Sinus care: తల నొప్పి కాకుండా.. ముఖమంతా బరువెక్కుతుందా? బీ కేర్ ఫుల్ అంటున్న..!

ABN , First Publish Date - 2023-09-05T12:30:55+05:30 IST

తల నొప్పిని ఎంతో కొంత భరించగలుగుతాం, కానీ తలతో పాటు నుదురు, ముక్కు, చెంప ఎముకలు కూడా నొప్పి పెడుతూ ఉంటే, ఆ బాధను ఏమాత్రం భరించలేం! ఏ పనీ చేసుకోనివ్వకుండా, చీకాకు పెట్టే ఆ సమస్యే

Sinus care: తల నొప్పి కాకుండా.. ముఖమంతా బరువెక్కుతుందా? బీ కేర్ ఫుల్ అంటున్న..!

తల నొప్పిని ఎంతో కొంత భరించగలుగుతాం, కానీ తలతో పాటు నుదురు, ముక్కు, చెంప ఎముకలు కూడా నొప్పి పెడుతూ ఉంటే, ఆ బాధను ఏమాత్రం భరించలేం! ఏ పనీ చేసుకోనివ్వకుండా, చీకాకు పెట్టే ఆ సమస్యే, సైనసైటిస్‌. ఈ సమస్యకు కారణాలు వెతికి, చికిత్సతో సరిదిద్దుకోవడం అవసరం అంటున్నారు వైద్యులు.

తల నొప్పి, ముక్కు నుంచి చిక్కని ద్రవం కారడం, ముక్కు దిబ్బెడ, పొడి దగ్గు, ముక్కు వెనక భాగంలో స్రావం దిగుతున్నట్టు అనిపించడం లాంటివి అక్యూట్‌ సైనసైటిస్‌ లక్షణాలు. ఈ పరిస్థితి ముదిరితే, క్రానిక్‌ సైనసైటిస్‌ దశకు చేరుకుంటాం! దీన్లో తలనొప్పి ఉండదు. ముఖం మధ్య భాగంలో నొప్పి, ముఖం బరువుగా ఉన్నట్టు అనిపించడం, నిస్సత్తువ లాంటి లక్షణాలుంటాయి. ఏడాదిలో ఒకటికి నాలుగు సార్లు అక్యూట్‌ సైనసైటి్‌సకు గురవుతూ ఉంటే అది క్రానిక్‌ సైనసైటి్‌సగా మారుతుంది.

lkl.jpg

ఎవరికి, ఎందుకు?

సాధారణ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ సోకి, ముక్కు నుంచి నీరు కారే సమస్య కాస్తా అక్యూట్‌ సైనసైటి్‌సగా మారవచ్చు. ఈ పరిస్థితిలో ముఖంలోని గాలి గదుల్లో చీము చేరుకుంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌, ముక్కు దిబ్బెడ, ముక్కు నుంచి చిక్కటి స్రావం, శ్వాస సరిగా ఆడకపోవడం, తలనొప్పి, వాసన తగ్గడం లాంటి లక్షణాల రూపంలో బయల్పడుతుంది. ముక్కు దూలం వంకర ఉండడం, ముక్కులో కండలు పెరగడం, అదే పనిగా తమ్ములు, ముక్కు నుంచి నీరు కారే అలర్జిక్‌ రైనైటిస్‌, డస్ట్‌ అలర్జీ, పుప్పొడి, పెంపుడు జంతువులు, సౌందర్య సాధనాల అలర్జీలున్నవాళ్లు సైనసైటి్‌సకు తేలికగా గురవుతూ ఉంటారు. అపరిశుభ్రమైన ఈత కొలనుల్లో ఈత కొట్టడం వల్ల ఆ నీళ్లు ముక్కులోకి చేరుకోవడం వల్ల కూడా సైనసైటిస్‌ రావచ్చు. క్రానిక్‌ సైనసైటి్‌సలో, సైనస్‌ గదుల్లో చీముతో పాటు పాలిప్స్‌, సిస్టులు కూడా ఏర్పడతాయి.

పరీక్షలతో పట్టుకోవచ్చు...

నేసల్‌ ఎండోస్కోపిక్‌ పరీక్షతో సైనసైటిస్‌ తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షలో ముక్కు లోపలికి చిన్న టెలిస్కో్‌పను పంపించి పరీక్షించినప్పుడు ముక్కు దూలం వంకరతో పాటు, ముక్కులో కండలు పెద్దవిగా పెరిగిపోయి ఉండడం, సైనస్‌ డ్రైనేజీల్లో చీము పేరుకుని ఉండడం, పాలిప్స్‌, సిస్టులు ఉండడం మొదలైనవన్నీ కనిపిస్తాయి. అయితే ముఖంలో ఉన్న నాలుగు జతల సైన్‌సలలో దేన్నో సమస్య ఉందో తెలుసుకోవడం కోసం పారానేసల్‌ సైనస్‌ సిటి స్కాన్‌ చేయవలసి ఉంటుంది. గాలి గదుల్లో పేరుకున్న చీము పరిమాణం, ద్రవాల పరిమాణాలు ఈ పరీక్షతో తెలుస్తాయి. రెండు కళ్ల మధ్య ఉండే గాలి గదుల్లో పాలిప్స్‌ పెరుగుతూ ఉంటాయి. వీటి వల్ల కూడా సైనసైటిస్‌ రావచ్చు. వీటిని కూడా సిటి స్కాన్‌తో కనిపెట్టవచ్చు. అలాగే చెంప ఎముక వెనకుండే గాలి గదుల్లో తెల్ల సిమెంట్‌ లాంటి పదార్థం (క్యాల్సిఫికేషన్‌) పేరుకుంటూ ఉంటుంది. ఈ రకమైన అలర్జిక్‌ ఫంగల్‌ సైనసైటిస్‌ కూడా సిటి స్కాన్‌లో కనిపిస్తుంది. కొంతమందికి సైన్‌సలలో మట్టి లాంటి పదార్థం లేదా చిక్కని జెల్లీని పోలిన పదార్థం కూడా పేరుకుపోతూ ఉంటుంది. వీటిని కూడా అలర్జిక్‌ ఫంగల్‌ సైనసైటి్‌సగానే పరిగణించాలి.

dww.jpg

చికిత్స సులువే!

