Womens Health: ఉద్యోగినులు... ఉక్కుల్లా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-08-22T10:58:31+05:30 IST
ఉరుకులు పరుగులు, హైరానా, ఆందోళన, ఒత్తిడి... వర్కింగ్ విమెన్ పరిస్థితి ఇది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమైపోతూ ఉంటారు. బాధ్యతల్లో భాగంగా శక్తిని ధారపోస్తూ ఉంటారు. అసంతృప్తులతో సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం వర్కింగ్ ఉమెన్ తమకంటూ సమయం కేటాయించుకోవాలంటున్నారు వైద్యులు.
ఉరుకులు పరుగులు, హైరానా, ఆందోళన, ఒత్తిడి... వర్కింగ్ విమెన్ పరిస్థితి ఇది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమైపోతూ ఉంటారు. బాధ్యతల్లో భాగంగా శక్తిని ధారపోస్తూ ఉంటారు. అసంతృప్తులతో సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం వర్కింగ్ ఉమెన్ తమకంటూ సమయం కేటాయించుకోవాలంటున్నారు వైద్యులు.
మహిళలు ఎన్నో రకాల పాత్రలను పోషించాలి. అయితే వాటి ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండాలంటే ఐదు ముఖ్యమైన సూత్రాలను అనుసరించాలి. సాధారణంగా వర్కింగ్ ఉమెన్, ‘నేను బాగానే తింటున్నా. కాబట్టి నాకేం కాదు’.. అనే ధోరణిలో ఉంటారు. మిగతా నాలుగు ఆరోగ్య సూత్రాలు ఇంతకంటే ముఖ్యమైనవి.
ఇంటి వంట అటకెక్కకుండా..
ఆహారం విషయానికొస్తే, సంప్రదాయ ఆహారం, సీజనల్ ఆహారం, స్థానిక ఆహారాలను ఎంచుకోవాలి. ఖరీదైన పదార్థాల్లోనే పోషకాలుంటాయి అనుకోవడం పొరపాటు. మనం తరతరాల నుంచీ తింటూ వస్తున్న ఆహారమే తినాలి. పాశ్చాత్య సంస్కృతులను, ఫ్యాన్సీ డైట్‌లను అనుసరించి జబ్బులు తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఇదే అలవాటు ఇంటిల్లిపాదికీ నేర్పాలి. ఇంటి భోజనాన్నే పోత్సహించాలి. ఎప్పుడైతే ఇంటి వంట అటకెక్కిందో అప్పటి నుంచి వర్కింగ్ ఉమెన్‌లో పిసిఒడి, థైరాయిడ్...ఇతరత్రా జీవనశైలితో ముడిపడిన ఆరోగ్య సమస్యలు పెరగడం మొదలు పెట్టాయి.
ఇంటి పనులే వ్యాయామం
వ్యాయామం కోసం జిమ్‌లకు వెళ్లవలసిన అవసరమే లేదు. ఇంటి పనులతో శరీరానికి సరిపడా వ్యాయామం దొరుకుతుంది. వంట చేయడం, రుబ్బడం, బట్టలు ఉతికి ఆరేయడం లాంటివన్నీ శరీరానికి వ్యాయామం అందించే పనులే! నిజానికి ఇవన్నీ కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు. ఈ పనులు చేస్తే, పొట్ట కూడా పెరగదు. కాబట్టి లాజికల్‌గా ఆలోచించి, వంట చేయడం, వంట పూర్తయ్యాక గిన్నెలు కడగడం లాంటి పనులు చేసుకోవాలి. ఈ పనుల్లో ఇంటిల్లిపాది ప్రమేయం కూడా ఉండాలి. పనులను పంచి, పని భారాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్, చకచకా మిషన్లలా ఒక్కరే పనులన్నీ చేసేసుకుంటూ హైరానా పడిపోతూ ఉంటారు. వంటగదిలోకి పిల్లలను, భర్తనూ అడుగు పెట్టనీయరు. కానీ ఇంటికి సంబంధించిన ప్రతి పనిలో కుటుంబ సభ్యులందరి ప్రమేయం ఉండేలా చూసుకోవాలి. అలాగే వర్కింగ్ ఉమెన్ ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయాన్ని గడపడం కూడా అవసరమే! రోజూ కొద్ది సేపు వాకింగ్ చేయగలిగినా ఫిజికల్ ఫిట్‌నెస్ భేషుగ్గా ఉంటుంది. 15 నిమిషాల నుంచి అరగంట పాటు యోగా చేసుకుంటే, భావోద్వేగాలను సంతులనం చేసే మెలకువలు అలవడతాయి. కుటుంబంలో దృఢమైన వ్యక్తులుగా మసలుకునే మహిళలు మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించిన నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మహిళలు మానసికంగా దృఢంగా, చురుగ్గా కూడా ఉండగలిగితే, వాళ్లల కుటుంబానికెంతో అందించగలుగుతారు.
