మధుమేహం, బరువు అదుపులో ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-06-28T12:19:49+05:30 IST
సెమాగ్లుటైడ్ మాత్రను కాస్త అధిక మోతాదులో తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని నార్త్ కరోలినా వర్సిటీ ప్రొఫెసర్ జాన్‌బ్యూ్‌స ఈ అధ్యయనం చేశారు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): సెమాగ్లుటైడ్ మాత్రను కాస్త అధిక మోతాదులో తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని నార్త్ కరోలినా వర్సిటీ ప్రొఫెసర్ జాన్‌బ్యూ్‌స ఈ అధ్యయనం చేశారు. మొత్తం 1606 మందిపై స్టడీ చేశారు. సగటున 58 ఏళ్ల వయసు వారిని ఎంపిక చేసుకున్నారు. వారిని మూడు గ్రూపులుగా విభజించారు. అందులో ఒక బృందానికి రోజుకో సెమాగ్లుటైడ్ మాత్ర ఇచ్చారు. అలా 52 వారాల పాటు ఆ మూడు గ్రూపులకు 14 మిల్లీగ్రాములు, 25, 50 మిల్లీగ్రాముల డోసులతో సెమాగ్లుటైడ్ మాత్రలు ఇచ్చారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరికీ హెచ్‌బీఏ1సీ స్థాయులు 8-10.5 మధ్య ఉన్నాయి. ఇక సెమాగ్లుటైడ్ మాత్రలు వేసుకున్న వారిలో అధిక మోతాదు అంటే 25 ఎంజీ, 50 ఎంజీ డోసు తీసుకున్న రోగుల్లో హెచ్‌బీఏ1సీ స్థాయులు 7 లోపునకు చేరుకున్నట్లు గుర్తించారు. 14 ఎంజీ తీసుకున్న వారిలో హెచ్‌బీఏ1సీ స్థాయులు నియంత్రణలో ఉన్నాయి. అంతేగాక ఈ మాత్ర ఆకలిని అణచివేయడం ద్వారా బరువు తగ్గడానికి కూడా కారణమవుతున్నట్లు గుర్తించారు. 50 ఎంజీ మాత్ర తీసుకున్న వారు 52 వారాల తర్వాత సగటున 8 కేజీల బరువు తగ్గినట్లు తేలింది. 25ఎంజీ తీసుకున్న వారిలో 7 కేజీలు, 14 ఎంజీ తీసుకున్న వారిలో 4.5 కేజీల బరువు తగ్గినట్లు గుర్తించారు.