Weight loss: బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకోవచ్చా?
ABN , First Publish Date - 2023-05-18T12:29:10+05:30 IST
డాక్టర్! నా వయసు 45. అధిక బరువు తగ్గించుకోవడం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. పైగా మందులతో నాకున్న అధిక రక్తపోటు, మధుమేహం కూడా అదుపులోకి రావడం లేదు. అంతిమంగా బేరియాట్రిక్ సర్జరీతో బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. ఈ సర్జరీ గురించి వివరిస్తారా?
డాక్టర్! నా వయసు 45. అధిక బరువు తగ్గించుకోవడం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. పైగా మందులతో నాకున్న అధిక రక్తపోటు, మధుమేహం కూడా అదుపులోకి రావడం లేదు. అంతిమంగా బేరియాట్రిక్ సర్జరీతో బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. ఈ సర్జరీ గురించి వివరిస్తారా?
– ఓ సోదరి, హైదరాబాద్
ఒబేసిటీతో వచ్చిన ప్రతి వ్యక్తీ నేరుగా బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లటానికి వీలు లేదు. ముందుగా రోగికి ఒబేసిటీ అనే పదానికి వైద్యపరమైన అర్ధాన్ని విడమర్చి చెప్పి, ఒబేసిటీ చికిత్సా విధానాలను వైద్యులు వివరిస్తారు. ఇందుకోసం మొదట డైట్ ప్లాన్ సూచిస్తారు. అలాగే శరీరంలో ఎంత కొవ్వు ఉందో తెలుసుకోవటం కోసం ‘ఫ్యాట్ స్కాన్’ చేస్తారు. దాన్ని అనుసరించి, రోగి బాడీ మాస్ ఇండెక్స్‌కు తగిన క్యాలరీలను లెక్కించి అందుకు తగిన ఆహార నియమాలను సూచిస్తారు.
ఎవరికి అవసరం?
బిఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు బేరియాట్రిక్ సర్జరీని వైద్యులు సూచిస్తారు. బిఎమ్‌ఐ 40 కంటే ఎక్కువ ఉన్న సూపర్ ఒబేస్, అంతకంటే ఎక్కువ ఉన్న సూపర్ సూపర్ ఒబేస్, మార్బిడ్ ఒబేస్ రోగులూ ఉంటారు. కానీ 40 బిఎమ్‌ఐ అనేది అమెరికన్ ప్రజల శరీర తీరును బట్టి నిర్ణయించారు. కాబట్టి ఈ లెక్కను ప్రపంచవ్యాప్తంగా అనుసరించటం సరికాదు. మరీముఖ్యంగా ఆసియా దేశాల ప్రజల్లో బిఎమ్‌ఐ 27 – 28 ఉన్నా ఒబేసిటీగానే పరిగణించాల్సి ఉంటుంది. వీళ్లందరికీ వారి వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా ఏడు రకాల బేరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటారు. ఇంతకంటే తక్కువ బిఎమ్‌ఐ ఉండి, మందులతో మెటబాలిక్ డిజార్డర్లు అదుపులోకి రాకుండా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నప్పుడు కూడా బేరియాట్రిక్ సర్జరీ తప్పనిసరి అవుతుంది. ఈ సర్జరీ వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ పనితీరు మెరుగవుతుంది. దాంతో సుగర్, రక్తపోటు, థైరాయిడ్ లాంటి సమస్యలు సర్దుకుని ఆరోగ్యం సమకూరుతుంది. మీ విషయంలో మందులతో మీ ఆరోగ్య సమస్యలు అదుపులోకి రావడం లేదు కాబట్టి బేరియాట్రిక్ సర్జరీని ఆశ్రయించవచ్చు.
ప్రతికూలతలూ ఉన్నాయి
అన్ని సర్జరీలకులాగే బేరియాట్రిక్ సర్జరీకి అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉంటాయి. అవేంటంటే...
జీర్ణాశయం సాగుతుంది: జీర్ణాశయానికి సాగే గుణం ఉంటుంది. స్లీవ్ గ్యాస్ట్రక్టమీ చేసి జీర్ణాశయంలో సగ భాగాన్ని తొలగించినా 8 నుంచి 10 ఏళ్ల వ్యవధిలో అది కొద్ది కొద్దిగా సాగి పూర్తి ఆకారం సంతరించుకుంటుంది. కాబట్టి దీర్ఘకాలం నాన్ ఒబేసిటీ కోరుకునేవారికి ఈ సర్జరీ అనుకూలం కాదు.
ఇన్‌ఫెక్షన్: స్లీవ్ గ్యాస్ట్రక్టమీలో కత్తిరించిన జీర్ణాశయానికి వేసే క్లిప్పులు మధ్య నుంచి ఆహారం శరీరంలోకి లీక్ అయ్యే అవకాశాలుంటాయి. దాంతో సెప్టిసీమియా అనే తీవ్ర సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
రక్తస్రావం: స్లీవ్ గ్యాస్ట్రక్టమీ సర్జరీ తర్వాత క్లిప్స్ నుంచి అంతర్గతంగా రక్తస్రావం జరగొచ్చు. ఈ లక్షణాన్ని సర్జరీ జరిగిన మూడు, నాలుగు రోజుల్లో గుర్తించగలిగితే సరిదిద్దటం తేలిక. అంతకుమించి ఆలస్యమైతే పరిణామాలు ప్రాణాంతకంగా మారతాయి.
పోషకాల లోపం: గ్యాస్ట్రిక్ బైపాస్ వల్ల ఆహారం నేరుగా విసర్జించబడి పోషకాల లోపం ఏర్పడుతుంది. ఈ స్థితిని సరిదిద్దటం కోసం జీవితాంతం విటమిన్, మినరల్ సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది.
ఆహారం లేదా నీరు: గ్యాస్ట్రిక్ బ్యాండింగ్‌లో జీర్ణాశయం చిన్న సంచిలా మారుతుంది కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలో నీటికి చోటుండదు. దాంతో తిన్న వెంటనే నీళ్లు తాగితే వాంతయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆహారం తిన్న కొద్ది సేపటి తర్వాతే నీళ్లు తాగాలి.
డాక్టర్. వరుణ్ రాజు,
లాప్రోస్కోపీ హెచ్‌ఓడి, జనరల్ అండ్ జిఐ సర్జరీ, హైదరాబాద్.