Prostate Cancer: ఈ చెక్కతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు చెక్‌! ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో వెల్లడి

ABN , First Publish Date - 2023-08-26T10:25:08+05:30 IST

చెక్కలో ఉండే సినామల్‌డిహైడ్‌, ప్రొసైనిడిన్‌-బి2 పదార్థాలు ప్రొస్టేట్‌ గ్రంధి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై తాము జరిపిన ప్రయోగంలో తేలిందని ఎన్‌ఐఎన్‌ శుక్రవారం ప్రకటన చేసింది.

Prostate Cancer: ఈ చెక్కతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు చెక్‌! ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 25: నిత్యం వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను (Prostate Cancer) నిరోధిస్తుందని హైదరాబాద్‌లోని, జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దాల్చిన చెక్కలో ఉండే సినామల్‌డిహైడ్‌, ప్రొసైనిడిన్‌-బి2 పదార్థాలు ప్రొస్టేట్‌ గ్రంధి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై తాము జరిపిన ప్రయోగంలో తేలిందని ఎన్‌ఐఎన్‌ శుక్రవారం ప్రకటన చేసింది. దాల్చిన చెక్కతో పాటు నిత్యం వంటల్లో ఉపయోగించే పదార్థాల్లో ఉండే ఔషధ గుణాల వల్ల ఎలాంటి మేలు జరుగుతుందనే అంశంపై ఎన్‌ఐఎన్‌ గతంలోనూ పలు అధ్యయనాలు చేసింది. తాజా అధ్యయనంలో భాగంగా దాల్చిన చెక్కలో ఉండే సినామల్‌డిహైడ్‌, ప్రొసైనిడిన్‌-బి2 పదార్థాలను ఆహారంలో కలిపి ఎలుకలకు ఇచ్చారు. ఆ తరువాత క్యాన్సర్‌ కారక కణాలను ఎలుకలకు ఇచ్చారు. 16 వారాల పాటు వాటికి ఈ ఆహారాన్ని అందించిన తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించారు. దాల్చిన చెక్క, అందులోని ఔషధగుణాల వల్ల 60 నుంచి 70 శాతం ఎలుకల ప్రొస్టేట్‌ గ్రంథి ఏ మాత్రం క్యాన్సర్‌ ప్రభావానికి గురి కాలేదని గుర్తించారు. దాల్చినచెక్కలోని ఔషధ గుణాలు ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని నిరోధిస్తాయని, ఫలితంగా ప్రొస్టేట్‌ గ్రంథిలో క్యాన్సర్‌ కణాల వ్యాప్తి తగ్గుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందని ఎన్‌ఐఎన్‌ ఎండోక్రోనాలజీ విభాగం సారథి డాక్టర్‌ ఆయేషా ఇస్మాయిల్‌ తెలిపారు. అంతేకాక దాల్చిన చెక్కను ఆహారంలో కలిపి ఇవ్వడం వల్ల ఎలుకల ఎముకలపై సానుకూల ప్రభావం కనిపించిందని, ఎముకల క్షీణత తగ్గిందని తెలిపారు. ఎన్‌ఐఎన్‌ చేసిన ఈ పరిశోధన వివరాలను అంతర్జాతీయ జర్నల్‌ క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ రిసెర్చ్‌లో ప్రచురించారు.

Updated Date - 2023-08-26T10:25:08+05:30 IST