అక్యూట్‌ సైనసైటి్‌సను యాంటిబయాటిక్‌ మందులతో సరిదిద్దవచ్చు. ఈ మందులను పది నుంచి పద్నాలుగు రోజుల పాటు వాడుకోవలసి ఉంటుంది. వీటితో పాటు అలర్జీని అరికట్టే యాంటిహిస్టమిన్లు కూడా వాడుకోవలసి ఉంటుంది. అలాగే మ్యూక్‌సను కరిగించే డీకంజెస్టెంట్లు కూడా వాడుకోవాలి. డ్రైనేజీలను తెరవడం కోసం రోజుకు రెండు సార్లు చొప్పున వారం రోజుల పాటు నేసల్‌ స్ర్పేలు కూడా వాడుకోవచ్చు. అలాగే అక్యూట్‌ సైనసైటి్‌సకు సోడియం బైకార్బొనేట్‌, ఉప్పు, గోరువెచ్చని నీటిలో కలిపి, ఆల్కలైన్‌ నేసల్‌ డూషెస్‌ తయారుచేసుకుని, ముక్కు శుభ్రం చేసుకోవచ్చు. ఇవి పొడుల రూపంలో రెడీమేడ్‌గా కూడా దొరుకుతాయి. ఆ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలర్జీతో సైనసైటి్‌సకు గురవుతున్న వాళ్లు కార్టికోస్టిరాయిడ్‌ నేసల్‌ స్ర్పేలు, యాంటి హిస్టమిన్‌ నేసల్‌ స్ర్పేలు వాడుకోవాలి. క్రానిక్‌ సైనసైటి్‌సలో మూడు వారాల వరకూ యాంటిబయాటిక్స్‌ వాడుకోవలసి ఉంటుంది.

మందులతో సమస్య అదుపులోకి రాకపోయినా, పదే పదే సైనసైటి్‌సకు గురవుతున్నా, సర్జరీ అవసరం పడుతుంది. ముక్కు దూలం వంకరను సరిచేసే ‘సెప్టోప్లాస్టీ’, సహజసిద్ధ నేసల్‌ డ్రైనేజీలను విప్పారేలా చేసే ఫంక్షనల్‌ ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీలను చేయవచ్చు. అలాగే ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీతో సైన్‌సల లోపలి కండలు, పాలిప్స్‌, సిస్టులను కూడా తొలగించవచ్చు. సర్జరీ తర్వాత గాలి గదుల్లోని స్రావాలను శుభ్రం చేయడం కోసం వారానికోసారి చొప్పున మూడు సార్లు, ఎండోస్కోపిక్‌ నేసల్‌ క్లీనింగ్‌ చేయించుకోవలసి ఉంటుంది. పూర్తిగా కోలుకోడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. వారం లోపే లక్షణాలన్నీ తగ్గిపోతాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత సైనస్‌ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత, మళ్లీ సర్జరీ చేయవలసిన పరిస్థితి తలెత్తదు. నేసల్‌ పాలిప్స్‌, అలర్జిక్‌ ఫంగల్‌ సైనసైటిస్‌ సమస్యలు ఉన్నవాళ్లు చికిత్సతో అప్పటికి సమస్య తగ్గినా, తర్వాతి కాలంలో లక్షణాలు కనిపించిన వెంటనే లేదా ప్రతి మూడు నెలలకోసారి వైద్యులను కలుస్తూ పరీక్ష చేయించుకుంటూ అవసరాన్ని బట్టి మందులు వాడుకుంటూ ఉండాలి. ఇలా జాగ్రత్తగా నడుచుకుంటే, భవిష్యత్తులో సర్జరీ అవసరం పడకుండా ఉంటుంది.

bod.jpg

కళ్ల మధ్య, ముక్కుకు ఇరువైపులా, నుదుటి వెనక, మెదడుకు దగ్గర్లో ఇలా ముఖంలో 4 జతల గాలి గదులుంటాయి. ఈ గదులన్నీ ముక్కు గోడల్లోకి తెరుచుకుని ఉంటాయి. వాటికి అవరోధం ఏర్పడినా, గదుల్లో చీ ము, ఇతరత్రా ఫంగస్‌ తాలూకు పదార్థాలు పేరుకున్నా, పాలిప్స్‌, సిస్టులు పెరిగినా సైనసైటిస్‌ మొదలవుతుంది.

నియంత్రణ ఇలా...

  • దగ్గు, జలుబు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు సోకకుండా మాస్క్‌ ధరించాలి.

  • ఈత కోసం శుభ్రమైన నీటి కొలనులనే ఎంచుకోవాలి.

  • చల్లని పదార్థాలు పడని వాళ్లు వాటికి దూరంగా ఉండాలి.

  • తరచూ జలుబు వేధిస్తుంటే, అది సైనసైటిస్‌గా మారక ముందే వైద్యులను కలవాలి

fww.jpg

-డాక్టర్‌ ఎన్‌. విష్ణు స్వరూప్‌ రెడ్డి

చీఫ్‌ కన్సల్టెంట్‌ ఈన్‌టి అండ్‌

ఫేషియల్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌, కేర్‌ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-09-05T12:31:27+05:30 IST