ఆరోగ్యంపై కన్నేసి ఉంచి...
ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, విటమిన్ సప్లిమెంట్లు కూడా వాడుకుంటూ ఉండాలి. పూర్వం మహిళలు మేడ మీద వడియాలు, ఒరుగులు పెడుతూ, ఎండ సోకే పనులెన్నో చేసే వాళ్లు. కాబట్టి విటమిన్ డి లోపం ఉండేది కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంట్లో, ఆఫీసులో నీడ పట్టున పని చేస్తారు. కాబట్టి వర్కింగ్ ఉమెన్‌లో విటమిన్ డి లోపం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విటమిన్ లోపిస్తే, శరీరం క్యాల్షియంను శోషణ చేసుకోలేదు. దాంతో ఎముకలు పెళుసుగా మారిపోతాయి. ఇందువల్లే నేల మీద పడిపోతే చాలు. ఎముకలు విరిగిపోతున్నాయి. కాబట్టి వర్కింగ్ ఉమెన్ విటమిన్ డి సప్లిమెంట్లు వాడుకోవాలి. అలాగే వర్కింగ్ ఉమెన్‌లో పునరుత్పత్తి సమస్యలు, నెలసరి క్రమం తప్పడం, అనీమియా, ఒబేసిటీ మొదలైన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యను ప్రారంభంలో కనిపెట్టి, సరిదిద్దుకోవాలి. పరీక్షల్లో భాగంగా అలా్ట్ర సౌండ్, పాప్‌స్మియర్, సోనో మామోగ్రామ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే థైరాయిడ్, షుగర్ పరీక్షలు కూడా అవసరమే! అలాగే 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా క్యాల్షియం సప్లిమెంట్లు, న్యూట్రిషనల్ సప్లిమెంట్లు తీసుకోవలసిందే!
మానసిక ఆరోగ్యం కీలకం
ఒత్తిడిని ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. స్ట్రెస్ మ్యానేజ్‌మెంట్ లోపిస్తే, ఆరోగ్యం దెబ్బ తింటుంది. కొందరికి ఇల్లు, ఆఫీసు ఒత్తిడులతో నిద్ర పట్టని పరిస్థితి ఉండొచ్చు. రేపు చేయవలసిన పనుల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకోలేని మహిళలూ ఉంటారు. అది ఎలాంటి ఒత్తిడి అయినా దాని ప్రభావం మూలంగా మహిళలు సరిగా భోజనం చేయలేరు. ఏ పనినీ మనసు పెట్టి చేయలేరు. ఆఫీసు పనుల్లో కూడా వెనకపడతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. నిజానికి అదొక కళ. దాని మీద పట్టు సాధించడం కోసం ఆఫీసు ఆందోళనలను ఇంటికి వెంట తెచ్చుకోకూడదు. వాటిని ఆఫీసులోనే వదిలేయాలి.
కంటి నిండా నిద్ర
వర్కింగ్ ఉమెన్‌కు నిద్ర తక్కువే! ఇల్లు చిందరవందరగా కనిపిస్తే, లేని ఓపిక తెచ్చుకుని మరీ సర్దేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నంత సేపూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఒళ్లు సహకరించకపోయినా, పనులన్నీ ఒంటి చేత్తో చేయడానికి పూనుకుంటూ ఉంటారు. అదే పనిగా పనులు చేసుకుంటూ పోతే, రోజంతా చేయవలసిన పనులు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఆపాలో ఎవరికి వారు గ్రహించుకోవాలి. శరీరం మిషన్ కాదు కదా! నిజానికి మిషన్‌లను కూడా ఆపేసి, వాటికి విశ్రాంతినిస్తూ ఉంటారు. కానీ వర్కింగ్ ఉమెన్ బెడ్ మీద పడుకున్నా, రేపు చేయవలసిన పనులేమున్నాయి?, పొద్దున్నే ఏం వండాలి? అనే ఆలోచనలతో నిద్రకు దూరమైపోతూ ఉంటారు. కానీ శరీరానికి సరిపడా విశ్రాంతినివ్వాలి. శరీరం తనను తాను నిద్రలోనే మరమ్మతు చేసుకుంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని శరీరానికి ఇస్తే, అది మరింత మెరుగ్గా పని చేస్తుంది. కంటి నిండా నిద్ర పోవాలి. ఆహారం, వ్యాయామం, స్ట్రెస్ మ్యానేజ్‌మెంట్, నిద్ర, వార్షిక పరీక్షలు... వర్కింగ్ ఉమెన్ ఆరోగ్యానికి ఇవి ఐదు పునాదుల్లాంటివి. వీటిలో ఏ ఒక్కటీ శిధిలమవకుండా చూసుకోవాలి. వార్షిక పరీక్షలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. కానీ మిగతా అంశాలకు డబ్బు అవసరమే లేదు. వాటికి అంకిత భావం, సమయాలు సరిపోతాయి. ఇది ప్రతి మహిళకూ సాధ్యమే!
