పేషెంట్లు గూగుల్‌ను నమ్మొచ్చా..? వైద్యుల వాదనలో నిజమెంత?
ABN , First Publish Date - 2023-05-23T11:43:04+05:30 IST
మనకొచ్చే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ సవాలక్ష కారణాలుంటాయి. కానీ అవన్నీ ప్రాణాంతకం అవొచ్చు, కాకపోవచ్చు. అయినా తలనొప్పి లాంటి చిన్న సమస్య తలెత్తగానే
గూగుల్ సమాచారంతో తమ దగ్గరకొచ్చి, ప్రశ్నలతో విసిగిస్తే వైద్యమెలా సాధ్యపడుతుందనేది వైద్యుల ఫిర్యాదైతే, తమకున్న ఆరోగ్య సమస్య గురించి వివరించకుండా చికిత్స అందిస్తే వ్యాధి పట్ల అవగాహన ఎలా వస్తుందనేది రోగుల వాదన. ఈ రెండు వాదనల్లో నిజమెంత? అసలు ఆరోగ్య సమస్యల గురించిన సమాచారం కోసం గూగుల్‌ను ఎంతవరకూ ఆశ్రయించవచ్చు? రోగులకు వారి రుగ్మతల గురించి వివరించాల్సిన బాధ్యత వైద్యులకు ఎంత మేరకు ఉంది?
మనకొచ్చే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ సవాలక్ష కారణాలుంటాయి. కానీ అవన్నీ ప్రాణాంతకం అవొచ్చు, కాకపోవచ్చు. అయినా తలనొప్పి లాంటి చిన్న సమస్య తలెత్తగానే వెంటనే గూగుల్‌లో కారణాల కోసం వెతుకుతాం. అసలు కారణం పని ఒత్తిడే అయినా గూగుల్‌లో సర్చ్ చేస్తే.... బ్రెయిన్ ట్యూమర్ మొదలు క్యాన్సర్ వరకూ తలనొప్పికి ఉన్న వందల కారణాలు ప్రత్యక్షమవుతాయి. దాంతో మనకొచ్చింది ఎలాంటి రుగ్మతో అర్థం కాక కంగారు పడిపోయి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. అక్కడ వైద్య పరీక్షలు చేసి మనకున్న సమస్య ఫలానా అని తేలినా అంతటితో ఊరుకోకుండా, గూగుల్ నేర్పిన ఙ్ఞానంతో లెక్కలేనన్ని అనుమానాలతో సతమతమవుతాం! ఈ ధోరణి మారాలి.
గూగుల్‌ను ఎంతవరకూ నమ్మొచ్చు?
ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్‌కు బదులుగా గూగుల్ డాక్టర్‌ని సంప్రదించే ధోరణి పెరిగిపోతోంది. ఇంటర్నెట్, కంప్యూటర్లు అందరికీ అందుబాటులోకొచ్చాక ఎంత చిన్న ఆరోగ్య సమస్యకైనా పరిష్కారాన్ని గూగుల్‌లో వెతుక్కునే అలవాటు మొదలైంది. తమకొచ్చిన ఆరోగ్య సమస్య గురించిన అవగాహన ఏర్పరుచుకోవటం రోగులకెంతో అవసరం. అందుకోసం మొదట వైద్యులనే ఆశ్రయించాలి. గూగుల్ అనేది ఓ ప్రత్యామ్నాయం మాత్రమే!
