Doctor: 80 ఏళ్ల ఆవిడకు హార్ట్‌ సర్జరీ చేసిన డాక్టర్ అనుభవాలు ఇలా..

ABN , First Publish Date - 2023-08-22T11:41:55+05:30 IST

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు వైద్యం అందించారు ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ గూడపాటి. ఆయన తన కెరీర్‌లో ఎదుర్కొన్న మర్చిపోలేని అనుభవాలను ఇలా పంచుకున్నారు.

Doctor: 80 ఏళ్ల ఆవిడకు హార్ట్‌ సర్జరీ చేసిన డాక్టర్ అనుభవాలు ఇలా..

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు వైద్యం అందించారు ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ గూడపాటి. ఆయన తన కెరీర్‌లో ఎదుర్కొన్న మర్చిపోలేని అనుభవాలను ఇలా పంచుకున్నారు.

ఇరవై ఏళ్ల క్రితం ఒక 60 ఏళ్ల వ్యక్తిని కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆయనకు తీవ్రమైన గుండె పోటు వచ్చింది. అయితే ఆస్పత్రి గేటు దగ్గరే కార్డియాక్‌ అరెస్ట్‌ అయిపోయి, ఆయన కుప్పకూలిపోయాడు. పరీక్షిస్తే ఆయన గుండె, శ్వాస రెండూ ఆగిపోయాయనే విషయం అర్థమైంది. అదే పనిగా ఆపకుండా 45 నిమిషాల పాటు సిపిఆర్‌ చేసిన తర్వాత, నెమ్మదిగా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. అయితే ఇసిజి పరీక్షిస్తే ఆయనకు భారీ గుండెపోటుకు గురైనట్టు కనిపెట్టాం. రక్తపోటు కూడా బాగా పడిపోయింది. అలాంటి పరిస్థితిలో రోగి బ్రతికే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఆయన గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళం బ్లాక్‌ అయిపోయింది. స్టెంట్‌ వేసి, వెంటిలేటర్‌ కొనసాగించిన తర్వాత నాలుగు రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుట పడడం మొదలు పెట్టింది. వెంటనే సిపిఆర్‌ చేయగలిగాం కాబట్టి బ్రెయిన్‌ డ్యామేజ్‌ కూడా జరగలేదు. అయితే ఆయన ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ వాళ్ల అబ్బాయి నన్ను కలుస్తూ, తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉండేవాడు. రోగి పూర్తిగా కోలుకున్నాడు కాబట్టి డిస్చార్జ్‌ చేద్దామని నిర్ణయించుకున్నాం. డిశ్చార్జ్‌ అయ్యే రోజు కుటుంబ సభ్యులందరకూ పెద్దాయన దగ్గరకు వచ్చారు. కానీ చనిపోతాడనుకున్న వ్యక్తి, ఆరోగ్యాన్ని పుంజుకుని ఇంటికి చేరుకుంటున్నందుకు సంతోషించవలసిన వాళ్లు ఎంతో నిరాశగా కనిపించారు. రోజూ వచ్చి నన్ను కలుస్తూ ఉండే వాళ్ల అబ్బాయి కూడా ఆ రోజు రాలేదు. అతనికి ముప్పై ఐదు ఏళ్లుంటాయి. ఆరా తీస్తే అదే రోజు అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. బ్రతికే అవకాశాలు ఒక్క శాతం కంటే తక్కువ ఉన్న వ్యక్తి ప్రాణాలు నిలిస్తే, చనిపోయే అవకాశం ఏమాత్రం లేని వ్యక్తి చనిపోవడం దురదృష్టకరం. ఇదే జీవితమంటే! ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆ కుటుంబానికి కొడుకే ఆధారం. అతని పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు. అతను చనిపోవడంతో కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. కానీ పూర్తి ఆరోగ్యం పుంజుకున్న తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేసి, ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. కొవిడ్‌ ముందు వరకూ, 80 ఏళ్ల వయసుకు చేరుకునే వరకూ ఆయన బ్రతికే ఉన్నారు. నన్ను కలిసిన ప్రతిసారీ ‘‘మీరు నా ప్రాణాలను నిలబెట్టడం మూలంగానే నేను కుటుంబానికి ఆధారం కాగలిగాను. నా మనవళ్లిద్దరూ చక్కగా సెటిల్‌ అయ్యారు. నా కొడుకు లాగే, నేను కూడా పోయి ఉంటే, కుటుంబం రోడ్డున పడి ఉండేది.’’ అంటూ ఉండేవారు.

