Skin care: పైబడే వయసు పని పడదాం!

ABN , First Publish Date - 2023-08-29T12:07:00+05:30 IST

నుదుటి మీది ముడతలు, కళ్ల చివర్లన గీతలు లాంటి వయసు పైబడే లక్షణాలు మొదలయ్యాక, అద్దం మీద శ్రద్ధ తగ్గడం సహజమే! అలాగని అద్దంలో ప్రతిఫలించే వృద్ధాప్య ఛాయలను చూసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చర్మపు బిగుతును పెంచి, ముడతలను మటుమాయం చేసే సౌందర్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.

Skin care: పైబడే వయసు పని పడదాం!

నుదుటి మీది ముడతలు, కళ్ల చివర్లన గీతలు లాంటి వయసు పైబడే లక్షణాలు మొదలయ్యాక, అద్దం మీద శ్రద్ధ తగ్గడం సహజమే! అలాగని అద్దంలో ప్రతిఫలించే వృద్ధాప్య ఛాయలను చూసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చర్మపు బిగుతును పెంచి, ముడతలను మటుమాయం చేసే సౌందర్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.

వయసు పెరిగేకొద్దీ చర్మం అడుగున కొల్లాజెన్‌, కొవ్వులు తరిగిపోయి, బోన్‌ లాస్‌ అవడం వల్ల ముఖ చర్మం బిగుతు సడలుతుంది. ముఖ కవళికల్లో మార్పులు జరుగుతాయి. అయితే ఈ మార్పులను నియంత్రించాలంటే చర్మం అడుగున కొల్లాజెన్‌ను పెంచడంతో పాటు ఎముకలను దృఢపరచాలి. అందుకోసం క్రమం తప్పకుండా సన్‌స్ర్కీన్‌, మాయిశ్చరైజర్లు వాడుకోవడం, అలాగే 25 నుంచ 30 ఏళ్ల వయసు నుంచి రెటినాల్‌ ఆధారిత యాంటీ ఏజింగ్‌ క్రీమ్స్‌ వాడుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా అవసరమే! అందుకోసం సలాడ్స్‌, చక్కెర జోడించని పండ్ల రసాలు తీసుకోవాలి. వ్యాయమంతో కూడా వయసు పైబడే వేగాన్ని తగ్గించవచ్చు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంతమందిలో జన్యువుల కారణంగా చిన్న వయసులోనే వయసు పైబడే లక్షణాలు మొదలైపోతూ ఉంటాయి. చికిత్సలో భాగంగా కొల్లాజెన్‌ డ్రింక్స్‌, యాంటీఆక్సిడెంట్‌ మాత్రలు, విటమిన్‌ సిలతో కొంత మేరకు ముఖ చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. అలాగే ఈ చికిత్సలతో వయసు పైబడే వేగం కూడా నెమ్మదిస్తుంది.

ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని మాత్రలు, క్రీములు వాడినా ముఖంలో వృద్ధాప్య లక్షణాలు అదుపులోకి రాకపోతే, చర్మ చికిత్సలు తీసుకోవచ్చు. వయసు పైబడే లక్షణాలు వ్యక్తుల్లో భిన్నంగా ఉంటాయి. కొందరికి నుదుటి మీద గీతలు మొదలవుతాయి. ఇంకొందరికి భృకుటి దగ్గర నిలువ గీతలు వస్తాయి. కొందరికి నవ్వినప్పుడు కళ్ల చివరన, పెదవుల చుట్టూ గీతలు ఏర్పడతాయి. బుగ్గల దగ్గర చర్మం సాగిపోతుంది. పై కనురెప్పల చర్మం కిందకు సాగి ఉంటుంది. కనురెప్పలు, పెదవులు కిందకు వంగిపోతాయి. కళ్ల కింద ముడతలు లేదా సంచులు, గుంతలు ఏర్పడతాయి. ముక్కు దగ్గర ముడతలు ఏర్పడతాయి. డబుల్‌ చిన్‌, దవడ లైన్‌ పదునుగా ఉండకుండా జారిపోయినట్టు తయారవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

యాంటీ ఏజింగ్‌లో...

బొట్యులైనమ్‌ టాక్సిన్‌, ఫిల్లర్లు, త్రెడ్స్‌, హైఫు టెక్నాలజీ, మల్టీపోలార్‌ ఆర్‌ఎఫ్‌ మొదలైన చికిత్సలతో వయసు పైబడే లక్షణాలను అరికట్టవచ్చు.