సైబర్‌ఖాండ్రియా
2001లో బిబిసి వ్యాసంలో మొదటిసారి ప్రత్యక్షమైన ఈ పదాన్ని పరిశోధకులు ‘ఇంటర్నెట్ ప్రేరేపిత వైద్యపరమైన ఆందోళన’ సంబోధనలో వాడటం మొదలుపెట్టారు. తమ లక్షణాలను బట్టి గూగుల్‌లో సదరు వ్యాధి గురించి వెతికే నెటిజన్ల సంఖ్య ఎక్కువైంది. మొత్తం సర్చ్‌ల్లో ఒక శాతం పూర్తిగా వైద్య పరమైన అంశాల గురించే ఉంటున్నాయని గూగుల్ స్వయంగా తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. దీన్నిబట్టి నెటిజన్లు, సాధారణ ప్రజలు తమ ఆరోగ్య సమస్యల కోసం గూగుల్‌ను ఎంతగా ఆశ్రయిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ధోరణిని విస్తృత పరిధిలో చూస్తే ఇలాంటి రోగుల అర్థంలేని, అనుమానాల వల్ల, అనవసర పరీక్షలతో వైద్యుల విలువైన కాలం, రోగుల కష్టార్జితం రెండూ వృఽథా అవుతున్నట్టు తేటతెల్లమౌతుంది. అడపా దడపా తమకున్న ఆరోగ్య సమస్య గురించిన అదనపు సమాచారాన్ని గూగుల్‌లో వెతుక్కుంటే ఫర్వాలేదు. అలాకాకుండా లక్షణాల ఆధారంగా గూగుల్ సర్చ్ చేసి వ్యాధి ఉన్నట్టు కుంగిపోయినా, వ్యాధి ఉందని నిర్ధారణకొచ్చినా, తరచుగా తమ లక్షణాలను గమనించుకుంటూ లేనిపోని అనుమానాలతో తరచుగా వైద్యుల్ని కలుస్తున్నా ‘సైబర్‌ఖాండ్రియా’ ఉందని అనుమానించాలి.
గూగుల్‌తో సమస్యలివే!
జలుబు, దగ్గులాంటి స్వల్ప రుగ్మతలకు గృహ వైద్యం కోసం గూగుల్ మీద ఆధారపడొచ్చు. వైద్య చికిత్స అనంతరం అదనపు సమాచారం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన వివరాల కోసం కూడా గూగుల్‌ను ఆశ్రయించొచ్చు. కానీ వాటికోసం గూగుల్ సర్చ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...
నమ్మదగిన వెబ్‌సైట్లు: ఎవరైనా వెబ్‌సైట్ తయారుచేయొచ్చు. కాబట్టి నమ్మదగిన, ఆధారపడదగిన సమాచారం కొన్ని వెబ్‌సైట్లకే పరిమితమై ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలలో ‘క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ మొదలైన వెబ్‌సైట్లను సర్చ్ చేయొచ్చు.
పరిష్కారాలు ముఖ్యం, సమస్యలు కాదు: అరుదైన లక్షణం గురించిన సమాచారం కనిపించినప్పుడు దాని గురించి లోతుగా సర్చ్ చేస్తే, అది చివరికి మీకున్న ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ముడిపడిన లక్షణంగా అనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి గూగుల్‌లో సమాచారాన్ని వెతికి పట్టే పద్ధతి కూడా పాటించాలి. ఉదాహరణకు...‘అలసట’ గురించి తెలుసుకోవాలనుకుంటే, ‘అలసట దూరం చేసేదెలా?’ అని వెతకాలి.
మెసేజ్ బోర్డులో: ఉప్పు, కర్పూరంలా వేర్వేరు వ్యాధులు ఒకే లక్షణాలను కలిగి ఉండొచ్చు. కాబట్టి మీ సమస్య లక్షణాలను మెసేజ్ బోర్డులో పోస్ట్ చేసి సమాధానాలను నమ్మేయటం లేదా అప్పటికే పోస్ట్ చేసిన ఇతరుల మెసేజ్‌లు చదివి వాటి ఆధారంగా వ్యాధి గురించి నిర్థారణకు రావటం సరికాదు.
వైద్యులను కలిసిన తర్వాతే: చికిత్స గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవటం అవసరమే! అయితే అది వైద్యుల్ని కలిసిన తర్వాత చేయవలసిన పని. చికిత్స ప్రభావం, దుష్ప్రభావాలు (ఉంటే?) వాటి గురించి గూగుల్‌లో తెలుసుకుని వైద్యులతో అనుమాన నివృత్తి చేసుకోవటం మంచిదే!
వైద్యులను నిర్భయంగా అడగొచ్చు
రోగులు తమకున్న ఆరోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాల్ని వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు. వ్యాధికి కారణం, పరీక్షల అవసరం, చికిత్స తీరు, ప్రత్యామ్నాయాలు...ఇలా వ్యాధికి సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు.