందుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థుల షూ కొలతలు తీసుకున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తీసుకున్న కొలతల ప్రకారమే షూ వస్తాయని భావించారు. కానీ, ఇప్పుడు కొలతల్లో తేడాలొచ్చాయి. విద్యార్థుల పాదాలకు, ఇచ్చిన షూ కొలతలకు ఎక్కడా పొంతన లేదు. కొంతమందికి షూ సైజు చిన్నదైపోయింది. మరికొంతమందికి పెద్దదైపోయింది. కొలతలు సరిపోయినా ఇంకొంతమందికి షూ వెడల్పు అయిపోయింది. ఈ తేడా ఎక్కడ జరిగిందో ప్రధానోపాధ్యాయులు చెప్పలేకపోతున్నారు. తాము విద్యార్థుల నుంచి తీసుకున్న కొలతలే పంపామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఈ షూలను తయారుచేసే బాధ్యతలను ప్రభుత్వం ఆరు కంపెనీలకు అప్పగించింది. ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా తయారు చేసి పంపినట్టు సమాచారం. సైజుల్లో తేడాలు రావడంతో ప్రధానోపాధ్యాయులు వాటిని ఒక ఆటోలో వేసుకుని కలెక్షన్ పాయింట్‌కు వెళ్లి సైజుల ప్రకారం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్యాగు బాగోలేదు..
ఈ విద్యాకానుక కిట్‌ను ఒక బ్యాగ్‌లో పెట్టి విద్యార్థులకు అందజేశారు. దీనిలో నోట్, పాఠ్య పుస్తకాలు పెట్టే సరికి పైభాగంలో ఉన్న జిప్ ఊడిపోతోందని విద్యార్థులు చెబుతున్నారు.
హెడ్మాస్టర్లకు వదులుతున్న చేతి చమురు
జగనన్న విద్యాకానుకలో యూనిఫాం, నోట్, పాఠ్య పుస్తకాలు, షూ, బెల్టు, బ్యాగ్ ఉన్నాయి. వాటిని ఒక కిట్‌గా పరిగణిస్తున్నారు. ఈ కిట్లను నేరుగా ఆయా పాఠశాలలకే పంపాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో కిట్‌కు రూ.11.29 పైసలు రవాణా చార్జీ చెల్లించాలని భావించారు. తర్వాత ఈ నిర్ణయం ఎందుకో ఆచరణకు నోచుకోలేదు. పాఠశాలలవారీగా ప్రధానోపాధ్యాయులే కలెక్షన్ పాయింట్లకు వెళ్లి విద్యాకానుక కిట్లను తెచ్చుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రధానోపాధ్యాయులు వారి జేబు డబ్బుతో ఈ కిట్లను తెచ్చుకోవాల్సి వస్తోంది. నగరాల్లో ఒక స్కూల్‌ను, మండలాల్లో అయితే మండల కేంద్రంలో ఉన్న ఒక స్కూల్‌ను కలెక్షన్ పాయింట్ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు ఈ పాయింట్ల వద్దకు వెళ్లి కానుకలను తీసుకెళ్తున్నారు. ఈ రవాణాకు వారి జేబు నుంచి డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. షూ, యూనిఫాం, బెల్టు, బ్యాగ్ కలెక్షన్ పాయింట్‌లో ఉన్నప్పటికీ, నోట్, పాఠ్య పుస్తకాలు మాత్రం ఆటోనగర్‌లో ఉన్న గోడౌన్ నుంచి తీసుకెళ్లాల్సి వస్తోంది. పుస్తకాల టైటిల్స్ వచ్చినప్పుడల్లా తీసుకెళ్లడం తమకు తలబొప్పి కడుతుందని పలువురు ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండు సెమిస్టర్లు కలిపి మొత్తం 4.29 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 3.29 లక్షల మొదటి సెమిస్టర్ పుస్తకాలే గోడౌన్‌కు చేరాయి. మిగిలిన లక్ష రెండో సెమిస్టర్ పుస్తకాలు తర్వాత వస్తాయంటున్నారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
మూడు కాదు.. రెండే..
విద్యాకానుకలో మరో ముఖ్యమైనది యూనిఫాం. ఏడాదికి మూడు జతలు ఉండేలా కొలతలు కొలిచి విద్యార్థులకు ఇచ్చారు. ఈ వస్త్రాలను బ్యాగ్‌లో పెట్టి విద్యార్థులకు ఇచ్చేస్తున్నారు. వీటిని తీసుకుని టైలర్ వద్దకు వెళ్తే మూడు జతలు సాధ్యం కాదని చెప్పేస్తున్నారు. రెండు జతలే అవుతాయంటున్నారు. ఈ యూనిఫాం కుట్టించుకున్నందుకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.40 ఇస్తోంది. ఈ డబ్బు తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని టైలర్లు చెబుతున్నారు. దీంతో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అదనంగా క్లాత్‌ను కొనుక్కుంటున్నారు.