బొట్యులైనమ్‌ టాక్సిన్‌: కండరం బిగుతు సడలి, చర్మం మీద ఏర్పడిన ముడతలను తగ్గించడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది. నుదుటి మీది ముడతలు, భృకుటి మధ్యలో ఏర్పడిన గీతలు, కంటి చుట్టూరా ఏర్పడే ముడతలు, గీతలు, నోటి చుట్టూ వచ్చే చిన్న గీతలు, ముడతలు తగ్గించడానికి ఈ చికిత్సను ఎంచుకోవచ్చు. ముఖం మీద ఏర్పడే సన్న గీతల కోసం మైక్రో బొటాక్స్‌ చికిత్స సహాయపడుతుంది. ఈ చికిత్సలన్నీ ఇంజెక్షన్‌తో ముడిపడి ఉంటాయి. నొప్పి, దుష్ప్రభావాలు పెద్దగా ఉండవు. ఒకసారి ఈ చికిత్సను తీసుకుంటే, దాని ప్రభావం ఆరు నెలల వరకూ ఉంటుంది.

ఫిల్లర్లు: కంటి దిగువన గుంతలు, బుగ్గలను సరిదిద్దడానికీ, స్కిన్‌ పిగ్మెంటేషన్‌, దవడ ఎముక క్రియేషన్‌కూ, కణతల దగ్గర ఏర్పడే గుంతలను పూడ్చడానకీ ఉపయోగపడతాయి. కండరాలు పట్టు సడలి, ముఖం పీక్కుపోయినట్టు తయారైన వాళ్లకు కూడా ఫిల్లర్లు ఉపయోగపడతాయి. అలాగే స్కిన్‌ బూస్టర్స్‌ అనే ఇంజెక్షన్లతో ముఖం మెరుపును సంతరించుకుంటుంది. వీటితో దక్కే ఫలితాలు ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉంటాయి.

ఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌: ఈ చికిత్సతో కళ్ల దిగువన గుంతలను పూడ్చవచ్చు. ఈ శాశ్వత చికిత్సలో భాగంగా పొత్తి కడుపు, తొడల దగ్గరుండే కొవ్వును సేకరించి, ఫైన్‌ ఫ్యాట్‌ను వేరు చేసి, కళ్ల దిగువన ఇంజెక్ట్‌ చేస్తారు.

త్రెడ్స్‌: చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ను బూస్ట్‌ చేయడానికీ, సాగిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికీ త్రెడ్స్‌ ఉపయోగపడతాయి. బుగ్గలు జారిపోయినా, దవడ ఎముక స్పష్టత కోల్పోయినా, కళ్ల దిగువన ముడతలు ఏర్పడినా ఈ చికిత్సను ఎంచుకోవచ్చు. త్రెడ్స్‌లో రెండు రకాలుంటాయి. ఒక రకం ముడతలు తొలగించి, ఎలాస్టిసిటీని పెంచుతాయి. లావుగా కనిపించేలా చేయడం కోసం బుగ్గల దగ్గర, కళ్ల దిగువన వీటిని అమరుస్తారు. ఈ త్రెడ్స్‌ కొన్ని రోజులకు కరిగిపోతాయి. కాబట్టి ఇబ్బందేమీ ఉండదు. అయితే త్రెడ్స్‌ కరిగిపోయినా, వాటితో దక్కిన ప్రభావం అలాగే ఉండిపోతుంది. ఇంకొక రకం త్రెడ్స్‌కు చిన్న చిన్న ముళ్లలాంటి ఏర్పాట్లుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని పైకి లాగి, కూర్చోబెడుతుంది. ఫేస్‌ లిఫ్టింగ్‌ కోసం ఈ తరహా త్రెడ్స్‌ వాడుకోవచ్చు. ఈ త్రెడ్స్‌ ప్రభావం కూడా ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉంటుంది.

వ్యాంపైర్‌ ఫేస్‌ లిఫ్ట్‌: ముఖానికి చేసే పిఆర్‌పి చికిత్స ఇది. రక్తంతో సంబంధం ఉన్న చికిత్స కాబట్టే దీన్ని వ్యాంపైర్‌ ఫేస్‌ లిఫ్ట్‌ అంటారు. ఈ చికిత్సలో, రక్తాన్ని సేకరించి, ప్లేట్‌లెట్లను వేరు చేసి ముఖ చర్మంలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. ప్లేట్‌లెట్లలో గ్రోత్‌ ఫ్యాక్టర్లు ఉంటాయి. కాబట్టి చర్మం ముడతలు తొలగి, పునరుజ్జీవం పొందుతుంది. అయితే ఈ చికిత్సతో యాంటీ ఏజింగ్‌ ఎఫెక్ట్‌ను తెప్పించవచ్చు. కానీ సాగిపోయిన ముఖ చర్మాన్ని తిరిగి సరిచేసే వీలుండదు. వయసు పైబడే లక్షణాలు ప్రారంభ దశలో ఉన్నవాళ్లకు ఈ చికిత్స తోడ్పడుతుంది.