కొలీగ్‌కే హార్ట్‌ అటాక్‌

ఇంకొక సంఘటన 15 ఏళ్ల కిత్రం జరిగింది. నా కొలీగ్‌, కార్డియాలజి్‌స్టకు నా సమక్షంలోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అతని భార్యకు తొమ్మిదో నెల. ఆవిడ గైనకాలజి్‌స్టగా పని చేస్తోంది. ఇతనికి ఇసిజి తీయించి చూస్తే అది భారీ హార్ట్‌ ఎటాక్‌ అనే విషయం అర్థమైంది. ‘నీకొచ్చింది చిన్న సమస్యేలే! ఏం కాదు, తగ్గిపోతుంది’ అని అతనితో చెప్పలేను. అతను కూడా కార్డియాలజిస్ట్‌ కాబట్టి పరిస్థితి అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఎటాక్‌ వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా స్టెంట్‌ వేయగలిగితే, నష్టాన్ని తగ్గించవచ్చు. కాబట్టి వెంటనే క్యాథ్‌ ల్యాబ్‌కు తీసుకువెళ్లి ఆ పని మొదలు పెడుతున్నప్పుడు, ‘‘రమేష్‌, పుట్టబోయే బిడ్డను చూసుకునేలా నువ్వెలాగైనా నన్ను బ్రతికించాలి. ఇది నా బాధ్యత’’ అన్నాడు. వెంటనే అతన్ని వెంటిలేటర్‌ మీద ఉంచి, యాంజియో చేసినప్పుడు మెయిన్‌ వెజెల్‌ బ్లాక్‌ అయినట్టు కనిపించింది. స్టెంట్లు వేశాక నాలుగు రోజుల్లో అతను కోలుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి ఏడాదీ, వాళ్ల అబ్బాయి పుట్టిన రోజు నాడు ‘‘నీ వల్లే నేను నా బిడ్డను పెంచుకోగలుగుతున్నాను’’ అంటూ నాకు మెసేజ్‌ పంపిస్తూ ఉంటాడు.

సర్జరీతో ఆకలి తీర్చాను

80 ఏళ్ల పెద్దావిడకు గుండె రక్తనాళాల్లో చాలా బ్లాక్స్‌ ఉన్నాయి. ఆవిడ బైపాస్‌ సర్జరీకి ఫిట్‌గా లేరు. ఆవిడకు యాంయోప్లాస్టీ చేయడం ప్రమాదకరం. బ్లాక్స్‌ వల్ల ఆవిడ కొద్దిగా తిన్నా ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చేస్తోంది. దాంతో ఆవిడ తినడం బాగా తగ్గించేసింది. అలా మూడు, నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయింది. ఆకలేస్తూ ఉంటుంది. అయినా తినలేని పరిస్థితి ఆవిడది. మూడు, నాలుగు ఆస్పత్రులు తిరిగినా, కాంప్లెక్స్‌ కేసు కాబట్టి వైద్యులు మందులనే సూచించారు. ఆ దశలో ఆవిడ నా దగ్గరకు వచ్చింది. పరీక్షిస్తే, ఉన్న బ్లాక్స్‌ అన్నింట్లో రెండింటిని క్లియర్‌ చేస్తే ఆవిడకున్న ఆ ఇబ్బంది తొలగిపోతుందనే విషయాన్ని గ్రహించాను. అయితే ఇలాంటి కేసుల్లో రోగులు టేబుల్‌ పైనే చనిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి కుటుంబసభ్యులకు వివరించి, వాళ్ల ఆమోదం మీద సర్జరీ చేశాను. అదృష్టవశాత్తూ ఆవిడ బ్రహ్మాండంగా కోలుకుంది. ఛాతీ నొప్పి తగ్గిపోయి, తృప్తిగా తినడం మొదలు పెట్టింది. నన్ను కలిసిన ప్రతిసారీ... ‘‘ప్రతి ముద్ద తినే ముందు నిన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాను. నీ వల్ల నాకు తినే భాగ్యం దక్కింది. ఆ భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాకు దేవుడితో సమానం’’ అంటూ ఉంటుంది. సర్జరీ తర్వాత ఆవిడ ఎనిమిదేళ్లు బ్రతికింది.

SJF.jpg

-డాక్టర్‌ రమేష్‌ గూడపాటి,

చీఫ్‌ ఆఫ్‌ కార్డియాలజీ,

స్టార్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-08-22T11:41:55+05:30 IST