కుటుంబ తోడ్పాటు
మహిళలు ప్రేమకు పడిపోతారు. పిల్లలు, భర్త ప్రేమ కోసం పరితపిస్తారు. వాళ్లను సంతోష పెట్టడం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. నచ్చిన వంటలు వండుతారు. ఇంటి పనులన్నీ మీదేసుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మిగతా కుటుంబ సభ్యులందరూ గమనించాలి. పని భారమంతా తల్లి మీదే మోపకుండా, అందరూ సమంగా పంచుకోవాలి. కూరగాయలు తరిగివ్వడం, బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడం, ఆఫీసుకు వెళ్లే అమ్మ దుస్తులను ఇస్త్రీ చేయడం, ఇల్లు సర్దడం, అమ్మకు అదనపు శ్రమను లోను చేసే పనులు చేయకపోవడం.. లాంటివి పిల్లలు పాటించాలి.
ఇదే సూచన
శరీరం ఆరోగ్యంగా ఉంటే, నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. ఎప్పుడైతే నెలసరి అటూ ఇటూ అవుతుందో శరీర ఆరోగ్యం గాడి తప్పిందని అర్థం చేసుకోవాలి. అలాగే మెనోపాజ్‌కు చేరుకున్న వర్కింగ్ ఉమెన్ మునుపటిలా చురుగ్గా ఉండాలంటే, వయసు పైబడే తీరు మీద దృష్టి పెట్టాలి. పెరిగే వయసుకు తగ్గట్టు జీవనశైలిని అడ్జస్ట్ చేసుకోవాలి. వండుకునే అవసరం లేని పోషకాహారాలు కూడా ఉన్నాయి. పండ్లు, నట్స్, సీడ్స్, పచ్చి కూరగాయలు, మొక్కజొన్న... ఇవన్నీ పోషక భాండాగారాలే! వీటితో పాటు ఉడకబెట్టిన గుడ్డు ప్రతి రోజూ తినాలి. నట్స్ అనగానే బాదం, వాల్‌నట్స్ లాంటి ఖరీదైనవే తినవలసిన అవసరం లేదు. వేరుసెనగ పప్పులో కూడా పోషకాలుంటాయి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు తినాలి. ఇదొక హెల్తీ స్నాక్. 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇదొక వండర్ ఫుడ్.
సమయం కేటాయించుకోవాలి
అందరికీ సమయాన్నిచ్చి, మనకు మనం సమయాన్ని మిగుల్చుకోలేకపోతే ఎలా? ప్రతి మహిళా తనకంటూ సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయాన్ని చేజిక్కించుకోవడం కోసం బాధ్యతలను కుటుంబం మొత్తానికీ పంచాలి. పిల్లలకు వంట నేర్పిస్తే, వాళ్లు ఇంట్లో వంట చేయడమే కాకుండా, పైచదువుల కోసం ఎక్కడకు వెళ్లినా స్వయంగా వండుకుని తినగలుగుతారు. అలాగే భర్తతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావాలి. ఎమోషనల్ కనెక్షన్ అనేదే లోపిస్తే, అనుబంధం బలహీనపడిపోతుంది. కాబట్టి ఆఫీసు, ఇంటి పనులతో రోజంతా తీరిక లేకుండా గడిపినా, భర్తతో అనుబంధం కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే తమకు నచ్చిన పనులకు, తమకు సంతోషాన్నిచ్చే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త సినిమా చూడాలనిపిస్తే, భర్త, పిల్లలకు వీలుపడనంత మాత్రాన ఆగిపోకూడదు. ఇలా వర్కింగ్ ఉమెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటిస్తూ, తమ కోసం జీవించడం నేర్చుకోవాలి.
-డాక్టర్ శిల్పి రెడ్డి,
అబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్,
క్లినికల్ డైరెక్టర్ హెచ్‌ఒడి కిమ్స్ కడిల్స్ మదర్ అండ్ ఛైల్డ్ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్.