హౌఫు: ఫేస్‌ను లిఫ్ట్‌ చేయడం కోసం హై ఇంటెన్సిటీ ఫోక్‌సడ్‌ అలా్ట్రసౌండ్‌తో చేసే నొప్పి లేని చికిత్స ఇది. ఈ అలా్ట్రసౌండ్‌లో ప్రోబ్స్‌ ద్వారా చర్మంలోని వేర్వేరు లోతుల్లో కండరం బిగుతును పెంచవచ్చు. ఈ చికిత్సతో చర్మం క్రమేపీ బిగుతును సంతరించుకుంటుంది. ఫలితం ఒక నెల తర్వాత కనిపిస్తుంది. దవడ ఎముక, డబుల్‌ చిన్‌లను, ముక్కు పక్కన ముడతలను సరిదిద్దడం కోసం ఈ చికిత్సను ఎంచుకోవచ్చు.

ఏ వయసు నుంచి?

యాంటీ ఏజింగ్‌ చికిత్సలను వయసు పైబడిన తర్వాత కాకుండా 25 నుంచి 30 ఏళ్ల నుంచే మొదలు పెట్టాలి. మరీ ముఖ్యంగా చర్మ తత్వాన్ని బట్టి వాటర్‌ బేస్‌డ్‌, జెల్‌ టైప్‌, టింటెడ్‌ సన్‌స్ర్కీన్‌లను ఎంచుకోవాలి. ఎక్కువగా ఎండకు బహిర్గతం అయ్యేవాళ్లు ఎస్‌పిఎఫ్‌ ఎక్కువగా ఉన్న సన్‌స్ర్కీన్‌ వాడుకోవాలి. కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేసే వాళ్లు స్ర్కీన్స్‌ నుంచి వెలువడే బ్లూ లైట్‌కు బహిర్గతం అవుతూ ఉంటారు. దీన్నుంచి రక్షణ కోసం సంబంధిత సన్‌స్ర్కీన్‌ను వాడుకోవాలి. తాజాగా ఎస్‌పిఎఫ్‌ కలిసిన పౌడర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా వాడుకోవచ్చు. అలొవేరా, విటమిన్‌ఇ, విటమిన్‌సి ఉన్న మాయిశ్చరైజర్లు ఎంచుకుంటే చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. యాంటీ ఏజింగ్‌ క్రీమ్స్‌లో రెటినాల్‌ ఆధారితమైనవి ప్రధానమైనవి. వీటికి ప్రత్యామ్నాయంగా, సురక్షితమైన వృక్షాధారిత రెటినాల్‌ ఉత్పత్తులు కూడా అందుబాటులోకొచ్చాయి. అలాగే హైడ్రేషన్‌ కోసం హైడ్రోలిక్‌ యాసిడ్‌ సీరమ్స్‌ వాడుకోవచ్చు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, క్యాల్షియం, కొల్లాజెన్‌ సప్లిమెంట్లను రొటేషనల్‌ బేసిస్‌ మీద తీసుకోవచ్చు.

kd.jpg

అనుభవజ్ఞుల పర్యవేక్షణలో...

యాంటీ ఏజింగ్‌ చికిత్సల పట్ల సుదీర్ఘ అనుభవమున్న చర్మ వైద్యులను ఆశ్రయించడం అవసరం. మరీ ముఖ్యంగా త్రెడ్స్‌ అమర్చేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇన్‌ఫెక్షన్లు తప్పవు. ఫిల్లర్స్‌లోని మెటీరియల్‌ కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లోకి ప్రవేశించి, సమస్యలను తెచ్చి పెట్టే వీలుంటుంది. అలాగే బొటాక్స్‌ అవసరానికి మించి ఇచ్చినప్పుడు కండరం బిగుసుకుపోయి, కదలికలను కోల్పోయి, ముఖ కవళికలు మారిపోవచ్చు. అప్పుడు ముఖం ప్లాస్టిక్‌ ఫేస్‌లా మారిపోతుంది. కాబట్టి ఈ చికిత్సలను వయసు, కండర దారుడ్యాల ఆధారంగా డోస్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.

dfke.jpg

డాక్టర్‌ స్వప్న ప్రియ, డెర్మటాలజిస్ట్‌,

కాస్మోస్యూర్‌ క్లినిక్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - 2023-08-29T12:08:44+05:30 IST