PM MODI: బీజేపీ పక్షాన ప్రజలే పోరాడుతున్నారు
ABN , First Publish Date - 2023-05-07T02:49:13+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలే ఆ పార్టీ తరఫున పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
వారే ఎన్నికల బరిలో నిలిచారు
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
బెంగళూరులో భారీ రోడ్ షో
లక్షల సంఖ్యలో ప్రజల హాజరు
బాదామి/బెంగళూరు(ఆంధ్రజ్యోతి), మే 6: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలే ఆ పార్టీ తరఫున పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 8వ తేదీతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దాదాపు 26.5 కిలోమీటర్ల మేర ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. బెంగళూరులోని సోమేశ్వర్‌భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో మల్లేశ్వరం వరకు సాగింది. సుమారు 3 గంటల పాటు నిర్వహించిన ఈ రోడ్ షోలో ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో మోదీ నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ సాగిన ఈ రోడ్ షోలో ఆయా నియోజకవర్గాల నుంచి కుటుంబాలకు కుటుంబాలే తరలి వచ్చాయి. దివ్యాంగులు, మహిళలు, యువత లక్షల సంఖ్యలో తరలి వచ్చి రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానికి స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు ‘మోదీ-మోదీ’, జై బజరంగబలీ-భారత్‌మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు.
చిన్నారులు, విద్యార్థులు హనుమాన్ ఫేస్ మాస్కులు పట్టుకుని కనిపించారు. మరికొందరు యువకులు హనుమాన్ వేషధారణలో కనిపించారు. రోడ్లకు ఇరువైపుల ఉన్న ప్రజలు ప్రధాని కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం బాల్కోట్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇది.. కనీవినీ ఎరుగని జనసందోహం. బెంగళూరు ప్రజలు నాపై చూపిన ప్రేమ, వాత్సల్యాలను మునుపెన్నడూ ఎక్కడా చూడలేదు. జనక్షేత్రంలో ప్రజాదేవుళ్ల దర్శనంతో పులకించిపోయాను’’ అని వ్యాఖ్యానించారు. ఇంతటి జనాదరణ ను చూస్తుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున వారే పోటీ చేస్తున్నట్టుగా, వారే పోరాడుతున్నట్టుగా తనకు అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అది 85ు కమిషన్ పార్టీ. ఎన్నడూ అభివృద్ధి మాటే తలపెట్టదు. ప్రజా సంక్షేమం ఆ పార్టీకి తెలియదు’’ అని విమర్శించారు. కాగా, రోడ్ షోకు దాదాపు 8 లక్షలకు పైగానే ప్రజలు హాజరయ్యారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌ది పీఎ్‌ఫఐ అజెండా: షా
బెళగావి, మే 6: నిషేధిత పీఎ్‌ఫఐ అజెండాను కాంగ్రెస్ పుణికి పుచ్చుకుందని, ఆ అజెండా మేరకే పనిచేస్తోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇలాంటి పార్టీకి ప్రజలు దూరంగా ఉండాలని, కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బెళగావి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో షా ప్రసంగించారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించానని, ప్రజలంతా బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బెళగావిలో మొత్తం 18 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బజరంగ్‌దళ్‌ను నిషేధించాలని ప్రతిపాదించడం ద్వారా హిందూ విశ్వాసాలను అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. శనివారం చిక్కమగళూరు జిల్లా కొప్పాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.