Karnataka Assembly Elections: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయిపోయాయో చూడండి..!
ABN , First Publish Date - 2023-05-09T20:40:03+05:30 IST
కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాది రాష్ట్రం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికలపై జోరుగానే చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలు మాత్రం ఓ విషయాన్ని తాజాగా రుజువు చేశాయి. అసెంబ్లీ ఎన్నికలు రానురానూ కాస్ట్లీగా మారుతున్నాయని కర్ణాటక ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు, మద్యం.. ఇతరత్రా తాయిలాల విలువ లెక్కిస్తే ఇట్టే అర్థమైపోతుంది. భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) మే 9న వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. కర్ణాటక ఎన్నికల్లో వందల కోట్ల ధన ప్రవాహం సాగిందని స్పష్టమైంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎంత కట్టడి చేసినా అనధికారికంగా అభ్యర్థులు డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈసారి.. కాస్తంత ఎక్కువ నిఘా పెట్టగా రూ.375 కోట్లు పట్టుబడటం గమనార్హం.
ధన ప్రవాహం ఎక్కువగా జరిగే 81 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 146 మందికి పైగా ఖర్చును లెక్కగట్టే పరిశీలకులను ఆ నియోజకవర్గాల్లో నియమించింది. ఈ పట్టుబడిన రూ.375 కోట్లలో రూ.147.46 కోట్లు నగదే ఉండటాన్ని గమనిస్తే.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 83.66 కోట్ల రూపాయల విలువైన 22.27 లక్షల లీటర్ల మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ.23.67 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.96.60 కోట్ల విలువైన ఆభరణాలు, 24.21 కోట్ల రూపాయల ఇతర ఉచితాలను సీజ్ చేసినట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇవి కాకుండా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.288 కోట్ల రూపాయలను అటాచ్ చేయడం గమనించాల్సిన విషయం. ఈ సీజ్ చేసిన సొమ్ముకు సంబంధించిన హైలైట్స్ ఏంటంటే.. కోలార్ జిల్లాలోని బంగారపేట్‌లో రూ.4.04 కోట్ల డబ్బు నగదు రూపంలో పట్టుబడింది. బీదర్ జిల్లాలో 100 కిలోల గంజాయిని అధికారులు సీజ్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచార సరళిని ఒక్కసారి పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వారాలపాటు సాగిన ప్రచార హోరు సోమవారంతో ముగిసింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుండడంతో నిబంధనలకు అనుగుణంగా సోమవారం సాయంత్రం రాష్ట్రమంతటా ప్రచారఘట్టానికి తెరపడింది. శాసనసభ ఎన్నికల నామినేషన్లు ఏప్రిల్ 13న ప్రారంభం కాగా 20వ తేదీ దాకా సాగాయి. అదే రోజు నుంచే ప్రచార పర్వానికి తెరలేసింది. 224 నియోజకవర్గాల నుంచి 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉత్కంఠ పోరు సాగుతుండగా జేడీఎస్ కొన్ని ప్రాంతాలలో కీలకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా అభ్యర్థులను బరిలో నిలిపింది. సీపీఎం, ఎన్‌సీపీ, బీఎస్పీ, ఎంఈఎస్ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కర్ణాటకలో పేరొందిన రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి ప్రారంభించిన కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ తొలిసారి అభ్యర్థులను బరిలోకి నిలిపింది. నటుడు ఉపేంద్ర స్థాపించిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర సమితి, ఇండియన్ మూమెంట్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌పీఎఫ్, ఎస్‌డీపీఐలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో అభ్యర్థులను బరిలోకి నిలిపాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల తరపున ప్రచారానికి మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి అగ్రనేతలు వచ్చారు. రెండు వారాలు ఎండలు బెంబేలెత్తించగా గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా వర్షాలతో వాతావరణం చల్లబడింది. దక్షిణాదిన పట్టుకోసం ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇరు పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలోనే తిష్ట వేసి ప్రచారం సాగించారు.