Teachers Transfers: టీచర్ల బదిలీలపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?

ABN , First Publish Date - 2023-07-03T11:15:10+05:30 IST

కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

Teachers Transfers: టీచర్ల బదిలీలపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?

కోర్టు స్పష్టత వచ్చాకే.. టీచర్ల పదోన్నతులు, బదిలీలు

బదిలీల కోసం 72 వేల మంది

ఉపాధ్యాయుల దరఖాస్తు

స్పౌజ్‌లకు ప్రత్యేక పాయింట్లపై

కోర్టుకెళ్లిన నాన్‌స్పౌజ్‌లు

కోర్టులో నేడు కేసుపై వాదన

హైదరాబాద్‌, జులై 2 (ఆంధ్రజ్యోతి): కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దాంతో కోర్టులో కొనసాగుతున్న కేసుల విషయంలో ఒక స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు, బదిలీలు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీటిని పూర్తి చేయడానికి వీలుగా గత అకడమిక్‌ ఇయర్‌లో ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు బదిలీలు, పదోన్నతులకు ప్రత్యేక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. దాంతో సుమారు 72 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు కోర్టుకు వెళ్లి బదిలీలపై స్టే తీసుకువచ్చారు. దాంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. స్పౌజ్‌ టీచర్లకు బదిలీల్లో ఇచ్చే ప్రత్యేక పాయింట్ల పద్ధతిని వ్యతిరేకిస్తూ నాన్‌ స్పౌజ్‌లు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 5ను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో స్పౌజ్‌లకు 10 పాయింట్లను కేటాయించడం ద్వారా ఇతర ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషన్‌ వేశారు.

సుమారు 20 ఏళ్ల క్రితం మహిళా టీచర్లను ప్రోత్సహించడం కోసం అప్పటి ప్రభుత్వం స్పౌజ్‌లకు ప్రత్యేక పాయింట్ల వ్యవస్థను తీసుకువచ్చిందని, అయితే.. 2000 సంవత్సరం తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వేల సంఖ్యలో మహిళలు వచ్చారని, దాంతో భార్య, భర్తల ఉపాధ్యాయ ఉద్యోగుల శాతం పెరిగిందని, ఇలాంటి పరిస్థితిలో స్పౌజ్‌లకు ప్రత్యేక పాయింట్లను కల్పించడం ద్వారా ఇతర ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నాన్‌-స్పౌజ్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో బదిలీలపై స్టే వచ్చింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసు మళ్లీ సోమవారం కోర్టు విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

డీఎస్సీ-98 అభ్యర్థులకు న్యాయం: సబిత

డీఎస్సీ-98 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు త్వరలోనే న్యాయం చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ అధ్యక్షతన ప్రతినిధి బృందం ఆదివారం మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించింది. ఈ విషయంలో గతంలో సీఎం కేసీఆర్‌ కూడా హామీ ఇచ్చారని, ఏపీలో ఇప్పటికే ఉద్యోగాలను ఇచ్చారని గుర్తు చేసింది. దీనికి మంత్రి స్పందిస్తూ ఈ విషయంపై కేబినెట్‌ సబ్‌ కమిటీతో చర్చించామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-07-03T11:15:10+05:30 IST