Rainy season: పొంచి ఉన్న రోగాలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

ABN , First Publish Date - 2023-07-22T12:54:56+05:30 IST

వాతావరణం మారింది. వేసవి తాపం నుంచి చల్లని వర్షపు జల్లులోకి అడుగుపెట్టాం. అయితే చిరు జల్లులల మాటున ఎన్నో వ్యాధులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం కురిసే భారీ వర్షాలతో పారిశుధ్య నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంటుంది.

Rainy season: పొంచి ఉన్న రోగాలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

పరిసరాల పరిశుభ్రతతో అంటువ్యాధులకు చెక్

చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలి

హైదరాబాద్, గచ్చిబౌలి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వాతావరణం మారింది. వేసవి తాపం నుంచి చల్లని వర్షపు జల్లులోకి అడుగుపెట్టాం. అయితే చిరు జల్లులల మాటున ఎన్నో వ్యాధులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం కురిసే భారీ వర్షాలతో పారిశుధ్య నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంటుంది. అనేక బస్తీలో ఇళ్ల మధ్యే వర్షపునీరు రోజుల తరబడి నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో చిన్నారులు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాగే మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లలకు అతిసారం, కలరా, డీసెంట్రీ, టైఫాయిడ్‌ తదితర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు వీటిబారిన పడకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడుతున్న వేళ.. వ్యాధులు పొంచిఉన్న సమయాన చిన్నారుల ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవచ్చో లింగంపల్లి ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్‌ శైలజకీర్తి వివరించారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే..

పాఠశాలల్లో క్లోరినేషన్‌ చేసిన మంచినీటిని ఏర్పాటు చేయాలి. ఇళ్లలో తాగేనీరు కాచి చల్లార్చిన తర్వాత తాగడం అలవర్చుకోవాలి. తినే ఆహారంపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. గిన్నెలపై మూతలు తప్పనిసరిగా ఉంచాలి. తాజాగా వండిన ఆహారానే తినేవిధంగా చూడాలి.

చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఆహారం తినేముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. మల, మూత్రవిసర్జన చేసిన సమయంలో తప్పనిసరిగా చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడగాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. శరీరంలో అలసటగా ఉన్నా.. వ్యాధి సోకినట్లుగా అనిపించినా వెంటనే ఓఆర్‌ఎస్‌ తీసుకున్న అనంతరం వైద్యులను సంప్రదించాలి.

లక్షణాలు ఇలా..

అతిసారం: వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, చర్మం సాగేగుణం కోల్పోవడం, మూత్రవిసర్జన తగ్గిపోవుట తదితర లక్షణాలు ఉంటే అతిసారం సోకినట్లుగా గుర్తించాలి.

పచ్చకామెర్లు: ఎక్కువ సమయం జ్వరం, ఆకలి లేకపోవడం, కడుపులో అసౌకర్యంగా ఉండటం, తీవ్రమైన జ్వరంతో కళ్లు, చర్మం, పసుపు పచ్చగా కనబడడం దీని లక్షణాలు.

టైఫాయిడ్‌: పదిరోజుల పాటు జ్వరం పెరుగుతుంది. పొత్తికడుపులో నొప్పిగా ఉండటం, మల్లబద్దకంగా లేదా విరేచనాలు ఉంటాయి. పూర్తిగా అలిసిపోయినట్లుగా బద్దకంగా కనబడతారు. రెండో వారంలో శరీరంపై గులాబీ రంగులో చెమటకాయలతో పొక్కులు ఏర్పడతాయి. పదోరోజు నుంచి జ్వరం పెరుగుతుంది. రక్త పరీక్షలో జ్వరమని తెలితే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.

దోమ కాటువల్ల వచ్చే వ్యాధులు..

దోమకాటు కారణంగా మెదడువాపు, మలేరియా, డెంగు, చికెన్‌గున్య తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. తీవ్రమైన తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దురులు, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది. అధికంగా దాహం, నొప్పులు కలిగితే దోమకాటు వల్ల వ్యాధి సోకినట్లు గ్రహించాలి.

నివారణ ఇలా..

పూల కుండీలు, నీళ్ల ట్యాంకులు, ప్రతి పాత్రలో మూడురోజుల పైబడి నీరు నిల్వ చేయరాదు. ఇంటి పరిసరాల్లో పగిలిన గ్లాసులు, డబ్బాలు, టైర్లు, తాగేసిన కొబ్బరిబొండాలు, పెంకులు ఉంచరాదు. వాటిలో నిల్వ ఉంటే అందులో వ్యాధికారక ఏడిస్‌ దోమ గుడ్లు పెట్టేందుకు ఆస్కారమేర్పడుతోంది. ఇంటి ఆవరణలోని ఎయిర్‌కూలర్లు, ప్లవర్‌వాజులు, మనీప్లాంటు బాటిళ్లలో నీటిని ప్రతి మూడురోజులకు ఒకసారి పారబోయాలి. సెప్టిక్‌ ట్యాంక్‌ గాలిగొట్టాలకు దోమతెర, ఇనుప జాలీలు బిగించాలి. దోమకాటు బారిన పడకుండా చేతులు, కాళ్లను కప్పిఉంచేలా నిండుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇంటి చుట్టుపక్కల, పాఠశాలల ఖాళీ స్థలాల్లో నీరు నిలిస్తే ఆ నీటిలో కిరోసిన్‌, లేదా వాడిన ఇంజన్‌ ఆయిల్‌ చుక్కలు వేయడం ద్వారా దోమలు గుడ్లుపెట్టకుండా నివారించవచ్చు.

Updated Date - 2023-07-22T12:54:56+05:30 IST